కనుమరుగవుతున్న మఠాలు | Telangana kolanupaka someswara temple matham history | Sakshi
Sakshi News home page

kolanupaka: వేల ఏళ్ల సంస్కృతి నేలపాలు

Jul 7 2025 8:04 PM | Updated on Jul 7 2025 8:06 PM

Telangana kolanupaka someswara temple matham history

కొలనుపాక సోమేశ్వరాలయంపై నిర్లక్ష్యం

ప్రభుత్వం చొరవ చూపాలంటున్న భక్తులు

వందల ఏళ్ల నాటి అపురూప ఆలయ సంపద ఆలనాపాలనా లేక ధ్వంసమవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో వీరశైవ మతానికి చెందిన శ్రీచండీకాంబసహిత సోమేశ్వరాలయం ఉంది. వీరశైవ పంచపీఠాల్లో కొలనుపాక ఒకటి. రేణుక సిద్ధుని జన్మభూమిగా ప్రసిద్ధి. ఈ ఆలయ ప్రాంగణంతోపాటు.. గ్రామంలో పలుచోట్ల 22 కులాలకు సంబంధించిన మఠాలు ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తిగా కనుమరుగవగా, మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని కులాలు.. తమ మఠాలను అభివృద్ధి చేసుకుంటుండగా.. నిరుపేద కులాలకు చెందిన మఠాల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మఠాల అభివృద్ధి పన్నెండేళ్లుగా  పూర్తి కాలేదు. దీంతో శిథిల చరిత్రకు నిలయంగా సోమేశ్వర దేవాలయ ప్రాంగణం నిలుస్తోంది.

మఠం అంటే.. 
మత ధర్మ నిష్టాపరుడై సద్భక్తి, వైరాగ్యంతో వీరుడనిపించుకొనడమే వీరశబ్దం అర్థం. 12వ శతాబ్దపు ఉత్తారార్ధంలో కన్నడ దేశపు కాలాచురి రాజైన బిజ్జలుని మంత్రి బసవనితో వీరశైవం వ్యాప్తి పొందింది. అంతకు ముందే ఆరాధ్య శైవం వ్యాప్తిలో ఉండేది. వీరశైవం ఆంధ్రదేశంలో ప్రవేశించి రాజుల ఆదరణ పొందింది. కాకతీయ రాజుల కాలంలో వీరశైవం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లిందని చరిత్ర పరిశోధకులు చెబుతారు. కాకతీయ రాజుల కాలంలో అనేక శైవ దేవాలయాలు నిర్మితమయ్యాయి. శైవ పీఠాలు, మఠాలు.. రాజుల సహాయ సహకారాలతో ఏర్పడి ప్రజాదరణ పొందాయి. అట్టడుగు వర్గాలలో వీరశైవం వ్యాప్తి పొందింది. వీరశైవం విజృంభించిన తర్వాత.. కొలనుపాకలో ప్రతి కులానికి ఒక మఠం ఏర్పడింది. వీరశైవులు తమ మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అష్టాదశ వర్గాల వారికి శివాలయాలు నిర్మించి ప్రజల మన్ననలు పొందారు.

మఠాల ప్రాధాన్యం 
మఠం అంటే.. మతపరమైన విద్యాబోధన కేంద్రం. విద్యాలయం. సన్యాసులు నివసించే ప్రాంతాలని, దేవాలయాలని అనేక అర్థాలున్నాయి. మఠాలు దేవాలయాలకు అనుబంధంగా ఉంటాయి. దేవాలయాలన్నీ ఆధ్యాత్మిక జీవనం గడిపే సద్వర్తనులైన ఆచార్యుల నిలయాలు. వీటికి అనుబంధంగా ఉండే మఠాల్లో.. ఆచార్యులు విద్యార్థులకు విద్యాబోధన చేస్తుండేవారు. మఠాచార్యులు అన్ని శాస్త్రాల‌లో ప్రవీణులుగా ఉండేవారు. పదో శతాబ్దంలో కాలాముఖ శైవాచార్యులు మఠాలను ఏర్పాటు చేసి.. ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ శిష్యులకు విద్యాబోధన చేస్తుండేవారు. 

ఎందరో రాజులు కాలాముఖ శైవ గురువులను రాజగురువులుగా ఆదరించి పోషించారు. సాంఘికంగా వీరికి చాలా విలువ ఉండేది. వీరు చెప్పిందే వేదం. రాజు నుంచి బంటు వరకు మఠాచార్యుల ఆజ్ఞలను పాటిస్తూ గౌరవిస్తుండేవారు. సంఘాన్ని శాసించే కేంద్ర బిందువుగా మఠాచార్యులుండేవారు. ఈ మఠాలన్నీ 10వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు గొప్ప స్థితిలో ఉన్నాయి. మఠాలన్నీ విద్యా కేంద్రాలుగానే కాకుండా సాంస్కృతిక కేంద్రాలుగా ఉండి.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేయడానికి దోహదపడుతుండేవని పరిశోధకుల అభిప్రాయం.

 

కుల ప్రాతిపదికన.. 
కొలనుపాకలో కుల ప్రాతిపదికతో ఏర్పడిన 22 మఠాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఇన్ని కుల మఠాలు ఒక్క దగ్గర లేవు. ఇది కొలనుపాకకు ఉన్న ప్రత్యేకత. శ్రీశైలంలో 13 మఠాలున్నట్లు సాహిత్య, శాసనాల ద్వారా తెలుస్తోంది. కాలముఖ మఠాలు 2, వీరశైవ మఠాలు 3, గోళకీ మఠాలు 4, ఆరాధ్య మఠాలు 1, ఇతర మఠాలు 3 శ్రీశైలంలో ఉన్నాయి. కానీ కొలనుపాకలో ప్రతి కులానికి ఒక మఠం ఉంది. వీరశైవం బాగా వ్యాప్తి చెందాలంటే ప్రతి కులంలో ఉన్న వ్యక్తులకు శైవదీక్ష ఇప్పించాలి. కులప్రాతిపదికగా మఠాలు ఏర్పాటు చేస్తే.. అది సాధ్యమవుతుందనే ఉద్దేశంతో కులానికి ఒక మఠం ఏర్పాటు చేశారు.

ప్రతి మఠంలో నంది, శివలింగం 
కొలనుపాకలోని ప్రతి మఠం దాదాపు అలంకారాలు లేకుండా నిర్మితమయ్యాయి. ప్రతి ఆలయంలో శివలింగం, నంది తప్ప వేరే అలంకారాలు లేవు. ప్రతి కులం వారు పండుగ రోజుల్లో.. శివరాత్రి రోజు తమ తమ మఠాలను అలంకరించుకుని పూజలు జరుపుకొంటారు. కొలనుపాకలో 18 కులాల వారికి గురువులున్నారు. మఠాల దగ్గర పండుగ రోజుల్లో ఆయా కుల పురాణాలు పఠిస్తుండేవారు. ఆ జానపద గాయకులను ప్రతి కులం వారు ఆదరించి పోషించారు. ప్రతి కుల పురాణంలో కేంద్ర బిందువు వీర శైవమే. అన్ని కులాలకు తమ కులమే మూలమని ప్రతి కుల పురాణాల ఇతివృత్తాలలో కనిపిస్తుంది. సోమేశ్వరస్వామి ఆలయ సింహద్వారం వద్ద ప్రమాణ మండపం ఉంది. తగాదాలలో ప్రమాణాలు చేయాల్సి వస్తే ఈ మండపం దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తుంటారు. ఈ మండపంలో అబద్ధాల ప్రమాణాలు చేస్తే అరిష్టం కలుగుతుందని ప్రజల విశ్వాసం.

 

కొలనుపాకలోని మఠాలివే.. 
వైశ్యమఠం, గాండ్ల మఠం, కాపుల మఠం, గొల్ల మఠం, కుర్మ మఠం, గౌండ్ల మఠం, మేర మఠం, పద్మశాలి మఠం, మేదరి మఠం, జాండ్ర మఠం, చాకలి మఠం, మంగలి మఠం, కుమ్మరి మఠం, వడ్డెర మఠం, మహమ్మాయి మఠం, మాల మఠం, మాదిగ మఠం, చిప్ప మఠం, సంగరి మఠం, పెరెక మఠం, శంబరి మఠం, తెనుగు మఠం ఉన్నాయి.

చ‌ద‌వండి: ఆలయంలో అబ్బురపరుస్తున్న బామ్మ.. 15 నిమిషాల పాటు 250 కిలోల గంట మోగిస్తూ.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement