పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని.. | Lovers Ends Life In Karimnagar | Sakshi
Sakshi News home page

పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని..

Mar 7 2025 9:57 AM | Updated on Mar 7 2025 9:57 AM

Lovers Ends Life In Karimnagar

ప్రేమికుల బలవన్మరణం 

ఉరేసుకొని ఆత్మహత్య

కరీంనగర్‌ జిల్లాలో ఘటన

రెండు కుటుంబాల్లో విషాదం

కరీంనగర్‌క్రైం: ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు ఒప్పకోరని భావించి ఇద్దరూ కలిసి ఉరేసుకుని తనువు చాలించారు. దూరంగా బ్రతకడం ఇష్టం లేక కలిసే పోయారు. కరీంనగర్‌ త్రీటౌన్‌ సీఐ జాన్‌రెడ్డి వివరాల ప్రకారం.. జిలలాలోని చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన నాంపెల్లి రమ–అంజయ్య దంపతుల రెండోకూతురు అలేఖ్య(21) డిగ్రీ చదివి ఇంటివద్దే ఉంటోంది. ఇదే మండలం చిట్యాలపల్లి గ్రామానికి చెందిన కొండపర్తి సరస్వతి– రవికుమార్‌ల కొడుకు అరుణ్‌ కుమార్‌(24) కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో అద్దె ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.

ఇద్దరూ బంధువులు కావడంతో దగ్గరయ్యారు. రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇటీవల అమ్మాయికి తన తల్లిదండ్రులు వేరే అబ్బాయితో పెళ్లి నిశ్చయించారు. అయితే అలేఖ్య తాను చదివిన కళాశాలలో సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని ఇంట్లో చెప్పి బుధవారం కరీంనగర్‌ వచ్చింది. వావిలాలపల్లిలోని అరుణ్‌కుమార్‌ వద్దకు వెళ్లింది. తమ వివాహానికి పెద్దలు ఒప్పుకోరని అద్దెకుంటున్న ఇంట్లో ఒకే గదిలో వేర్వేరు ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తమ కూతురు ఇంకా ఇంటికి రావడంలేదని తల్లిదండ్రులు ఫోన్‌ చేయగా అలేఖ్య ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. 

అరుణ్‌కుమార్‌ ఫోన్‌ సైతం పనిచేయకపోవడంతో అతను పనిచేస్తున్న ఆస్పత్రికి వెళ్లారు. అక్కడా లేకపోవడంతో గురువారం వేకువజామున అరుణ్‌కుమార్‌ ఉంటున్న అద్దెఇంటికి వెళ్లారు. ఇద్దరూ ఉరేసుకుని చనిపోయి కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. త్రీటౌన్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అలేఖ్య కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్‌ సీఐ జాన్‌రెడ్డి తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement