బిల్లులు వెనక్కి పంపుతారా?

KTR and Harish Rao's comments on behavior of Governor - Sakshi

అలా చేయడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే.. 

గవర్నర్‌ తీరుపై మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వ్యాఖ్యలు 

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ తిప్పి పంపిన బిల్లులను పునఃపరిశీలన కోసం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం రాత్రి సభలో అనుమతించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తిప్పి పంపిన బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ బిల్లులు ఆపడంలో రాజకీయ కోణం దాగి ఉందని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అనుమానం వ్యక్తం చేయగా.. గవర్నర్‌ బిల్లులు పెండింగ్‌లో పెట్టడం, తిప్పి పంపడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు. 

ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ముఖ్యం: హరీశ్‌రావు 
ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు క్రమబద్దీకరణ)బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కొత్త మెడికల్‌ కాలేజీల్లో సిబ్బంది కొరత రాకుండా, ప్రభుత్వం మెడికల్‌ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల వయోపరిమితి 65 ఏళ్లకు పెంచుతూ గతంలోనే చట్టాన్ని తెచ్చాం. ఇందులో టెక్నికల్‌ అంశాలను పరిగణనలోకి తీసుకుని సవరణ తెస్తూ బిల్లు తెచ్చాం. అయితే, రిటైర్‌ అయి న వాళ్లను తీసుకోవడంతో ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడుతున్నట్టుగా గవర్నర్‌ భావించినట్టు తెలిసింది. వాస్తవానికి అలాంటి అంశాలకు తావులేదు.. అదనంగా ప్రభుత్వంపై భారం లేద’న్నారు.

రాజకీయ కోణం తప్ప అభ్యంతరాలకు తావులేదు..: మంత్రి కేటీఆర్‌
పురపాలక శాసనాల చట్టం (సవరణ) బిల్లును ప్రవేశపెడుతూ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ‘వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యం పెంచేలా కో–ఆప్షన్‌ సభ్యుల సంఖ్య పెంచాం. ఇందుకు గవర్నర్‌ అభ్యంతరాలను ప్రస్తావించారు. కో–ఆప్షన్‌ సభ్యుల సంఖ్య పెంచినప్పుడు దామాషా ప్రకారం మైనార్టీల సంఖ్య పెరుగుతుంది. ఇందులో మైనార్టీల కోసం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. కేవలం అవి అపోహలే. రాజకీయ కోణం తప్ప గవర్నర్‌ లేవనెత్తిన అంశాల్లో ఏమీ అభ్యంతరాలు లేనందున తిరిగి బిల్లును పాస్‌ చేయాలని కోరుతున్నాను’అని అన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top