కలుషితమై'నది'! | Krishna, Godavari rivers contaminated with coliform bacteria | Sakshi
Sakshi News home page

కలుషితమై'నది'!

Jun 22 2026 2:17 AM | Updated on Jun 22 2026 2:17 AM

Krishna, Godavari rivers contaminated with coliform bacteria

కోలిఫాం బ్యాక్టీరియాతో కలుషితమవుతున్న కృష్ణా, గోదావరి 

మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తుండటమే కారణం 

నీటి నాణ్యతపై పర్యావరణ నిపుణుల ఆందోళన 

తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గోదావరి, కృష్ణా నదుల్లో కలుషిత బ్యాక్టీరియా ముఖ్యంగా ఫీకల్‌ కొలిఫాం బ్యాక్టీరియా పరిమితికి మించి నమోదవుతున్నట్లు వెల్లడైంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) నివేదికల ప్రకారం... మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు కలవడం వల్ల బ్యాక్టీరియా (టోటల్‌ కోలిఫాం) పరిమితికి మించి నమోదవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ములుగు, నిర్మల్‌ జిల్లాల పరిధిలోని గోదావరిలో మానవ మలమూత్రాల ద్వారా వచ్చే కోలిఫాం బ్యాక్టీరియా ప్రమాదకర స్థాయిలో ఉంటోంది. అలాగే కాళేశ్వరం (త్రివేణి సంగమం), బేగంపేట, రామగుండం పారిశ్రామిక ప్రాంతాల వద్ద రసాయనాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు నదిని కలుషితం చేస్తున్నాయి. మరోవైపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని కృష్ణా నది నీటిలో టోటల్‌ కోలిఫాం సంఖ్య ప్రతి 100 మిల్లీలీటర్లకు 9,200కుపైనే నమోదవుతోంది. ఇది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రతి 100 ఎంఎల్‌ నీటిలో 500లోపు పరిమితితో పోలిస్తే ఎన్నో రెట్లు అధికం కావడం గమనార్హం. 

నీటి నాణ్యతపై ఆందోళన..: కాళేశ్వరం, మంథని, ఏటూరునాగారం తదితర ప్రాంతాల్లో గోదావరి ఎగువ, దిగువ భాగాల నుంచి నీటి నమూనాలను టీపీసీబీ గతంలో సేకరించి నీటి నాణ్యత పరీక్షలను విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం కొన్ని ప్రాంతాల్లో జీవ రసాయన ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీవోడీ), రసాయన ఆక్సిజన్‌ డిమాండ్‌ (సీవోడీ), సస్పెండెడ్‌ సాలిడ్స్‌ (ఎస్‌ఎస్‌) వంటి సూచీలు పెరిగినట్లు గుర్తించారు. మరోవైపు తాజాగా సీడబ్ల్యూసీ వెల్లడించిన కోలిఫాం కాలుష్య పరిస్థితి చూస్తే సమస్య ఇంకా తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో తెలంగాణలోని గోదావరి పరీవాహక ప్రాంతాల నీటి నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

కోలిఫాం అంటే ఏమిటి? 
ఫీకల్‌ కోలిఫాం అనేది మానవ, జంతు వ్యర్థాల ద్వారా నీటిలోకి చేరే బ్యాక్టీరియా సమూహం. ఇది అధికంగా ఉంటే మురుగునీరు నదిలో కలుస్తోందని అర్థం. తాగునీటికి మాత్రమే కాకుండా స్నానాలకు కూడా ఈ బ్యాక్టీరియాను ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. దీనివల్ల చర్మ వ్యాధులు, కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్లు, వైరల్‌ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. 

మంథని, కాళేశ్వరంలో అధిక కాలుష్య ఛాయలు... 
గతంలో టీపీసీబీ నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల ఆధారంగా రూపొందించిన నివేదికలో మంథని ప్రాంతంలో కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (సీవోడీ) విలువలు కొన్ని రోజుల్లో 90 ఎంజీ/ఐ వరకు నమోదైనట్లు కనిపిస్తోంది. బయో కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీవోడీ) కూడా 8 ఎంజీ/ఐ వరకు నమోదైంది. ఇవి ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా ఉండటం గమనార్హం. అలాగే టోటల్‌ డిజాల్‌్వడ్‌ సాలిడ్స్‌ (టీడీఎస్‌) 300 ఎంజీ/ఐకుపైగా నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఇక కాళేశ్వరం ప్రాంతంలో సీవోడీ 95 ఎంజీ/ఐ వరకు, బీవోడీ 4 ఎంజీ/ఐ ( ఝజ/  ) వరకు నమోదైంది. స్నాన ఘాట్ల దిగువ భాగంలో కాలుష్య సూచీలు కొంత పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఇది స్థానిక మురుగునీటి ప్రవాహాలు, మానవ కార్యకలాపాల ప్రభావం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఏటూరునాగారం ప్రాంతంలో బీవోడీ సాధారణంగా తక్కువగానే ఉన్నప్పటికీ సీవోడీ, సస్పెండెడ్‌ సాలిడ్స్‌ విలువలు కొన్ని నమూనాల్లో పెరిగినట్లు నమోదయ్యాయి. నీటిలో ఘన వ్యర్థాలు, మట్టి కణాలు అధికంగా చేరుతున్న సంకేతాలుగా దీనిని పరిగణిస్తున్నారు. 

పుష్కరాల నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దాలంటున్న నిపుణులు 
వచ్చే ఏడాది జూన్‌ చివర్లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో వెంటనే ఆయా ప్రాంతాల్లో నదీ జలాలు, బ్యాక్టీరియా కాలుష్య నియంత్రణకు, ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాళేశ్వరం, ధర్మపురి, మంథని, భద్రాచలం, బాసర తదితర చోట్ల ప్రతి వారం నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి, నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. 

–బీవోడీ(బయో కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌)... నీటిలోని సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మజీవులకు అవసరమైన ఆక్సిజన్‌ పరిమాణం 
–సీవోడీ (కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌)... నీటిలో ఉన్న మొత్తం కాలుష్య భారాన్ని సూచించే ప్రమాణం 
–టీడీఎస్‌... నీటిలో కరిగి ఉన్న లవణాలు, ఖనిజాల పరిమాణం 
–సస్పెండెడ్‌ సాలిడ్స్‌ (ఎస్‌ఎస్‌)... నీటిలో తేలియాడే ఘన కణాలు 
(వాటి విలువలు పెరిగిన కొద్దీ నీటి నాణ్యత తగ్గుతున్నట్లు పరిగణిస్తారు)   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement