సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ బృందంతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు (బుధవారం) కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామితో కేటీఆర్ తన బృందంతో కలిసి భేటీకానున్నారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేసి విజ్ఞప్తి చేయనున్నారు.
ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరనున్నారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని బీఆర్ఎస్ నేతలు కేంద్రమంత్రికి వివరించనున్నారు. ఈ బృందంలో కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న , ఖానాపూర్ ఇంచార్జ్ జాన్సన్ నాయక్, CCI సాధన సమితి నాయకులు ఉన్నారు.
ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ
ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని 1984 ఉత్పత్తిని ప్రారంభించింది. తీవ్రమైన నిధుల కొరత అధికంగా నిలిచిపోయిన విద్యుత్ బిల్లుల బకాయిలు తదితర కారణాలతో కేవలం 14 సంవత్సరాలకే తన ఉత్పత్తులను నిలిపివేసింది. దీంతో ఆ ప్రాంతంలోని యువత ఉద్యోగ అవకాశాలలో తీవ్రంగా నష్టపోయారు.


