ఇంకా.. మునకలోనే!

Many Colonies Still Underwater In Hyderabad - Sakshi

వరద నీటిలోనే 200కు పైగా కాలనీలు

ఇళ్లు ఖాళీ చేస్తూ కన్నీటి పర్యంతమైన బాధితులు

వారం రోజల్లో 33 మంది మృత్యువాత

నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మోస్తరు వర్షం

సాక్షి, హైదరాబాద్‌: చినుకు రాలితే నగరవాసి గజగజ వణికిపోతున్నాడు. వారం రోజులుగా హైదరాబాద్‌ను ముంచె త్తిన వర్షాలు ఇంకా వీడటం లేదు. వరుణుడు శాంతించడం లేదు. బస్తీ ల్లోని పేదలకు ఉపశమనం కనిపించ డం లేదు. రాబోయే మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవ కాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరి కలు జారీ చేయ డంతో హైదరాబాద్‌ మహానగరంలోని ముంపు ప్రాంతాల ఇళ్లన్నీ ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే వరద వణికిస్తుండగా, మళ్లీ భారీ వర్షాలు పడితే పరిస్థితి ఏంటనే ఆందోళన నెలకొంది. గత వారం రోజులుగా నీళ్లలో నానుతున్న కాలనీలు, బస్తీల్లోని ఇళ్లు, బహుళ అంతస్తుల్లోని కుటుంబాలన్నింటినీ జీహెచ్‌ ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు.

కొత్తగా ముప్పు పొంచివున్న లోతట్టు ప్రాంతాలను కూడా గుర్తించి... ఖాళీ చేయిస్తున్నారు. కొన్ని కుటుంబాలు ఇళ్లు విడిచివచ్చేం దుకు సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. జీవితాన్ని ధారపోసి కొన్నా మని.. ఎలా ఖాళీ చేయాలంటూ బాధితులు కన్నీటిపర్యంతమవు తున్నారు. భారీ వర్షం, వరద నీటితో నానిన భవనాల పునాదులు, గోడలు బలహీనపడి దెబ్బతినే అవకాశం ఉం దని, వాటిల్లో ఉండటం సురక్షితం కాదని అధికారులు అవగాహన కల్పి స్తున్నారు. ఇంకా 200కు పైగా కాలనీలు నీటిలోనే నానుతు న్నాయి. సోమవారం నగరమంతటా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. 

37 వేల కుటుంబాలు...
నగరంలో నీట మునిగిన కాలనీలకు చెందిన సుమారు 37 వేల కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలినట్లు అధికారగణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కొందరు పునరావాస కేంద్రాలకు చేరుకోగా, మరికొందరు తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. వాస్తవానికి ముంపునకు గురైన కుటుంబాలు దీనికి రెట్టింపు ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలతో వరద చేరి గుర్రంచెరువు, పల్లెచెరువు, అప్పా చెరువులు తెగిపోగా, మరికొన్ని చెరువులు నిండుకుండలుగా మారి ప్రమాదకరంగా తయారయ్యాయి. కొత్తగా గుర్తించిన ముంపు ప్రాంతాలపై సైతం అధికార యంత్రాంగం దృష్టి సారించింది. నీట మునిగిన కాలనీల నుంచి బాధిత కుటుంబాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ అధికారులు సుమారు 20 బోట్లను వినియోగిస్తుండగా, మరో 30 బోట్లను ఏపీ, కర్ణాటకల నుండి తెప్పించే చర్యలు చేపట్టారు. 

గడ్డిఅన్నారం డివిజన్‌లోని కోదండరాంనగర్, శారదానగర్, సీసలబస్తీ, న్యూగడ్డిఅన్నారం కాలనీ, కమలానగర్‌ ప్రాంతాల్లో వరద నీరు తగ్గకపోవడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు నీట మునిగిన ఇండ్లలోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మల్లికార్జున్‌నగర్, అయ్యప్పకాలనీ వాసులను మాన్సూరాబాద్‌లోని ఎంఈ రెడ్డి గార్డెన్‌లో ఏర్పాటు చేసి పునరావాస కేంద్రానికి తరలించారు. కాలనీలో పై అంతస్తుల్లో ఉన్నవారికి జీహెచ్‌ఎంసీ సిబ్బంది కొంత మేరకు పడవల ద్వారా వెళ్లి సహాయం అందించారు. మరోవైపు పలు స్వచ్ఛంద సంస్థలు సైతం వారం రోజులుగా బాధితులను çసురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యాయి.

ఎల్బీనగర్‌ ప్రాంతంలోని కోదండరాం నగర్‌లో వరద బాధితులను తరలిస్తున్న సహాయక సిబ్బంది 

పురానాపూల్‌ బ్రిడ్జికి స్వల్పంగా పగుళ్లు
భారీ వర్షం, వరద ఉధృతికి పాతబస్తీలోని పురానాపూల్‌ కొత్త వంతెనకు స్వల్పంగా పగుళ్లు వచ్చాయి. మూడు దశాబ్ధాల క్రితం నిర్మించిన వంతెన కింది భాగం కొంత శిధిలావస్ధకు చేరుకున్నట్లు కనిపిస్తోంది.సోమవారం జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన సీఈ, అధికారులు వంతెనను పరిశీలించారు. వంతెన పైనుంచి భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

33 మంది మృత్యువాత
ఎడతెరిపిలేని భారీ వర్షాలు, వరదలతో రాజధానిలో వారం రోజుల వ్యవధిలో సుమారు 33 మంది మృత్యువాతపడ్డారు. అందులో హైదరాబాద్‌ నగరానికి చెందిన 18 మంది, శివారు ప్రాంతాలకు చెందిన 15 మంది ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు 29 మందికి సంబంధించిన ఎక్స్‌గ్రేషియా బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. 

చెరువులు ఇలా..
నగర శివారులోని మీర్‌పేట పెద్ద చెరువుకు వరద ఉ«ధృతి పెరిగి ప్రమాదకరంగా తయారైంది. కట్టతెగే ప్రమాదం ఉన్నందున జనప్రియ మహానగర్, న్యూబాలాజీనగర్, టీఎస్‌ఆర్‌నగర్, ఎంఎల్‌ఆర్‌నగర్, ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ కాలనీలు ఖాళీ చేశారు. ఇప్పటికే మంత్రాల చెరువు కట్ట తెగడంతో దిగువన గల మిథులానగర్, సత్యసాయినగర్‌ కాలనీలు కూడా ఖాళీ అయ్యాయి. 
తాజాగా మన్సూరాబాద్‌ చిన్నచెరువు నిండుకుండలా మారి ప్రమాదకరంగా తయారైంది. దీంతో సోమవారం కింది భాగంలోకి కాలనీలు ముంపునకు గురికాకుండా చెరువుకు గండికొట్టి నీటిని డ్రైనేజీ నాళాలోకి మళ్లించే ఏర్పాట్లు చేశారు. 
జీడిమెట్ల ఫాక్స్‌సాగర్‌ చెరువు నిండడంతో కాలువలు తవ్వి వరదనీటిని బయటకు వదిలారు. గంపలబస్తీ, సుభాష్‌నగర్, హనుమాన్‌ ఆలయం ప్రాంతాల్లో రోడ్లపై వరదనీరు ఏరులై పారింది.
టోలిచౌకిలోని నదీమ్‌కాలనీ, విరాసత్‌నగర్‌ కాలనీ, జమాలి కుంట, వలీ కాలనీ, నీరజా కాలనీలు ఇంకా నీటిలో నానుతూనే ఉన్నాయి. భక్తావర్‌ గూడ నుండి నిజాం కాలనీ మీదుగా వరద నీరు టోలిచౌకి వచ్చి చేరుతోంది. హకీంపేట్‌ బుల్కాపూర్‌ నాలా, హీరానగర్‌ నాలాలు పొంగిపొర్లుతున్నాయి.

వీడని అంధకారం
నగరంలో నీట మునిగిన కాలనీలు వారం రోజులుగా చీకటిలోనే మగ్గుతున్నాయి. కొన్నిచోట్ల విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించినా... ఎల్బీనగర్, చార్మినార్‌ జోన్లలో ఇంకా చాలాచోట్ల కరెంటు లేదు. అపార్ట్‌మెంట్‌ సెల్లార్లు,, వీధుల్లో ముంపు కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్‌ సరఫరా నిలివేశారు. ముంపు ప్రాంతాల్లో వందల కొద్ది విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా ఇప్పటివరకు 920 పునరుద్ధరించారు. వరద ఉధృతి తగ్గగానే మిగిలిన ట్రాన్స్‌ఫార్మర్లకు సరఫరా పునరుద్ధరిస్తామని విద్యుత్‌ అధికారులు పేర్కొంటున్నారు. 

సహాయక చర్యలు
వరద సహాయక, పునరావాస చర్యలను జీహెచ్‌ఎంసీ చేపట్టింది. ముంపు బాధితులను సహాయ కేంద్రాలకు తరలించి భోజన వసతి కల్పిస్తున్నారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. బాధితులకు సీఎం రిలీఫ్‌ కిట్‌లను పంపిణీ చేస్తున్నారు.

వారం రోజులుగా నీటిలోనే
వారం రోజులుగా వరద నీటిలో ఉన్నాం. ఇంట్లో సామగ్రి నీటిలో మునిగిపోయింది. మళ్లీ వర్షం పడే అవకాశం ఉంది... పునరావాస కేంద్రానికి వెళ్లిపోవాలని అధికారులు సూచిస్తున్నారు. చిన్న పిల్లతో ఎక్కడికి పోవాలి. పట్టించుకునేవారు కరువయ్యారు. 
– విజయ (బాలింత), మల్లికార్జున్‌నగర్‌ 

ఇంటిని ఎలా వదిలి వెళ్లాలి
జీవితాన్ని ధారపోసి ఇంటిని కొన్నాం. ఖాళీ చేసి ఎలా వెళ్లాలి. వారం రోజులుగా మోకాలి లోతు వరదనీరు ఇళ్లలోకి చేరడంతో నరకం కనిపిస్తోంది. కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నాం. రాత్రంతా జాగారం తప్పడం లేదు. బురద నీటిలో పాములు, విష పురుగులు వస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పరామర్శలకు పరిమితమవుతన్నారు. కానీ పరిష్కారం చూపించడం లేదు.
– మల్లికార్జున్, అయ్యప్పనగర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top