ఖమ్మంలో వినూత్న కార్యక్రమం, స్కూళ్లకే సర్టిఫికెట్లు.. మంత్రి పువ్వాడ ఏమన్నారంటే..

Khammam: Caste And Income Certificates In Schools - Sakshi

రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇక్కట్లకు చెక్‌

పాఠశాలల్లోనే కుల, ఆదాయ ధ్రువపత్రాలు 

ఖమ్మం జిల్లాలో విజయవంతంగా సాగుతున్న వినూత్న విధానం

ఇప్పటికే 6 వేల మందికిపైగా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తోంది. ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కోసం అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఎస్సీ విద్యార్థులు పడుతున్న కష్టాలు తీర్చేందుకు జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ తీసుకున్న చొరవ సత్ఫలితాలిస్తోంది.

ఆయా పత్రాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా స్కూళ్లకే వాటిని పంపుతుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సర్టిఫికెట్లను అందించే కార్యక్రమాన్ని శరవేగంగా పూర్తి చేస్తుండటంతో ఎస్సీ విద్యార్థులు స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవడం సులువవుతోంది.

ప్రక్రియ ఇలా...
పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ విద్యార్థుల జాబితాలను హెచ్‌ఎంలు సిద్ధం చేశాక.. రెవెన్యూ అధికారులు పాఠశాలలకు వెళ్లి సర్టిఫికెట్లు అవసరమైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే అధికా రులే మీ–సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసి సర్టిఫికెట్లను సిద్ధం చేసి పాఠశాలలకు వెళ్లి నేరుగా విద్యార్థులకు అందజేస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల ఇక్కట్లు తీరడమే కాక సమయం కలిసొస్తోంది. పలు పాఠశాలల్లో సర్టిఫికెట్లు అందజేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌.. ఈ విధానాన్ని రాష్ట్రమంతటా అమలుచేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పడం విశేషం.

ఇప్పటికే 76 శాతం మందికి..
ఖమ్మం జిల్లాలో 8,446 మంది ఎస్సీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఇందులో 5,070 మంది ఈ–పాస్‌ వెబ్‌ పోర్టల్‌లో నమోద య్యారు. వారిలో ఇప్పటివరకు 6,434 మందికి కుల, 6,467 మందికి ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందాయి. మొత్తంగా 76 శాతం మంది విద్యార్థుల కు సర్టిఫికెట్లను పాఠశాలల్లోనే అందించగా.. జిల్లావ్యాప్తంగా మిగిలిన విద్యార్థులకు ఆధార్, చిరునామా సరిగ్గా లేకపోవడంతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోందని చెబుతున్నారు.

విద్యార్థులకు ఉపయోగం
ఇది ఎంతో మంచి ప్రక్రియ. దీనివల్ల విద్యార్థులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింది. ఇప్పుడు వెంటనే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.
– పి.శిరీష, హెచ్‌ఎం, రఘునాథపాలెం

పాఠశాలలో సర్టిఫికెట్లు ఇచ్చారు..
మాకు అవసరమైన సర్టిఫికెట్లను బడిలోనే అందుకోవడం ఆనందంగా ఉంది. గతంలోనైతే ఈ సర్టిఫికెట్లు కావాలంటే బడికి వెళ్లలేకపోయే వాళ్లం.
– మేక సాత్రిక, 9వ తరగతి విద్యార్థిని

మంచి కార్యక్రమం
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కలెక్టర్‌ గౌతమ్‌ ఆదేశాల మేరకు కుల, ఆదాయ సర్టిఫికెట్లు అందిస్తున్నారు. ఈ విధానం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. 
– ఎస్‌.యాదయ్య, డీఈఓ, ఖమ్మం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top