సాక్షి, మంచిర్యాల: రాష్ట్రంలో దోచుకో..దాచుకో లాంటి కొత్త స్కీమ్ నడుస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. క్యాతనపల్లిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్ నీచమైన రాజకీయాలకు పాల్పడ్డారని బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. కౌన్సిలర్లను కోట్ల రూపాయలు ఇస్తానని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వకుంటే కౌన్సిలర్ భూమాగౌడ్ ఇల్లు కూలగొట్టారని అన్నారు. అయినప్పటీకి బీఆర్ఎస్ కార్యకర్తలు తలొగ్గలేదని క్యాతనపల్లిలో చూపెట్టిన స్ఫూర్తిని పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా చూపాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే సుమన్‌ను అక్రమ కేసులు పెట్టి ఆదిలాబాద్ జైల్లో పెట్టించి సదుపాయాలు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేశారని మున్సిపల్ ఎన్నిక సమయంలో మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించినా మంత్రి వివేక్ చూసుకుంటూ కూర్చున్నారని అన్నారు. సింగరేణిలో సైట్ విజిటేషన్ కార్యక్రమం పెట్టి కాంట్రాక్టర్లను సీఎం బంధువులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లో మెడికల్ బోర్డు పెట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 16 వేల ఉద్యోగాలపై ఏసీబీతో విచారణ జరిపిస్తామని సీఎం అనడం శోచనీయమని, కాంగ్రెస్ నాయకులను సింగరేణి కార్మికులు అడ్డుకొని నిలదీయాలని పిలుపునిచ్చారు.
ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందని, కాంగ్రెస్ చేసే దోపిడిపై బీజేపీని సీబీఐచే విచారణ జరిపించాలని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణాలో లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు 52 కోట్లు కేటాయించి, ప్రాజెక్ట్ కడతామని మాయమాటలు చెప్తోందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాబోయే సింగరేణి ఎన్నికల్లో TBGKSను గెలిపించాలని కేటీఆర్ సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు.


