హైదరాబాద్: ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి దర్శనానికి 23వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకే అనుమతి ఉంటుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. 24 నుంచి నిమజ్జన ఏర్పాట్ల నేపథ్యంలో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జన మహోత్సవం 25వ తేదీ ఉదయం ప్రారంభమవుతుందని వివరించారు. కాగా, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన మార్గాన్ని సోమవారం అధికారులు, పోలీసులు, వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. 25న శోభాయాత్ర రీత్యా రాజ్‌దూత్ చౌరస్తా, ఎక్బాల్ మినార్, తెలుగు తల్లి చౌరస్తా, సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ జిల్లా మార్గ్ వరకు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పంజగుట్ట, సైఫాబాద్ ఏసీపీలు, ఖైరతాబాద్, సైఫాబాద్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, అధికారులు పాల్గొన్నారు.


