గాయపడిన బీఆర్‌ఎస్ కార్యకర్తను పరామర్శిస్తున్న కేటీఆర్. చిత్రంలో మాగంటి సునీత, మాధవరం కృష్ణారావు
అభ్యర్థుల ఎంపికలో పార్టీ విధేయత, సామాజిక సమీకరణాలు ప్రామాణికంగా తీసుకోండి
ఎర్రవల్లి నివాసంలో కేటీఆర్, హరీశ్‌రావుతో భేటీలో కేసీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై చర్చ
త్వరలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు శనివారం ఎర్రవల్లి నివాసంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇటీవల తన సోదరి భర్త, హరీశ్‌రావు తండ్రి మరణం నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని కేసీఆర్ ఎర్రవల్లికి ఆహ్వానించినట్లు తెలిసింది. కేటీఆర్ కూడా ఎర్రవల్లికి వెళ్లడంతో ఈ కీలక భేటీ జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ భేటీలో జూబ్లీహిల్స్ ఫలితంపై వివిధ కోణాల్లో చర్చించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతను కూడా ఇప్పటి నుంచే ప్రారంభించాలని కేసీఆర్ వారిని ఆదేశించారు.
రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీ విధేయత, సామాజికవర్గ సమీకరణాలు, కొత్త తరాన్ని ప్రోత్సహించడం తదితరాలను అభ్యర్థుల ఎంపికలో ప్రామాణికంగా తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. పార్టీకి దూరమైన వర్గాలను గుర్తించి రాబోయే రోజుల్లో ఆయా వర్గాలకు చేరువయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కేడర్‌కు శిక్షణ కార్యక్రమాలు తదితరాలు స్థానిక ఎన్నికల షెడ్యూలును దృష్టిలో పెట్టుకుని ఖరారు చేయాలని ఆదేశించారు.
మరింత లోతుగా అధ్యయనం
జూబ్లీహిల్స్ ఫలితాలను బూత్‌ల వారీగా మరింత లోతుగా అధ్యయనం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఉప ఎన్నికకు బీఆర్‌ఎస్ సన్నద్ధత, పార్టీ అభ్యర్థి ఎంపిక, ప్రచారంలో నేతల మోహరింపు, ప్రచారం తీరుతెన్నులు తదితరాలపై సమీక్షించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అనుసరించిన ఎత్తుగడలు, పోలింగ్ వ్యూహం తదితరాలను కేసీఆర్ విశ్లేíÙంచారు.
కాంగ్రెస్ అనుసరించిన ప్రలోభాలు, బెదిరింపుల పర్వంతోపాటు అధికార దుర్వినియోగం మూలంగా ఫలితం ఆశించిన రీతిలో రాలేదనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైనట్లు తెలిసింది. అయితే బీఆర్‌ఎస్ యంత్రాంగం క్షేత్రస్థాయిలో సర్వశక్తులూ కేంద్రీకరించడం వల్లే పార్టీ అభ్యర్థికి గణనీయమైన ఓట్లు వచ్చినట్లు కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న నేతలను కేసీఆర్ అభినందించారు. త్వరలో తెలంగాణ భవన్ లేదా ఎర్రవల్లిలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించే అవకాశముందని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.


