
కిన్నెరసాని జలాశయం మధ్యలో ఆనంద ద్వీపం
మంత్రులు, కలెక్టర్లు పరిశీలించినా అభివృద్ధికి దూరమే
ఫలితంగా దూరం నుంచే పర్యాటకులు వీక్షించాల్సిన దుస్థితి
పాల్వంచ రూరల్: ప్రకృతి అందాలకు నెలవైన కిన్నెరసాని పర్యాటక అభివృద్ధికి నోచుకోవడం లేదు. మంత్రులు, కలెక్టర్లు ప్రత్యక్షంగా పరిశీలించినా అడుగు కూడా ముందుకు పడడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని పర్యాటకంగా అభివృద్ధి చెందకపోవడంతో ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతోంది. నిత్యం వందల సంఖ్యలో, సెలవు రోజుల్లో వేలాదిగా వచ్చే పర్యాటకులు రిజర్వాయర్ మధ్యలోని ఆనంద ద్వీపాన్ని సందర్శించాలని తపన పడుతుంటారు. కానీ అక్కడ చేయాల్సిన అభిృవృద్ధి పనుల్లో ముందడుగు పడకపోవడంతో అద్భుత అవకాశాన్ని కోల్పోతున్నారు.
ముగ్గురు మంత్రులు వీక్షించినా..
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఏడాది క్రితం కిన్నెరసానిని సందర్శించారు. రిజర్వాయర్ మధ్యలోని ఆనంద ద్వీపం అద్భుతంగా ఉందని, పర్యాటకులకు దర్శనభాగ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అద్దాల మేడ, కాటేజీ పనులు వేగవంతం చేయాలని, పర్యాటకులను ఆకర్షించేలా ఆనంద ద్వీపాన్ని తీర్చిదిద్దాలని అటవీశాఖను ఆదేశించారు. ప్రభుత్వం కూడా ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించడంతో కలెక్టర్ కిన్నెరసానిపై ప్రత్యేక దృష్టి సారించినా, పనులు మాత్రం మందకొడిగానే సాగుతున్నాయి.
పర్యాటకులకు నిరాశే..
చూడచక్కని ప్రకృతి అందాలు, అద్భుతమైన హైల్యాండ్స్, అందమైన జలాశయం, ఆహ్లాదకరమైన అడవులు ఉన్న కిన్నెరసానిలో సౌకర్యాలు లేక పర్యాటకులకు నిరాశే మిగులుతోంది. అద్దాలమేడ, కాటేజీలు, హారిత హోటల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతారు.
పదేళ్ల క్రితమే నిధులు మంజూరు
కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు 2015లో నీతి అయోగ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.3.24 కోట్లు, ఎకో టూరిజం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.7.53 కోట్లు మంజూరు చేశాయి. ఆ నిధులతో కొత్తగూడెం క్రాస్ వద్ద హరిత హోటల్, కిన్నెరసానిలో పది కాటేజీలు, అద్దాలమేడ, ఫుడ్‌కోర్టు పనులు చేపట్టాలని నిర్ణయించారు. కాగా, ఇందులో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో సౌకర్యాల లేమితో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నా.. వసతులు ఉంటే మరింత మంది వచ్చే అవకాశం ఉంది.
సింగపూర్ నుంచి ఆర్కిటెక్ట్‌లు..
రిజర్వాయర్ మధ్యలో ఉన్న ఆనంద ద్వీపాన్ని అభివృద్ధి చేసేందుకు 2018లో అప్పటి కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ సింగపూర్ నుంచి ప్రత్యేకంగా ఆర్కిటెక్ట్‌లను పిలిపించారు. పర్యాటకుల సౌకర్యార్థం వెదురు బొంగులతో గుడారాలు, ఎత్తయిన ట్రాక్, తాగునీటి వసతి వంటివి కల్పించాలని నిర్ణయించారు. అయితే అవి నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కలెక్టర్లు ఎంవీ రెడ్డి, అనుదీప్‌తోపాటు ప్రస్తుత కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కూడా పనులను పరిశీలించినా ఫలితం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని లక్నవరంలో ఏర్పాటు చేసినట్టుగా ఆనంద ద్వీపం (Anand Dweepam) వరకు తీగలవంతెన ఏర్పాటు చేసి, హోటళ్లు, వసతి గృహాలను నిర్మిస్తే పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.
చదవండి: కంబాలపల్లి C/o ప్రభుత్వోద్యోగులు