ప్రభుత్వానికి భేషజాలు లేవు | Foundation Laid for Biogas Plants Worth Rs 700 Crores in Siddipet District | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి భేషజాలు లేవు

Apr 13 2026 1:07 AM | Updated on Apr 13 2026 1:07 AM

Foundation Laid for Biogas Plants Worth Rs 700 Crores in Siddipet District

బయోగ్యాస్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తున్న మంత్రి శ్రీధర్‌ బాబు, చిత్రంలో హరీశ్‌రావు తదితరులు

అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు 

సిద్దిపేట జిల్లాలో రూ.700 కోట్లతో బయోగ్యాస్‌ ప్లాంట్లకు శంకుస్థాపన

సాక్షి, సిద్దిపేట: ‘రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ఎక్కడ అనువైన ప్రాంతాలుంటే అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం’అని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. సిద్దిపేట జిల్లా నర్మేటలో రూ.700 కోట్లతో జూనో జౌల్‌ బయో ఫ్యూయల్స్‌కు చెందిన బయో గ్యాస్‌ ప్లాంట్లకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలంటే పరిశ్రమలు రావాలన్నారు. 65 శాతం ఇంధనాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో యుద్ధ సమయాల్లో కొరతతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. జూనో జౌల్‌ బయో గ్యాస్‌ ప్లాంట్‌ కాలుష్యంలేని ఫ్యాక్టరీ అని అన్నారు.

లోక్‌సభ సభ్యుడు ప్రేమ్‌చంద్రన్‌ మాట్లాడుతూ.. 2018 నుంచి కేంద్రం చాలా పథకాలను అమలు చేస్తోందని, ఇతర దేశాల నుంచి గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రైతులకు ధాన్యంతోపాటు, వరి గడ్డి నుంచి సైతం ఇక అదనపు ఆదాయం రానుందన్నారు.

మాజీ ఎంపీ వి.హన్మంతరావు మాట్లాడుతూ ఆంధ్ర వారికి ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తున్నట్లే ఆంధ్రలో సైతం పరిశ్రమలు పెట్టే తెలంగాణ వారికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ భువనేశ్వర్‌ కలిత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, కంపెనీ సీఈఓ రాయపాలి నాగశరత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement