రూ.వేల కోట్ల అవినీతిలో సీఎం కుటుంబం
సింగరేణి కాంట్రాక్టుల్లో సెట్ విజిట్ పేరుతో దోచుకుంటున్నారు
మంచిర్యాల జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్
సీఎం, ఆయన బావమరిదిపై సిట్ విచారణ చేయించాలని డిమాండ్
‘క్యాతనపల్లి’లో ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని వ్యాఖ్య
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే స్కీం దోచుకో దాచుకో నడుస్తోంది.. ముఖ్యమంత్రి సకుటుంబ సపరివార సమేతంగా దోచుకుంటున్నారు’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మంచిర్యాల పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరై మాట్లాడారు. సింగరేణి కాంట్రాక్టుల్లో దేశంలో ఎక్కడా లేని వి«ధంగా సైట్ విజిట్ నిబంధన తెచ్చి, వారికి అనుకూలంగా కాంట్రాక్టర్లు లొంగకపోతే సర్టీఫికెట్ ఇవ్వమని బెదిరిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 30 నెలలైనా ఆరు గ్యారంటీలను అమలు చేయని ఈ సీఎంను ఏమనాలన్నారు. రైతుబంధుకు రాం రాం, దళితబంధుకు జై భీం చేశారని దుయ్యబట్టారు. మంచిర్యాలలో ప్రభుత్వ భూమిలో ఇల్లు ఉందని బీఆర్‌ఎస్ మద్దతుదారుడి ఇల్లు కూలగొట్టారన్నారు.
బొగ్గు బాయిల్లో అగ్గి పుట్టిస్తాం
దమ్ముంటే సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన బావమరిదిపై ఓ సిట్ వేసి విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డుకు వేలాది మంది ఎదురుచూస్తున్నారన్నారని, ఏర్పాటు చేయకపోతే సింగరేణి భవన్‌ను ముట్టడించి, బొగ్గు బాయిల్లో అగ్గి పుట్టిస్తామని హెచ్చరించారు. కోల్‌బెల్ట్‌లో మా ఎమ్మెల్యేలను ఓడించి ఇప్పుడు సేవ్ సింగరేణిని అని మమ్మల్ని అడిగితే మేం ఏం చేయాలని ప్రశ్నించారు. కత్తి వారి చేతిలో పెట్టి, యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా అన్నారు. అందరం కలిసి పోరాటం చేద్దామని, స్థానిక ఎమ్మెల్యేల్ని నిలదీద్దామని చెప్పారు. సింగరేణి, జిల్లా పరిషత్, సహకార ఇతరత్రా ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అని.. 2028లో మళ్లీ ఆయన సీఎం కావాలన్నారు. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తామని చెబుతున్న సీఎంకు కోటి కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా అని ప్రశ్నించారు.
కుంభకోణాలపై కేంద్రం స్పందించదు
బీజేపీ, కాంగ్రెస్ రెండు కలిసిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిలో ఎంత అవినీతి జరుగుతున్నా, కేంద్రం గమ్మున ఉంటుందని కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు, ముఖ్యమంత్రి బావమరిదికి కేంద్ర ప్రభుత్వ పథకం ‘అమృత్’లో రూ.వందల కోట్ల కాంట్రాక్టులు వస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ ఎంపీలకు తెలంగాణలో కాంట్రాక్టులు ఇస్తున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో సింగరేణి లాభాలు, బోనస్, వాటాలు, వారసత్వ ఉద్యోగాలు, పదేళ్లు తెలంగాణను నడిపింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అన్నారు.
ప్రలోభాలకు లొంగకుండా...
రాష్ట్రంలో నీచ, నికృష్ట రాజకీయాలు నడుస్తున్నాయని, క్యాతనపల్లి మున్సిపాలిటీ కోసం మంత్రి వివేక్ అహం దెబ్బతిన్నదని, వెయ్యి మంది పోలీసు బందోబస్తు చేసి, గెలవాలని చూశారని కేటీఆర్ విమర్శించారు. 51 రోజులు కౌన్సిలర్లు క్యాంపులో ప్రలోభాలకు లొంగకుండా, కేసులతో, భయపెట్టి, బ్లాంక్ చెక్కులు ఇచ్చినా చెక్కు చెదరలేదన్నారు. బాల్క సుమన్‌ను ఆదిలాబాద్ జైలుకు పంపారని చెప్పారు. సీపీఐ పొత్తు ధర్మం పాటించిందని చెప్పారు.
ఈ సమావేశంలో బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు అనిల్‌జాదవ్, కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దివాకర్‌రావు, కోరుకంటి చందర్, నాయకులు ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్, విజిత్‌రావు పాల్గొన్నారు. ఆ తర్వాత క్యాతనపల్లి, ఆసిఫాబాద్ మున్సిపల్ పాలకవర్గ సభ్యులను కేటీఆర్ సత్కరించారు. అంతకు ముందు మంచిర్యాల మెడికల్ కాలేజీని సందర్శించారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూతురు వివాహానికి కేటీఆర్ హాజరయ్యారు.


