తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న కేటీఆర్
తెలంగాణ ఆత్మను కాపాడుకోవాల్సిన సమయమొచ్చింది
తెలంగాణ తల్లి కిరీటాన్ని, వడ్డాణాన్ని కాంగ్రెస్ దొంగిలించుకు పోతోంది
దేశమంతా వదిలించుకున్న కాంగ్రెస్ దరిద్రం తెలంగాణకు వచ్చింది
రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి నెట్టింది
కాంగ్రెస్ పాలనలో మోసపోని వర్గం అంటూ ఏదీ లేదు
ఆవిర్భావ దినోత్సవంలో కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ‘మన పోరాటం అధికారం కోసం కాదు.. తెలంగాణ కోసం. కష్టపడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవడం కోసం.. తెలంగాణ తల్లి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం. తెలంగాణ ఇవాళ ముష్కరుల పాలవుతోంది. తెలంగాణ తల్లి కిరీటాన్ని, వడ్డాణాన్ని కాంగ్రెస్ దొంగిలించుకు పోతోంది. అందుకే మరోసారి ప్రజా పోరాటానికి సిద్ధం కావాలి..’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
విష ప్రచారాలతో అధికారంలోకి కాంగ్రెస్
‘గత ప్రభుత్వం పైనా, కేసీఆర్ పైనా చిల్లర ప్రచారాలు చేశారు. అబద్ధాలతో కూడిన విష ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 420 హామీలతో ప్రజలను మోసం చేసింది. దేశమంతా వదిలించుకున్న కాంగ్రెస్ దరిద్రం తెలంగాణకు వచ్చింది. అడ్డదారిలో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి నెట్టింది.
రైతుబంధు లేదు..ఎరువుల్లేవు
⇒ సంతోషంగా సాగిన తెలంగాణ వ్యవసాయం ఈ రోజు సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుబంధు లేదు.. ఎరువులు ఇచ్చేవాళ్లు లేరు.. పండించిన పంట రెండు నెలలైనా కొనేవాళ్లు లేరు. ప్రభుత్వం కాళ్లు పట్టుకున్నా కనికరం లేదు. నాలుగు సార్లు రైతుబంధు ఇవ్వకుండా మోసం చేశారు. 70 లక్షల మంది రైతన్నలు బాధతో, ఆవేదనతో రేవంత్‌రెడ్డిని తిడుతున్నారు.
గురువు గారికి నదీజలాల సమర్పణ
⇒ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. కేసీఆర్‌ను బద్నామ్ చేయాలనే పగతో ప్రాజెక్టులపై దాడి చేస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాలను తెలంగాణ హక్కులుగా కాపాడాల్సింది పోయి గురువు గారికి సంతర్పణ చేసే పరిస్థితి తీసుకొచ్చారు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
దమ్ముంటే చిక్కడపల్లి లైబ్రరీకి రావాలి..
⇒ ‘నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసింది. అశోక్‌నగర్‌లో యువతను కూర్చోబెట్టి ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టారు. రెండున్నరేళ్లలో కనీసం నాలుగు వేల కొత్త ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. రాహుల్‌గాం«దీకి ఇప్పుడు తెలంగాణకు రావడానికి మొహం చెల్లడం లేదా? దమ్ముంటే చిక్కడపల్లి లైబ్రరీకి, అశోక్‌నగర్ చౌరస్తాకు పోలీసుల్లేకుండా రావాలి.
క్షీణించిన శాంతి భద్రతలు
తెలంగాణను మేం పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మార్చాం. కానీ ఈరోజు పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించింది. పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి. గనుల పేరుతో దోపిడీలు సాగుతున్నాయి. ఈ రోజు తెలంగాణ మొత్తం ఒక ధర్నా చౌక్ అయిపోయింది. రైతులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు.. ఇలా ప్రతి వర్గం రోడ్డెక్కి ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. కాంగ్రెస్ పాలనలో మోసపోని వర్గం అంటూ ఏదీ లేదు. వేలాది మంది అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ ఆత్మను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకే మరో ప్రజా పోరాటానికి సిద్ధం కావాలి. ఈ రోజు తెలంగాణ ప్రజల గుండెల్లో వినిపిస్తున్న నినాదం ఒక్కటే. అదే కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు.


