breaking news
Kolanupaka temple
-
కొలనుపాక సోమేశ్వరునికి మహర్దశ
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో అతి పురాతనమైన కొలనుపాకలోని శైవ, జైన దేవాలయాల ప్రాంతాలకు మహర్దశ కలగనుంది. ఈ క్షేత్రాన్ని కేంద్రం స్వదేశీ దర్శన్ ప్రసాద్ 2.0 (తీర్థయాత్ర పునరుజ్జీవం, ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్) పథకంలో చేర్చనుంది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అంగీకారం తెలిపారు. తెలంగాణలోని బౌద్ధ ప్రాంతాలను సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, నాగార్జునసాగర్‌ల అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపట్టింది. ప్రసాద్ పథకంలో అభివృద్ధి చేయాలని.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో చారిత్రక ప్రాధాన్యమున్న శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం ఉంది. దీన్ని అభివృద్ధి చేస్తూ సంరక్షించడానికి అవసరమైన నిధులను పీఆర్ఏఎస్ఏడీ 2.0 (ప్రసాద్ 2.0) పథకం కింద విడుదల చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి కోరారు. కొలనుపాకకు చారిత్రక ప్రాధాన్యం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం కల్యాణ చాళుక్యుల కాలం (7 – 10వ శతాబ్దం) నాటి ప్రాచీన శైవ ఆలయం. చాళుక్యుల అనంతరం కాకతీయుల కాలంలో (12వ – 13వ శతాబ్దం) అత్యంత ప్రాధాన్యమున్న శైవ క్షేత్రంగా చారిత్రక నేపథ్యం కలిగి ఉంది. ఈ ఆలయం చాళుక్య శిల్పకళా నైపుణ్యం, కాకతీయుల శిల్ప సౌందర్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఉజ్జయినీ జగద్గురు శ్రీ సిద్ధలింగ రాజదేశి కేంద్ర శివాచార్య స్వామీజీ ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.ఎక్కడ ఉందంటే.. కొలనుపాక ఆలయం జాతీయ రహదారి 163 (హైదరాబాద్–వరంగల్ మార్గం)లో ఉంది. సికింద్రాబాద్–కాజీపేట రైల్వే మార్గంలో.. ఆలేరుకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏటా వేలా ది మంది భక్తులు, పర్యాటకులు దేశ విదేశాల నుంచి తరలివచ్చి ఆలయాన్ని శ్రీ చండికాంబ సహిత సోమేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ప్రతి శివరాత్రి పర్వదినాన పెద్ద ఎత్తున రథోత్సవం జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ప్రాచీన విగ్ర హాలు, కాకతీయుల చరిత్రను తెలిపే శాసనాల (శిలాశాస నాలు)తో రాష్ట్ర పురావస్తు శాఖ మ్యూజియం ఉంది.మఠాలకు నెలవు కొలనుపాక గ్రామంలో అనేక సామాజిక ఆదారిత మఠాలను ని ర్మించారు. ఈ ప్రాంతం మతపరమైన ప్రా« దాన్యాన్ని మరింతగా పెంచింది. కులాల వా రీగా ఉన్న మఠాలతో సోమేశ్వర ఆలయ ప్రాంగణం గొప్ప శివ క్షేత్రంగా పేరొందింది.శివలింగ రూపంలో దర్శనం శతాబ్దాలుగా ప్రముఖ శైవ క్షేత్రంగా కొలనుపాక గ్రామం పేరొందింది. సోమేశ్వర స్వామి శివలింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. నిత్యం ఆలయంలో ధూప, దీప, నైవేద్యాలు, శాస్త్రోక్తంగా పూజలు జరుగుతాయి. శ్రీ సోమేశ్వర స్వామి ఆలయానికి అతి సమీపంలో 2000 ఏళ్ల చరిత్ర కలిగిన శ్వేతాంబర జైన దేవాలయం ఉంది. జైన తీర్థంకరులు ఈ దేవాలయంటో ఉన్నారు. రోజూ వేలాది మంది జైనులతోపాటు ఇతర మతస్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. మౌలిక సదుపాయల లేమి ప్రాధాన్యమున్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయానికి మౌలిక సదుపాయాల లేమి ఉంది. సదుపాయాల కల్పన, పర్యాటక అభివృద్ధికి నిధుల కొరత ఉంది. ప్రధానంగా ఆలయంలో ఎన్నో విశిష్టమైన శిల్పకళా, శాసనాలు ఆలనా పాలనా లేకుండా పడిఉన్నాయి. వాటిని పునరుద్ధరించాలి. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు, రోడ్లు, వసతి, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. ఆలయ పరిసరాల సుందరీకరణ, విద్యుత్ వెలుగులు, పార్కులు, ఆలయ విశిష్టతను తెలిపే మార్గదర్శక ఫలకాలను ఏర్పాటు చేయాలి. తెలంగాణలోని ఇతర వారసత్వ ప్రాంతాలతో కలిపి కొలనుపాకను.. మతపరమైన, సాంస్కృతిక పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలి. గ్రామానికి వచ్చే సందర్శకుల్లో సాంస్కృతిక అవగాహన పెంచేందుకు మ్యూజియాన్ని డిజిటలైజేషన్ చేయాలి. ఇందుకోసం ఈ చారిత్రక యాత్రాక్షేత్రం పునరుజ్జీవానికి.. ప్రసాద్ 2.0 పథకం కింద నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ చామల కోరారు. కొలనుపాకకు కేంద్రం నిధులు ప్రసాద్ 2.0 పథకంలో కొలనుపాకను చేర్చడానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అంగీకరించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపిస్తాం. కొలనుపాక దేవాలయాల అభివృద్ధి, వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని మే నెలలో లేఖను అందజేశాను. కొలనుపాక దేవాలయాల అభివృద్ధికి కేంద్రం ప్రతిపాదనలు కోరింది. సోమేశ్వరాలయానికి, కర్ణాటక ప్రభుత్వానికి మధ్య సాంకేతిక సమస్యలను తెలుసుకుని వాటిని కూడా పరిష్కరిస్తాం. – చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ భువనగిరిచదవండి: శతాబ్దాల చరిత్ర ఆదరణ లేక దీనావస్థ -
కనుమరుగవుతున్న మఠాలు
వందల ఏళ్ల నాటి అపురూప ఆలయ సంపద ఆలనాపాలనా లేక ధ్వంసమవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో వీరశైవ మతానికి చెందిన శ్రీచండీకాంబసహిత సోమేశ్వరాలయం ఉంది. వీరశైవ పంచపీఠాల్లో కొలనుపాక ఒకటి. రేణుక సిద్ధుని జన్మభూమిగా ప్రసిద్ధి. ఈ ఆలయ ప్రాంగణంతోపాటు.. గ్రామంలో పలుచోట్ల 22 కులాలకు సంబంధించిన మఠాలు ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తిగా కనుమరుగవగా, మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని కులాలు.. తమ మఠాలను అభివృద్ధి చేసుకుంటుండగా.. నిరుపేద కులాలకు చెందిన మఠాల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మఠాల అభివృద్ధి పన్నెండేళ్లుగా పూర్తి కాలేదు. దీంతో శిథిల చరిత్రకు నిలయంగా సోమేశ్వర దేవాలయ ప్రాంగణం నిలుస్తోంది.మఠం అంటే.. మత ధర్మ నిష్టాపరుడై సద్భక్తి, వైరాగ్యంతో వీరుడనిపించుకొనడమే వీరశబ్దం అర్థం. 12వ శతాబ్దపు ఉత్తారార్ధంలో కన్నడ దేశపు కాలాచురి రాజైన బిజ్జలుని మంత్రి బసవనితో వీరశైవం వ్యాప్తి పొందింది. అంతకు ముందే ఆరాధ్య శైవం వ్యాప్తిలో ఉండేది. వీరశైవం ఆంధ్రదేశంలో ప్రవేశించి రాజుల ఆదరణ పొందింది. కాకతీయ రాజుల కాలంలో వీరశైవం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లిందని చరిత్ర పరిశోధకులు చెబుతారు. కాకతీయ రాజుల కాలంలో అనేక శైవ దేవాలయాలు నిర్మితమయ్యాయి. శైవ పీఠాలు, మఠాలు.. రాజుల సహాయ సహకారాలతో ఏర్పడి ప్రజాదరణ పొందాయి. అట్టడుగు వర్గాలలో వీరశైవం వ్యాప్తి పొందింది. వీరశైవం విజృంభించిన తర్వాత.. కొలనుపాకలో ప్రతి కులానికి ఒక మఠం ఏర్పడింది. వీరశైవులు తమ మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అష్టాదశ వర్గాల వారికి శివాలయాలు నిర్మించి ప్రజల మన్ననలు పొందారు.మఠాల ప్రాధాన్యం మఠం అంటే.. మతపరమైన విద్యాబోధన కేంద్రం. విద్యాలయం. సన్యాసులు నివసించే ప్రాంతాలని, దేవాలయాలని అనేక అర్థాలున్నాయి. మఠాలు దేవాలయాలకు అనుబంధంగా ఉంటాయి. దేవాలయాలన్నీ ఆధ్యాత్మిక జీవనం గడిపే సద్వర్తనులైన ఆచార్యుల నిలయాలు. వీటికి అనుబంధంగా ఉండే మఠాల్లో.. ఆచార్యులు విద్యార్థులకు విద్యాబోధన చేస్తుండేవారు. మఠాచార్యులు అన్ని శాస్త్రాలలో ప్రవీణులుగా ఉండేవారు. పదో శతాబ్దంలో కాలాముఖ శైవాచార్యులు మఠాలను ఏర్పాటు చేసి.. ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ శిష్యులకు విద్యాబోధన చేస్తుండేవారు. ఎందరో రాజులు కాలాముఖ శైవ గురువులను రాజగురువులుగా ఆదరించి పోషించారు. సాంఘికంగా వీరికి చాలా విలువ ఉండేది. వీరు చెప్పిందే వేదం. రాజు నుంచి బంటు వరకు మఠాచార్యుల ఆజ్ఞలను పాటిస్తూ గౌరవిస్తుండేవారు. సంఘాన్ని శాసించే కేంద్ర బిందువుగా మఠాచార్యులుండేవారు. ఈ మఠాలన్నీ 10వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు గొప్ప స్థితిలో ఉన్నాయి. మఠాలన్నీ విద్యా కేంద్రాలుగానే కాకుండా సాంస్కృతిక కేంద్రాలుగా ఉండి.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేయడానికి దోహదపడుతుండేవని పరిశోధకుల అభిప్రాయం. కుల ప్రాతిపదికన.. కొలనుపాకలో కుల ప్రాతిపదికతో ఏర్పడిన 22 మఠాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఇన్ని కుల మఠాలు ఒక్క దగ్గర లేవు. ఇది కొలనుపాకకు ఉన్న ప్రత్యేకత. శ్రీశైలంలో 13 మఠాలున్నట్లు సాహిత్య, శాసనాల ద్వారా తెలుస్తోంది. కాలముఖ మఠాలు 2, వీరశైవ మఠాలు 3, గోళకీ మఠాలు 4, ఆరాధ్య మఠాలు 1, ఇతర మఠాలు 3 శ్రీశైలంలో ఉన్నాయి. కానీ కొలనుపాకలో ప్రతి కులానికి ఒక మఠం ఉంది. వీరశైవం బాగా వ్యాప్తి చెందాలంటే ప్రతి కులంలో ఉన్న వ్యక్తులకు శైవదీక్ష ఇప్పించాలి. కులప్రాతిపదికగా మఠాలు ఏర్పాటు చేస్తే.. అది సాధ్యమవుతుందనే ఉద్దేశంతో కులానికి ఒక మఠం ఏర్పాటు చేశారు.ప్రతి మఠంలో నంది, శివలింగం కొలనుపాకలోని ప్రతి మఠం దాదాపు అలంకారాలు లేకుండా నిర్మితమయ్యాయి. ప్రతి ఆలయంలో శివలింగం, నంది తప్ప వేరే అలంకారాలు లేవు. ప్రతి కులం వారు పండుగ రోజుల్లో.. శివరాత్రి రోజు తమ తమ మఠాలను అలంకరించుకుని పూజలు జరుపుకొంటారు. కొలనుపాకలో 18 కులాల వారికి గురువులున్నారు. మఠాల దగ్గర పండుగ రోజుల్లో ఆయా కుల పురాణాలు పఠిస్తుండేవారు. ఆ జానపద గాయకులను ప్రతి కులం వారు ఆదరించి పోషించారు. ప్రతి కుల పురాణంలో కేంద్ర బిందువు వీర శైవమే. అన్ని కులాలకు తమ కులమే మూలమని ప్రతి కుల పురాణాల ఇతివృత్తాలలో