జకార్తా: ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో బుధవారం (నవంబర్ 5) శక్తివంతమైన భూకంపం సంభవించింది. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దేశ జియోఫిజికల్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది. ఈ భూకంపం తర్వాత సునామీ ప్రమాదం పొంచి ఉందని తొలుత భయపడినప్పటికీ, అటువంటిదేమీ లేదని ఏజెన్సీ నిర్ధారించింది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపింది.
సులవేసిలోని కొన్ని ప్రాంతాలను భూకంపం కుదిపేసింది. ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనలు తీవ్రంగా ఉండి, కొన్ని సెకన్ల పాటు కొనసాగాయి. పరిస్థితిని అంచనా వేయడానికి అత్యవసర ప్రతిస్పందన బృందాలు ఉపక్రమించాయి. ఆసియా, ఆస్ట్రేలియన్ ఖండాల మధ్య, పసిఫిక్ మహాసముద్రం అంచున ఇండోనేషియా ఉంది. ఇది ప్రపంచంలోని 90 శాతం భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలలో 75 శాతం సంభవించే ప్రాంతంగా నిలిచింది. దేశ ప్రజలు తరచూ భూకంపాలు, సునామీల ప్రభావాలకు గురవుతుంటారు.


