
ప్రసాద్.2.0 పథకంలోకి సోమేశ్వరాలయం
సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్రం
పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధికి చర్యలు
ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో అతి పురాతనమైన కొలనుపాకలోని శైవ, జైన దేవాలయాల ప్రాంతాలకు మహర్దశ కలగనుంది. ఈ క్షేత్రాన్ని కేంద్రం స్వదేశీ దర్శన్ ప్రసాద్ 2.0 (తీర్థయాత్ర పునరుజ్జీవం, ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్) పథకంలో చేర్చనుంది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అంగీకారం తెలిపారు. తెలంగాణలోని బౌద్ధ ప్రాంతాలను సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, నాగార్జునసాగర్‌ల అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపట్టింది.
ప్రసాద్ పథకంలో అభివృద్ధి చేయాలని..
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో చారిత్రక ప్రాధాన్యమున్న శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం ఉంది. దీన్ని అభివృద్ధి చేస్తూ సంరక్షించడానికి అవసరమైన నిధులను పీఆర్‌ఏఎస్‌ఏడీ 2.0 (ప్రసాద్ 2.0) పథకం కింద విడుదల చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి కోరారు.
కొలనుపాకకు చారిత్రక ప్రాధాన్యం
శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం కల్యాణ చాళుక్యుల కాలం (7 – 10వ శతాబ్దం) నాటి ప్రాచీన శైవ ఆలయం. చాళుక్యుల అనంతరం కాకతీయుల కాలంలో (12వ – 13వ శతాబ్దం) అత్యంత ప్రాధాన్యమున్న శైవ క్షేత్రంగా చారిత్రక నేపథ్యం కలిగి ఉంది. ఈ ఆలయం చాళుక్య శిల్పకళా నైపుణ్యం, కాకతీయుల శిల్ప సౌందర్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఉజ్జయినీ జగద్గురు శ్రీ సిద్ధలింగ రాజదేశి కేంద్ర శివాచార్య స్వామీజీ ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.
ఎక్కడ ఉందంటే..
కొలనుపాక ఆలయం జాతీయ రహదారి 163 (హైదరాబాద్–వరంగల్ మార్గం)లో ఉంది. సికింద్రాబాద్–కాజీపేట రైల్వే మార్గంలో.. ఆలేరుకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏటా వేలా ది మంది భక్తులు, పర్యాటకులు దేశ విదేశాల నుంచి తరలివచ్చి ఆలయాన్ని శ్రీ చండికాంబ సహిత సోమేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ప్రతి శివరాత్రి పర్వదినాన పెద్ద ఎత్తున రథోత్సవం జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ప్రాచీన విగ్ర హాలు, కాకతీయుల చరిత్రను తెలిపే శాసనాల (శిలాశాస నాలు)తో రాష్ట్ర పురావస్తు శాఖ మ్యూజియం ఉంది.

మఠాలకు నెలవు
కొలనుపాక గ్రామంలో అనేక సామాజిక ఆదారిత మఠాలను ని ర్మించారు. ఈ ప్రాంతం మతపరమైన ప్రా« దాన్యాన్ని మరింతగా పెంచింది. కులాల వా రీగా ఉన్న మఠాలతో సోమేశ్వర ఆలయ ప్రాంగణం గొప్ప శివ క్షేత్రంగా పేరొందింది.

శివలింగ రూపంలో దర్శనం
శతాబ్దాలుగా ప్రముఖ శైవ క్షేత్రంగా కొలనుపాక గ్రామం పేరొందింది. సోమేశ్వర స్వామి శివలింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. నిత్యం ఆలయంలో ధూప, దీప, నైవేద్యాలు, శాస్త్రోక్తంగా పూజలు జరుగుతాయి. శ్రీ సోమేశ్వర స్వామి ఆలయానికి అతి సమీపంలో 2000 ఏళ్ల చరిత్ర కలిగిన శ్వేతాంబర జైన దేవాలయం ఉంది. జైన తీర్థంకరులు ఈ దేవాలయంటో ఉన్నారు. రోజూ వేలాది మంది జైనులతోపాటు ఇతర మతస్తులు ఆలయాన్ని సందర్శిస్తారు.

మౌలిక సదుపాయల లేమి
ప్రాధాన్యమున్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయానికి మౌలిక సదుపాయాల లేమి ఉంది. సదుపాయాల కల్పన, పర్యాటక అభివృద్ధికి నిధుల కొరత ఉంది. ప్రధానంగా ఆలయంలో ఎన్నో విశిష్టమైన శిల్పకళా, శాసనాలు ఆలనా పాలనా లేకుండా పడిఉన్నాయి. వాటిని పునరుద్ధరించాలి. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు, రోడ్లు, వసతి, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. ఆలయ పరిసరాల సుందరీకరణ, విద్యుత్ వెలుగులు, పార్కులు, ఆలయ విశిష్టతను తెలిపే మార్గదర్శక ఫలకాలను ఏర్పాటు చేయాలి. తెలంగాణలోని ఇతర వారసత్వ ప్రాంతాలతో కలిపి కొలనుపాకను.. మతపరమైన, సాంస్కృతిక పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలి. గ్రామానికి వచ్చే సందర్శకుల్లో సాంస్కృతిక అవగాహన పెంచేందుకు మ్యూజియాన్ని డిజిటలైజేషన్ చేయాలి. ఇందుకోసం ఈ చారిత్రక యాత్రాక్షేత్రం పునరుజ్జీవానికి.. ప్రసాద్ 2.0 పథకం కింద నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ చామల కోరారు.

కొలనుపాకకు కేంద్రం నిధులు
ప్రసాద్ 2.0 పథకంలో కొలనుపాకను చేర్చడానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అంగీకరించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపిస్తాం. కొలనుపాక దేవాలయాల అభివృద్ధి, వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని మే నెలలో లేఖను అందజేశాను. కొలనుపాక దేవాలయాల అభివృద్ధికి కేంద్రం ప్రతిపాదనలు కోరింది. సోమేశ్వరాలయానికి, కర్ణాటక ప్రభుత్వానికి మధ్య సాంకేతిక సమస్యలను తెలుసుకుని వాటిని కూడా పరిష్కరిస్తాం.
– చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ భువనగిరి
చదవండి: శతాబ్దాల చరిత్ర ఆదరణ లేక దీనావస్థ