కనిపిస్తుంది. సోమేశ్వరస్వామి ఆలయ సింహద్వారం వద్ద ప్రమాణ మండపం ఉంది. తగాదాలలో ప్రమాణాలు చేయాల్సి వస్తే ఈ మండపం దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తుంటారు. ఈ మండపంలో అబద్ధాల ప్రమాణాలు చేస్తే అరిష్టం కలుగుతుందని ప్రజల విశ్వాసం. కొలనుపాకలోని మఠాలివే.. వైశ్యమఠం, గాండ్ల మఠం, కాపుల మఠం, గొల్ల మఠం, కుర్మ మఠం, గౌండ్ల మఠం, మేర మఠం, పద్మశాలి మఠం, మేదరి మఠం, జాండ్ర మఠం, చాకలి మఠం, మంగలి మఠం, కుమ్మరి మఠం, వడ్డెర మఠం, మహమ్మాయి మఠం, మాల మఠం, మాదిగ మఠం, చిప్ప మఠం, సంగరి మఠం, పెరెక మఠం, శంబరి మఠం, తెనుగు మఠం ఉన్నాయి.చదవండి: ఆలయంలో అబ్బురపరుస్తున్న బామ్మ.. 15 నిమిషాల పాటు 250 కిలోల గంట మోగిస్తూ.. -
దేవుడక్కడ.. గంటలు ఇక్కడ
దేవాలయానికి వెళ్లగానే భక్తులు స్వామి విగ్రహం ముందు నిలబడి.. అప్రయత్నంగానే దైవం ముందున్న గంటను మోగిస్తారు. ఆలయం అనగానే దేవుడి ప్రతిరూపం కళ్లముందు కదలాడితే, అలయ పవిత్ర గంటల శబ్దం చెవుల్లో మారుమోగుతుంది. గంట మోగిస్తే దేవుడు తమ కోరికను ఆలకిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే గంట సరిగ్గా గర్భాలయం ముందు మూలవిరాట్టుకు ఎదురుగా ఉంటుంది. కానీ, చారిత్రక ప్రసిద్ధి గాంచిన కొలనుపాక దేవాలయం పరిస్థితి వేరు. ఆ ఆలయ గంటలు మోగిస్తే గర్భాలయంలోని స్వామికి వినిపించవు. విచిత్రంగా, విడ్డూరంగా అనిపించినా ఇది నిజం....ఎందుకంటే.. ఆలయాలు కొలనుపాకలో ఉంటే, ఆ గుడి గంటలు అక్కడికి 77 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌లో ఉన్నాయి. గంటలు దేవాలయంలో ఉండాలిగాని, హైదరాబాద్‌లో ఉండటమేంటన్న గందరగోళానికి పురావస్తుశాఖ నిర్వాకమే కారణం. – సాక్షి, హైదరాబాద్ ఇదీ సంగతి... కొలనుపాక అనగానే ప్రపంచ ఖ్యాతి పొందిన అద్భుత జైన దేవాలయం మదిలో మెదులుతుంది. ప్రస్తుత యాదాద్రి– భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు సమీపంలో ఈ గ్రామముంది. రాష్ట్రకూటులు పదో శతాబ్దంలో ఇక్కడ విశాలమైన జైన దేవాలయాన్ని నిర్మించారు. అందులో ఐదడుగుల పచ్చరాతి మహావీరుని విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. రాష్ట్రకూటుల తర్వాత పాలనాపగ్గాలు చేపట్టిన కళ్యాణి చాళుక్యులు పదకొండో శతాబ్దంలో దానికి చేరువలో సోమేశ్వరాలయం, పక్కనే వీరనారాయణస్వామి ఆల యాలను నిర్మించారు. వెరసి ఇది జైన, శైవ, వైష్ణవ సంప్రదాయంతో వర్ధిల్లిన ప్రాంతంగా చరిత్రకెక్కింది. శైవంలో కాలకమైన పంచ ఆచార్యుల్లో రేణుకాచార్య మనుగడ సాగించింది కొలనుపాకలోనే అన్న ఆధారాలుండటంతో దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి భక్తులొస్తారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి జైన భక్తులు కొలనుపాకకు వచ్చి సేదతీరుతారు. ఈ ఆలయాలకు చెందిన రెండు భారీ గంటలు ఆలయాలకు దూరంగా హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉండిపోయాయి. నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో జైన ఆలయం ధ్వంసమైంది. మిగతా కొన్ని నిర్మాణాలు కూడా విధ్వంసానికి గురయ్యాయి. 1970లలో అక్కడ జరిపిన అన్వేషణలో ఆలయాలకు చెందిన భాగాలు, ఇతర వస్తువులు వెలుగుచూశాయి. నాడు ధ్వంసమైన జైన దేవాలయం స్థలంలో తర్వాత పాలరాతి ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడది జైన భక్తుల ఇలవేల్పు. అక్కడికి సమీపంలో ఊబదిబ్బగా పేర్కొనే వాగు ఇసుకలో 2 భారీ గంటలు లభించాయి. కంచుతో రూపొందిన ఈ గంటలు అద్భుత శిల్పకళానైపుణ్యంతో వెలుగొందుతున్నాయి. ఈ రెండు కూడా కంచుతో రూపొందిన బరువైన గంటలు. వాటిని మోగిస్తే వచ్చే శబ్ద తరంగాలు వినసొంపుగా చాలాదూరం వినిపిస్తాయి. వాటి ని అప్పట్లో స్టేట్ మ్యూజియంకు తరలించి మరిచిపోయారు. ఐదారేళ్లుగా వీటిని తిరిగి ఆలయాలకు తరలించాలన్న విన్నపం భక్తుల నుంచి వస్తోంది. ఇవి ఆ ఆలయాలకు చెందినవే కావటంతో వాటిని మళ్లీ ఆలయాల్లో ఏర్పాటు చేయాలి. కానీ విలువైన ఆ గంటలను స్మగ్లర్ల బారి నుంచి కాపాడాలంటే భద్రత అవసరం. ఉద్యోగుల జీతాలకే దిక్కులేని దుస్థితిలో ఉన్న పురావస్తుశాఖ వాటిని కాపాడలేనని చేతులెత్తేసింది. కాపలా సిబ్బంది ఖర్చులు భరించే స్తోమత లేనందున వాటిని మ్యూజియంలోనే ఉంచి చేతులు దులిపేసుకుంది. గంటపై శాసనం... సాధారణంగా శాసనాలు రాళ్లు, రాతి పత్రాలపై రాస్తారు. కానీ ఈ రెండు గంటల్లో ఓ దానిపై శాసనం లిఖించి ఉండటం విశేషం. ‘స్వస్తిశ్రీమతు కందప్పనాయకరు, కొల్లిపాకేయ సకలేశ్వర సోమేశ్వర దేవరిగె కొట్టి పూజ’అని కన్నడలో లిఖించి ఉంది. కండప్ప నాయకరు కొల్లిపాక స్వామి సోమేశ్వరదేవుడికి విరాళంగా ఇచ్చిందన్న అర్ధం. కాశీ కొలనుపాక బింభావతి పట్టణంగా చరిత్రలో కొలనుపాక వెలుగొందింది. కళ్యాణి చాళుక్యుల హయాంలో రెండో రాజధానిగా కూడా భాసిల్లింది. మైసూరు వద్ద లభించిన ఒక శాసనంలో దీనిపేరు కొల్లిపాకైగా ఉంది. కాకతీయ రుద్రదేవుని శాసనంలో కొల్లిపాక అని ఉంది. ఇలా ఈ పేరు రూపాంతరం చెందుతూ కొలనుపాకగా స్థిరపడింది. ఈ గంటల్లో ఒకదానిపై అంజలి ముద్ర, అక్షమాల, గిండి ధరించి పద్మాసనంలో కూర్చున్న బ్రహ్మ, పరుశు, పాశం, దంతం, మోదుకం ధరించి లలితాసనంలో ఉన్న గణపతి, రెండు చేతులు అంజలి ముద్ర, మరో రెండు చేతుల్లో శంఖుచక్రాలు ధరించిన విష్ణువు, అభయహస్తం, శ్రీఫలం, శూలం, ఖట్వాంగం ధరించిన శివుడు ప్రతిరూపాలున్నాయి. మరో గంటపై ఆసీనుడైన బ్రహ్మ, విష్ణు, సూర్యుడు, గణపతి విగ్రహాలున్నాయి. కొంతమంది భక్తులకు ఈ గంటల ఖ్యాతి తెలిసి చూసేందుకు ఆలయాలకు వెళ్తున్నారు. కానీ అవి హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిసి తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. వాటిని వెంటనే కొలనుపాక ఆలయంలో ఏర్పాటు చేసి తగు భద్రత కల్పించాలి. అలనాటి ఆ గంటలు మోగించి ఆధ్యాత్మికానందం పొందే అవకాశాన్ని భక్తులకు కల్పించాలి. – రత్నాకరరెడ్డి ఔత్సాహిక పరిశోధకుడు -
కొలనుపాక ఆలయంలో బాంబే హైకోర్టు న్యాయమూర్తి
నల్లగొండ: కొలనుపాక (ఆలేరు): మండలంలోని కొలనుపాక జైనదేవాలయంలో సోమవారం బాంబే హైకోర్టు న్యాయమూర్తి కెకె తాడేడ్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికింది. పూజల అనంతరం ఆలయం యొక్క విశిష్టతను ఆలయ కమిటీ వివరించింది. ఆయన వెంట తహశీల్దార్ రామ్మూర్తి, సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్సై రాఘవేందర్ తదితరులున్నారు.