
నిరాదరణకు గురవుతున్న చారిత్రక సంపద
నాగర్‌కర్నూల్ జిల్లాలో పురాతన విగ్రహాలు, శిలాశాసనాలకు రక్షణ కరువు
నిర్వహణకు నిధులలేమి ప్రధాన సమస్య
ఇటీవలే సాస్కీ ద్వారా కేంద్రం రూ.68.10 కోట్లు కేటాయింపు
పర్యాటక అభివృద్ధి అంశాలను పరిశీలించిన మంత్రి జూపల్లి
టూరిజం సర్క్యూట్‌పైనే ఆశలు
నాగర్‌కర్నూల్ జిల్లాలో శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు, చరిత్రను తెలియజేసే శిలాశాసనాలకు రక్షణ కరువవుతోంది. అధికార యంత్రాంగం వీటిపై పెద్దగా దృష్టిపెట్టడం లేదు. కేవలం ఆదాయం ఉన్న ఆలయాలను మాత్రమే పట్టించుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆలయాల నిర్వహణతోపాటు పురావస్తు విగ్రహాలు, శాసనాల రక్షణకు నిధుల లేమి ప్రధాన సమస్యగా మారింది. అయితే సోమశిల సర్క్యూట్ డెవలప్‌మెంట్‌లోభాగంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పురాతన ఆలయాలకు మేలు జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. – కొల్లాపూర్
శాసనాలు, శిల్పాలు..
పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌లో 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి శిలాశాసనం ఉంది. దీన్ని పట్టించుకునే వారే లేరు. ఇటీవల పురావస్తు నిపుణుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆ శాసనాన్ని సందర్శించారు. చరిత్రను తెలియజేసే శాసనాలను పరిరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కొల్లాపూర్‌లోని ఆర్‌ఐడీ కళాశాల సమీపం, పలు ప్రాంతాల్లో సురభి రాజులకు సంబంధించిన శాసనాలు ఉన్నాయి.
మల్లేశ్వరం సమీపంలోని గుట్టపై పురాతన దేవతామూర్తుల విగ్రహాలు పూజలకు నోచుకోకుండా నిరుపయోగంగా ఉన్నాయి. సోమశిలలో పురాతన విగ్రహాలను మ్యూజియంలో ఉంచగా.. మరికొన్ని చెట్లకిందే ఉన్నాయి. అయితే వాటి విశిష్టతను తెలియజెప్పేవారు లేరు. జిల్లావ్యాప్తంగా పురాతన విగ్రహాలు, శిలాశాసనాలు చాలాచోట్ల రక్షణ లేకుండా ఉన్నాయి.
ప్రచారం కల్పిస్తే గుర్తింపు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఉన్నాయి. కృష్ణానది తీరం వెంట శతాబ్దాల కాలం కిందటే మునులు, రుషులు ఆలయాలను నిర్మించారు. వీటికి తగిన ప్రచారం కల్పిస్తే పర్యాటకులు, భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దేదీప్యమానంగా వెలుగొందిన జటప్రోలు మదనగోపాలస్వామి వంటి ఆలయాలను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సాస్కీ నిధులపైనే ఆశలు..
కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నియోజకవర్గంలోని సోమశిల పరిసర పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధికి స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ (సాస్కీ) ద్వారా కేంద్రం రూ.68.10 కోట్లు కేటాయించింది.
ఈ నిధుల వినియోగం, పర్యాటక అభివృద్ధి అంశాలను పరిశీలించేందుకు ఇటీవల మంత్రి జూపల్లి, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరి క్రాంతి కొల్లాపూర్‌లో పర్యటించారు. సోమశిల, అమరగిరి, జటప్రోలు, మంచాలకట్ట, మల్లేశ్వరం ప్రాంతాలను తిలకించారు. సాస్కీ నిధులతో చేపట్టబోయే పనుల ద్వారా పురాతన ఆలయాలు, శిలాశాసనాలకు తగిన గుర్తింపు లభించవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
రక్షణ చర్యలు చేపట్టాలి
జిల్లాలోని పలు ప్రాంతాల్లో చారిత్రక శిలాశాసనాలు, పురాతన విగ్రహాలున్నాయి. అవన్నీ చరిత్రకు సాక్ష్యాలు. వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంతోపాటు స్థానికులపై ఉంది. పురావస్తు అధికారులు వాటి రక్షణకు చర్యలు చేపట్టాలి. జటప్రోలు మదనగోపాలస్వామి ఆలయం వంటి పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అధికారులు కృషిచేయాలి. – శివకృష్ణయాదవ్, కొల్లాపూర్
అధికారులు దృష్టి సారించాలి
మల్లేశ్వరం సమీపంలోని గుట్టపై పురాతనమైన కాలభైరవ, 11వ శతాబ్దానికి చెందిన శేషశయన విష్ణుమూర్తి విగ్రహాలున్నాయి. వీటిని పరిరక్షించాలని ఏళ్లుగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదు. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న విగ్రహాలు, ఆలయాలు, శాసనాలు ధ్వంసం కాకుండా కాపాడాలి. వీటి రక్షణకు చర్యలు చేపట్టాలి. – అశోక్‌నంద, మల్లేశ్వరం
అద్భుతమైన శిల్పకళతో..
కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోలు సమీపంలో కృష్ణానది తీరాన కొన్ని శతాబ్దాల కిందట సురభి రాజవంశస్తులు అద్భుతమైన శిల్పకళతో మదనగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించారు. రాజుల పాలనలో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఏటా నెలరోజులపాటు ఆలయం వద్ద జాతర సాగేది. దాదాపు వంద గ్రామాల ప్రజలు వచ్చేవారు. ప్రతివారం పెద్దఎత్తున పశువుల సంత సాగేది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ఆలయం నీటిలో మునిగిపోయింది. కాలక్రమేణా ఆలయాన్ని జటప్రోలులో పునర్నిర్మించారు.
కొన్నేళ్లపాటు పూజలు యథాతథంగా సాగాయి. రానురాను తన ప్రాభవాన్ని కోల్పోయింది. చివరికి ధూప, దీప, నైవేద్యాలు పెట్టేవారు కూడా కరువయ్యారు. ఏడేళ్ల కిందట దేవాదాయశాఖ అధికారులు ఒక పూజారిని ఏర్పాటు చేశారు. కానీ, భక్తుల రాకమాత్రం పూర్తిగా తగ్గిపోయింది. జటప్రోలులోనే ఉన్న అగస్తేశ్వరాలయం, 19 మూకగుడుల నిర్వహణను పట్టించుకునేవారే లేరు. ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందిన ఈ ఆలయం పూర్వవైభవానికి నోచుకోవడం లేదు.
మరికొన్ని ఆలయాలు ఇలా..
జిల్లాలోని పలు ఆలయాలకు చారిత్రక ప్రాశస్త్యం ఉన్నప్పటికీ సరైన ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలోని మంచాలకట్ట వద్ద కృష్ణానది తీరాన శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థాలయం ధూప, దీపాలకు నోచుకోవడంలేదు. అమరగిరి సమీపంలో కృష్ణాతీరంలోనే మునులు ప్రతిష్టించిన మల్లయ్యస్వామి (మల్లయ్యసెల) గుడి పరిస్థితి కూడా ఇంతే.
పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి రెండో తిరుపతిగా ఒకప్పుడు పేరుండేది. క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. పెంట్లవెల్లి మండల కేంద్రంలోని శివాలయం, చిన్నంబావి మండలంలోని బెక్కెం సమీపాన సూర్యదేవాలయం, పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌లో శివాలయం, నందీశ్వరాలయం, నాగర్‌కర్నూల్ జిల్లాలోని నందివడ్డెమాన్‌లో ఆలయాలకు సరైన ఆదరణ లభించడం లేదు.