అగ్నిప్రమాదం సంభవించిన భవనం వద్ద సహాయక చర్యలు..
సాక్షి, హైదరాబాద్/అబిడ్స్: నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఓ ఫర్నిచర్ షాపులో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు వ్యక్తులు అగ్నికీలల్లో చిక్కుకున్నారు.వీరిలో ఒకరు తప్పించుకుని బయటపడగా..మిగతా ఐదుగురి ఆచూకీ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా లభించలేదు. వివరాల్లోకి వెళ్తే.. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందీ ప్రచార సభ పక్కన ఉన్న ఐదంతస్తుల సాయి విశ్వాస్ చాంబర్‌లో బచాస్ ఫర్నిచర్ క్యాస్టిల్ పేరుతో వివిధ రకాల ఫర్నిచర్ వ్యాపారాలను సతీశ్ అనే వ్యాపారి నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో అకస్మాత్తుగా ఈ భవనంలో మంటలు ఎగసిపడ్డాయి. దీనిపై వెంటనే యజమాని సతీశ్ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ భవనంలో మంటలు, దట్టమైన పొగలు వస్తున్నాయని పోలీసులకు తెలపడంతో అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్‌కుమార్ కొద్ది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని ముందుగా పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. నాంపల్లి స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అన్ని రహదారులను మూసివేశారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 20 ఫైరింజన్లను రప్పించి మంటలను ఆర్పించారు. అగ్నికీలలు, దట్టమైన పొగ క్షణ క్షణానికి పెరుగుతుండడంతో రాత్రి వరకు అందులో ఉన్న వారిని బయటకు తీసుకురాలేక పోయారు. కాగా, ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులు
ఫర్నిచర్ దుకాణం భవనంలో ఐదుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. సెల్లార్ వాచ్‌మెన్ యాదయ్య, లక్ష్మి దంపతుల పిల్లలు ప్రణీత్, అఖిల్‌తో పాటు ఆటో డ్రైవర్ హబీబ్, ఇంతియాజ్, స్వీపర్ బీబీలు చిక్కుకున్నవారిలో ఉన్నారు. అయితే అఖిల్ (7), ప్రణీత్ (11)గన్¸ûండ్రీలోని ప్రభుత్వ ఆలియా పాఠశాలలో చదువుతున్నారు. శనివారం పాఠశాలకు వెళ్లకపోవడంతో ఇద్దరు పిల్లలను సెల్లార్‌లోని ఇంట్లోనే ఉంచి తల్లిదండ్రులు ఇద్దరు బయట ఉన్నారు. అదే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఆ ఇద్దరు పిల్లలను తీసుకువచ్చేందుకు ఫర్నిచర్ షాపులో పనిచేసే ఇద్దరు వ్యక్తులు సెల్లార్‌లోకి వెళ్లారు. ఈ ఇద్దరితోపాటు అందులో పని చేసే మరో ఇద్దరు సెల్లార్‌లో చిక్కుకున్నట్లు తోటి వర్కర్లు వెల్లడించారు. వీరిలో ఒకరు తప్పించుకొని బయటపడ్డాడు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు ఫైర్ పోలీసు, ఇతర శాఖల అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సెల్లార్‌లో ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలు, దట్టమైన పొగలు ఆర్పడంతో సెల్లార్ మొత్తం నీటితో నిండిపోయింది. ఐదుగురు వ్యక్తులను బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
రోబోను పంపించినా...
అగ్నిప్రమాదాన్ని అదుపులోకి తేచ్చేందుకు పోలీసులతో పాటు హైడ్రా, డిజాస్టర్ ఫోర్స్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఫైర్, టాస్‌్కఫోర్స్ పోలీసులతో పాటు పలువురు అధికారులు అర్థరాత్రి వరకు శ్రమించారు. మంటలు అదుపులోకి వచి్చన్నప్పటికీ పొగ తీవ్రత ఇంకా అదుపులోకి రాలేదు. సెల్లార్‌లో ప్లాస్టిక్ వస్తువులు, ఫర్నిచర్ ముడిపదార్థాలు ఉండడంతో ఆరు గంటలైనా భవనం నుంచి దట్టమైన పొగ తగ్గలేదు. ఫైర్ ఉన్నతాధికారులు రోబోను కూడా భవనంలోకి మంటలను, పొగలను నివారించేందుకు పంపించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అర్థరాత్రి వరకు దట్టమైన పొగలు అదుపులోకి రాలేదు.రెస్క్యూ పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
బ్రామ్‌టో ఫైర్ మిషన్‌తో..
ఫైర్ అధికారులు బ్రామ్‌టో ఫైర్ మిషన్‌తో మంటలను, దట్టమైన పొగలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయతి్నంచారు. అతి పెద్దదైన బ్రామ్‌టో మిషన్‌లో ఫైర్ సిబ్బంది ఉండి భవనం పరిసరాల 4, 5 వ అంతస్థుల అద్దాలను పగలగొట్టి మంటలను, పొగలను అదపులోకి తెచ్చేందుకు కృషి చేశారు.
నిమిషంలో తప్పించుకొని..
నాంపల్లి అగ్నిప్రమాదం నుంచి నిమిషం వ్యవధిలో తప్పించుకున్నాడు సంతోష్ అనే వ్యక్తి. ప్రమాదం జరిగిన సమయంలో సంతోష్ బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో ఉన్నాడు. సెల్లార్‌లో మంటలు చెలరేగిన నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తం వ్యాపించాయి. అయితే ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమైన సంతోష్ నిమిషాలలో మెట్లపై నుంచి వేగంగా బయటికి వచ్చేశాడు. క్షణం ఆలస్యమైనా మంటల్లో చిక్కుకునేవాడనని సంతోష్ పేర్కొన్నారు.
మంటలను అదుపులోకి తెచ్చాం : రాష్ట్ర ఫైర్ విభాగం డీజీ విక్రమ్‌సింగ్ మాన్
ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురు చిక్కుకున్నారని తెలంగాణ రాష్ట్ర ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ పేర్కొన్నారు. శనివారం రాత్రి సంఘటన స్థలాన్ని ఆయన సందర్శించారు. ఫైర్, ఇతర అధికారులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ పనులపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవనం కింద రెండు సెల్లార్‌లు ఉన్నాయన్నారు. మొదటి సెల్లార్‌లో ఫర్నిచర్‌కు సంబంధించిన మెటీరియల్స్, ఇతర ముడి పదార్థాలు ఉండడంతోనే సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. మంటలను అదుపులోకి తెచ్చామని, సెల్లార్లలో దట్టమైన పొగలు రెస్క్యూ ఆపరేషన్ ద్వారా అదుపులోకి తీసుకువచ్చి ఇందులో చిక్కుకున్న ఐదుగురిని బయటకు తెస్తామన్నారు. 200 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని వివరించారు.
సజ్జనర్, కలెక్టర్ హరిచందన సందర్శన
సంఘటన స్థలాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, సీపీ సజ్జనర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారన్నారు. అందులో చిక్కుకున్న వారిని సురక్షితంగా తెచ్చేందుకు ఫైర్‌తో పాటు ఇతర శాఖల అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
రోబో యంత్రాన్ని తొలిసారిగా వాడిన అగ్నిమాపక శాఖ
నాంపల్లిలో శనివారం జరిగిన భారీ అగ్ని ప్రమాద సంఘటనలో పేలుళ్లను నిరోధించేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు అగ్నిమాపక శాఖ రోబో ఫైర్ మిషన్‌ను హైదరాబాద్‌లో తొలిసారిగా ఉపయోగించింది. ఘటనా స్థలంలో జేసీబీ, భారీ క్రేన్లతో సహాయక చర్యలు చేపట్టినా అగ్నికీలలు, దట్టమైన పొగ కారణంగా సిబ్బంది లోపలికి వెళ్లేందుకు వీలు కాలేదు. దీంతో అగ్నిమాపక శాఖ రోబో శకటాన్ని రంగంలోకి దింపింది. రోబో ఫైర్ మిషన్ అనేది అగ్ని ప్రమాదాల సమయంలో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు, అగ్నిమాపక సిబ్బందికి సహాయం చేయడానికి తయారు చేసిన సిస్టమ్. అగ్నిమాపక సిబ్బంది వెళ్లలేని పరిస్థితుల్లో ఈ రోబో ఫైర్ మిషన్ భవనం లోపలికి వెళ్లి మంటలను ఆర్పుతుంది. అలాగే సురక్షిత మార్గాన్ని అన్వేíÙంచి, బయట ఉన్న సిబ్బందికి మార్గాన్ని సూచిస్తుంది.


