breaking news
matham
-
కనుమరుగవుతున్న మఠాలు
వందల ఏళ్ల నాటి అపురూప ఆలయ సంపద ఆలనాపాలనా లేక ధ్వంసమవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో వీరశైవ మతానికి చెందిన శ్రీచండీకాంబసహిత సోమేశ్వరాలయం ఉంది. వీరశైవ పంచపీఠాల్లో కొలనుపాక ఒకటి. రేణుక సిద్ధుని జన్మభూమిగా ప్రసిద్ధి. ఈ ఆలయ ప్రాంగణంతోపాటు.. గ్రామంలో పలుచోట్ల 22 కులాలకు సంబంధించిన మఠాలు ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తిగా కనుమరుగవగా, మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని కులాలు.. తమ మఠాలను అభివృద్ధి చేసుకుంటుండగా.. నిరుపేద కులాలకు చెందిన మఠాల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మఠాల అభివృద్ధి పన్నెండేళ్లుగా పూర్తి కాలేదు. దీంతో శిథిల చరిత్రకు నిలయంగా సోమేశ్వర దేవాలయ ప్రాంగణం నిలుస్తోంది.మఠం అంటే.. మత ధర్మ నిష్టాపరుడై సద్భక్తి, వైరాగ్యంతో వీరుడనిపించుకొనడమే వీరశబ్దం అర్థం. 12వ శతాబ్దపు ఉత్తారార్ధంలో కన్నడ దేశపు కాలాచురి రాజైన బిజ్జలుని మంత్రి బసవనితో వీరశైవం వ్యాప్తి పొందింది. అంతకు ముందే ఆరాధ్య శైవం వ్యాప్తిలో ఉండేది. వీరశైవం ఆంధ్రదేశంలో ప్రవేశించి రాజుల ఆదరణ పొందింది. కాకతీయ రాజుల కాలంలో వీరశైవం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లిందని చరిత్ర పరిశోధకులు చెబుతారు. కాకతీయ రాజుల కాలంలో అనేక శైవ దేవాలయాలు నిర్మితమయ్యాయి. శైవ పీఠాలు, మఠాలు.. రాజుల సహాయ సహకారాలతో ఏర్పడి ప్రజాదరణ పొందాయి. అట్టడుగు వర్గాలలో వీరశైవం వ్యాప్తి పొందింది. వీరశైవం విజృంభించిన తర్వాత.. కొలనుపాకలో ప్రతి కులానికి ఒక మఠం ఏర్పడింది. వీరశైవులు తమ మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అష్టాదశ వర్గాల వారికి శివాలయాలు నిర్మించి ప్రజల మన్ననలు పొందారు.మఠాల ప్రాధాన్యం మఠం అంటే.. మతపరమైన విద్యాబోధన కేంద్రం. విద్యాలయం. సన్యాసులు నివసించే ప్రాంతాలని, దేవాలయాలని అనేక అర్థాలున్నాయి. మఠాలు దేవాలయాలకు అనుబంధంగా ఉంటాయి. దేవాలయాలన్నీ ఆధ్యాత్మిక జీవనం గడిపే సద్వర్తనులైన ఆచార్యుల నిలయాలు. వీటికి అనుబంధంగా ఉండే మఠాల్లో.. ఆచార్యులు విద్యార్థులకు విద్యాబోధన చేస్తుండేవారు. మఠాచార్యులు అన్ని శాస్త్రాలలో ప్రవీణులుగా ఉండేవారు. పదో శతాబ్దంలో కాలాముఖ శైవాచార్యులు మఠాలను ఏర్పాటు చేసి.. ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ శిష్యులకు విద్యాబోధన చేస్తుండేవారు. ఎందరో రాజులు కాలాముఖ శైవ గురువులను రాజగురువులుగా ఆదరించి పోషించారు. సాంఘికంగా వీరికి చాలా విలువ ఉండేది. వీరు చెప్పిందే వేదం. రాజు నుంచి బంటు వరకు మఠాచార్యుల ఆజ్ఞలను పాటిస్తూ గౌరవిస్తుండేవారు. సంఘాన్ని శాసించే కేంద్ర బిందువుగా మఠాచార్యులుండేవారు. ఈ మఠాలన్నీ 10వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు గొప్ప స్థితిలో ఉన్నాయి. మఠాలన్నీ విద్యా కేంద్రాలుగానే కాకుండా సాంస్కృతిక కేంద్రాలుగా ఉండి.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేయడానికి దోహదపడుతుండేవని పరిశోధకుల అభిప్రాయం. కుల ప్రాతిపదికన.. కొలనుపాకలో కుల ప్రాతిపదికతో ఏర్పడిన 22 మఠాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఇన్ని కుల మఠాలు ఒక్క దగ్గర లేవు. ఇది కొలనుపాకకు ఉన్న ప్రత్యేకత. శ్రీశైలంలో 13 మఠాలున్నట్లు సాహిత్య, శాసనాల ద్వారా తెలుస్తోంది. కాలముఖ మఠాలు 2, వీరశైవ మఠాలు 3, గోళకీ మఠాలు 4, ఆరాధ్య మఠాలు 1, ఇతర మఠాలు 3 శ్రీశైలంలో ఉన్నాయి. కానీ కొలనుపాకలో ప్రతి కులానికి ఒక మఠం ఉంది. వీరశైవం బాగా వ్యాప్తి చెందాలంటే ప్రతి కులంలో ఉన్న వ్యక్తులకు శైవదీక్ష ఇప్పించాలి. కులప్రాతిపదికగా మఠాలు ఏర్పాటు చేస్తే.. అది సాధ్యమవుతుందనే ఉద్దేశంతో కులానికి ఒక మఠం ఏర్పాటు చేశారు.ప్రతి మఠంలో నంది, శివలింగం కొలనుపాకలోని ప్రతి మఠం దాదాపు అలంకారాలు లేకుండా నిర్మితమయ్యాయి. ప్రతి ఆలయంలో శివలింగం, నంది తప్ప వేరే అలంకారాలు లేవు. ప్రతి కులం వారు పండుగ రోజుల్లో.. శివరాత్రి రోజు తమ తమ మఠాలను అలంకరించుకుని పూజలు జరుపుకొంటారు. కొలనుపాకలో 18 కులాల వారికి గురువులున్నారు. మఠాల దగ్గర పండుగ రోజుల్లో ఆయా కుల పురాణాలు పఠిస్తుండేవారు. ఆ జానపద గాయకులను ప్రతి కులం వారు ఆదరించి పోషించారు. ప్రతి కుల పురాణంలో కేంద్ర బిందువు వీర శైవమే. అన్ని కులాలకు తమ కులమే మూలమని ప్రతి కుల పురాణాల ఇతివృత్తాలలో కనిపిస్తుంది. సోమేశ్వరస్వామి ఆలయ సింహద్వారం వద్ద ప్రమాణ మండపం ఉంది. తగాదాలలో ప్రమాణాలు చేయాల్సి వస్తే ఈ మండపం దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తుంటారు. ఈ మండపంలో అబద్ధాల ప్రమాణాలు చేస్తే అరిష్టం కలుగుతుందని ప్రజల విశ్వాసం. కొలనుపాకలోని మఠాలివే.. వైశ్యమఠం, గాండ్ల మఠం, కాపుల మఠం, గొల్ల మఠం, కుర్మ మఠం, గౌండ్ల మఠం, మేర మఠం, పద్మశాలి మఠం, మేదరి మఠం, జాండ్ర మఠం, చాకలి మఠం, మంగలి మఠం, కుమ్మరి మఠం, వడ్డెర మఠం, మహమ్మాయి మఠం, మాల మఠం, మాదిగ మఠం, చిప్ప మఠం, సంగరి మఠం, పెరెక మఠం, శంబరి మఠం, తెనుగు మఠం ఉన్నాయి.చదవండి: ఆలయంలో అబ్బురపరుస్తున్న బామ్మ.. 15 నిమిషాల పాటు 250 కిలోల గంట మోగిస్తూ.. -
మదురై మఠాధిపతి కన్నుమూత
మదురై: మదురైలో ప్రసిద్ధి చెందిన శైవ మఠం ఆధీనం(మఠాధిపతి) అరుణగిరినాధర్ (77) శుక్రవారం కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కొద్దిరోజుల క్రితం ఆయనను మదురైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారని అధీనం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 1,500 సంవత్సరాల చరిత్ర ఉన్న శైవ మఠానికి ఆయన 292వ పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. అరుణగిరినాధర్ మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామిలు సంతాపం వ్యక్తం చేశారు. శైవ మత సూత్రాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు సీనియర్ పాత్రికేయులుగా పని చేస్తూ ప్రజోపకరమైన పనులలో ఆయన నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. ఆయన మరణం తీరని లోటు అని చెప్పారు. తమిళ ప్రపంచానికి ఆయన మరణం పెద్ద లోటు అంటూ ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
వైభవం.. ముంజీ మహోత్సవం
– శాస్త్రోక్తంగా పీఠాధిపతి పూర్వాశ్రమ పుత్రుడికి యజ్ఞోపవీతం – వేలాది మంది భక్తుల మధ్య సాగిన జంజధారణ మంత్రాలయం: ప్రముఖ శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు పూర్వాశ్రమ పుత్రుడు అప్రమేయ ముంజీ మహోత్సవం వైభవంగా సాగింది. గురువారం పీఠాధిపతి ఆశీస్సులతో వేద పాఠశాల ఆవరణలో అప్రమేయ చేతుల మీదుగా హోమాలు చేపట్టారు. శాస్త్రోక్తంగా పండిత కేసరి గిరియాచార్ అప్రమేయకు యజ్ఞోపవీతం కానిచ్చారు. పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల సుస్వరాలు, అశేష భక్తజన సందోహం మధ్య జంజధారణ గావించారు. పీఠాధిపతి పూర్వాశ్రమ తండ్రి పండితకేసరి గిరియాచార్ సమక్షంలో పండిత మహాశయులు అప్రమేయకు జంజం తొడిగించారు. ఉదయం 10.15 గంటలకు శుభ మేషలగ్న, వృషభాంశ గడియలో ముంజీ చేశారు. ముందుగా ప్రత్యేక హోమాలు చేపట్టి పుష్పశోభిత సభపై మంత్రజపాల మధ్య యజ్ఞోపవీతం ముగించారు. అనంతరం అప్రమేయ పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల పాద పూజ చేసుకున్నారు. టీటీడీ కల్యాణ మండప ఆవరణలో భోజనాలు నిర్వహించారు. వేడుకలో బెంగళూరు ఎమ్మెల్యే అరవింద లింబావలి, విజయ్‌కుమార్, ఎమ్మెల్సీ నారాయణస్వామి హాజరయ్యారు. కార్యక్రమంలో ఆప్త కార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, మఠం ఈఈ సురేష్ కోనాపూర్, పాఠశాల ప్రిన్సిపాల్ వాదీరాజాచార్ పాల్గొన్నారు. -
ముగిసిన మొహర్రం సంతాప దినాలు
బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణంలో మొహర్రం సంతాప దినాలు సోమవారం ముగిశాయి. గత నెల 12వ తేదీన పీర్ల నిమజ్జనంతో ఇవి ప్రారంభమయ్యాయి. ముగింపు సందర్భంగా కొండపేటలోని తల్లిపీర్ల చావిడి వద్ద నుంచి ఇమాం హసన్, ఇమాం హుస్సేన్ పీర్లకు షీయా మతస్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం చురకత్తులు, బ్లేడ్లతో వీపు, ఎదలపై మాతం చేస్తూ ర్యాలీగా విద్యుత్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అలాగే పట్టణంలోని ఆస్థానం నుంచి బనగానపల్లె నవాబు మీర్ఫజిల్ అలీఖాన్, ఆయన కుమారుడు గులాం అలీఖాన్ ఆధ్వర్యంలో దొరకోట వరకు షీయా మతస్తులు మాతం నిర్వహించారు. మాతం చూసేందుకు హిందూ ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎంఐఎం ఆధ్వర్యంలో వారకి మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు.