
బోర్డు ఏర్పాటు చేసుకున్న కామారెడ్డి వాసులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అనంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor)సక్సెస్ కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలోని ఓ వీధికి ‘సిందూర్ స్ట్రీట్’(సిందూర్ వీధి) అని నామకరణం చేశారు. మంగళవారం ఆ వీధికి చెందిన ఇళ్ల యజమానులు సిందూర్ స్ట్రీట్ బోర్డు ఏర్పాటు చేసి ప్రారంభించుకున్నారు.
ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తూ, మన దేశ త్రివిధ దళాలకు మద్దతుగా వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని శాశ్వతంగా గుర్తుంచుకోవాలన్న ఉద్దేశంతో ఆ వీధి వాసులు తమ వీధికి సిందూర్ స్ట్రీట్ అని నామకరణం చేసి సైనికులకు మద్దతు తెలిపారు. దేశం కోసం సైనికులు చేసిన పోరాట పటిమను భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునే విధంగా తమ వీధికి సిందూర్ స్ట్రీట్ అని పేరు పెట్టినట్టు వారు పేర్కొన్నారు.