చినికి చినికి చివరికి హత్యగా! | Key Facts In The Murder Case Of Waqf Board Panel Member Khawaja Mohiuddin, Probe Uncovers Conspiracy | Sakshi
Sakshi News home page

చినికి చినికి చివరికి హత్యగా!

Jun 3 2026 9:00 AM | Updated on Jun 3 2026 9:36 AM

Key Facts In The Murder Case Of Waqf Board Panel Member Khawaja Mohiuddin

మొహిజుద్దీన్‌–ఆలంఖాన్‌ మధ్య ఏళ్లుగా విభేదాలు

మలక్‌పేట, లక్డీకాపూల్‌లోని సంస్థలపై పట్టు కోసమే..

మజ్లిస్‌ ఏ ఉమ్నా నుంచి తొలగింపుతో తారాస్థాయికి..

పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి కీలకాంశాలు

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు న్యాయవాది, వక్ఫ్‌ బోర్డు ప్యానెల్‌ సభ్యుడు ఖాజా మొహిజుద్దీన్‌ హత్య కేసు దర్యాప్తులో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వక్ఫ్‌ ఆస్తులకు సంబంధించిన వివాదాలు, విలువైన స్థిరాస్తులు తమ చేయి దాటిపోతున్నాయనే ఉద్దేశంతోనే ఆలంఖాన్‌లు ఈ హత్యకు ప్లాన్‌ చేసినట్లు వెల్లడైంది. మలక్‌పేట, లక్డీకాపూల్‌ల్లోని ముంతాజ్‌ యార్‌ ఉద్‌ దౌలా వక్ఫ్‌తోపాటు మల్లేపల్లిలో ఉన్న మదర్సా ఏ ఎజాజ్‌ వక్ఫ్‌ ఆస్తులకు సంబంధించి ఖాజా మొహిజుద్దీన్‌కు తండ్రీకుమారులైన మహబూబ్‌ ఆలంఖాన్, ముజాహిద్‌ ఆలంఖాన్‌ వర్గాల మధ్య ఏళ్లుగా విభేదాలు నెలకొన్నాయి.

13 ఏళ్లుగా వివాదాలు.. 
ఈ రెండు సంస్థలకు చెందిన స్థిరచరాస్తులు, విద్యాసంస్థల పరిపాలన, నిర్వహణను చేతుల్లోకి తీసుకునే అంశంపై 13 ఏళ్లుగా వివాదాలు నడిచాయి. ఈ నేపథ్యంలోనే మజ్లిస్‌ ఏ ఉమ్నాగా పిలిచే ముంతాజ్‌ యార్‌ ఉద్‌ దౌలా వక్ఫ్‌ మేనేజింగ్‌ కమిటీ 2013లో మహబూబ్‌ ఆలంఖాన్‌ను సెక్రటరీ పోస్టు నుంచి తొలగించింది. దీంతో మహబూబ్‌ ఆలంఖాన్‌ 17 మంది సభ్యులతో ఇబ్రహీం బిన్‌ అబ్దుల్లా మస్కతీ ప్రెసిడెంట్‌తో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిటీలు ఒకదానిపై మరోటి హైకోర్టులో అనేక రిట్‌ పిటిషన్లు ఫైల్‌ చేసుకున్నాయి.

రాజీ చేసినా..  
2023లో కొందరు ఈ రెండు గ్రూపుల మధ్య రాజీ చేసి క్రిమినల్, సివిల్‌ పిటిషన్లు ఉపసంహరించునేలా చేశారు. దీంతో మహబూబ్‌ ఆలంఖాన్‌ ముంతాజ్‌ యార్‌ ఉద్‌ దౌలా వక్ఫ్‌కు సెక్రటరీగా పునర్‌ నియమితులై 2025 ఫిబ్రవరి వరకు కొనసాగారు. ఆర్థిక అవకతవకలపై మరోసారి మహబూబ్‌ ఆలంఖాన్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన ముంతాజ్‌ యార్‌ ఉద్‌ దౌలా వక్ఫ్‌ మేనేజింగ్‌ కమిటీని రద్దు చేసింది. ఆ సమయంలో 2025 నుంచి 2027 వరకు చెల్లుబాటు అయ్యేలా ఏర్పడిన కొత్త కమిటీకి ఖాజా మొహిజుద్దీన్‌ ట్రెజరర్‌గా నియమితులయ్యారు. దీంతో మరోసారి హైకోర్టులో మహబూబ్‌ ఆలంఖాన్‌కు వ్యతిరేకంగా పిటిషన్లు ఫైల్‌ అయ్యాయి. వాటికి ఖాజా మొహిజుద్దీన్‌ వకాల్తా తీసుకున్నారు.

వకాల్తా.. ఆర్థికంగా దివాలా.. 
2013లో ఉస్మాన్‌ ఖాన్, కిషన్‌సింగ్‌ అలియాస్‌ పప్పుతో కలిసి మహబూబ్‌ ఆలంఖాన్‌ లంగర్‌హౌస్‌ ప్రాంతానికి చెందిన ఒక మహిళ ద్వారా ఖాజా మొహిజుద్దీన్‌పై అత్యాచారం కేసు నమోదు చేయించారు. దర్యాప్తు అనంతరం ఈ కేసును పోలీసులు మూసివేశారు. మొహిజుద్దీన్‌ వకాల్తా కారణంగా తాము ఆర్థికంగా నష్టపోతున్నామని, అనేక వక్ఫ్‌ ఆస్తులు చేయి దాటిపోతున్నాయని భావించిన ఆలంఖాన్లు అతడిని అంతం చేయాలని కుట్ర పన్నారు.

అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంగా కనిపించేలా హత్య చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ బాధ్యతల్ని తమ వద్ద పని చేసే హసన్‌ అలీతోపాటు ముజాహిద్‌ ఆలంఖాన్‌కు పరిచయస్తుడైన మునీర్‌లకు అప్పగించారు. కిషన్‌సింగ్‌ని కూడా భాగస్వామిని చేశారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సిందిగా నాంపల్లి పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మరోపక్క పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసమూ గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement