MLC Kavitha-ED Investigation: ఇంటి వద్దే విచారించండి | Kalvakuntla Kavitha letter to Enforcement Directorate | Sakshi
Sakshi News home page

MLC Kavitha-ED Investigation: ఇంటి వద్దే విచారించండి

Mar 17 2023 3:00 AM | Updated on Mar 17 2023 4:24 PM

Kalvakuntla Kavitha letter to Enforcement Directorate - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  తాను నేరుగా విచారణకు హాజరుకాలేనని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇంటి నుంచే విచారణ చేయాలని ఈడీని ఎమ్మెల్సీ కవిత అభ్యర్థించారు. ఈడీ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే.. దర్యాప్తును విశ్వసించడానికి కారణాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు కవిత గైర్హాజరు అయ్యారు.

ఈ మేరకు తాను ఈడీ కార్యాలయానికి ఎందుకు రావడం లేదనే అంశాలతోపాటు మహిళగా తనకున్న హక్కులను వివరిస్తూ ఆరు పేజీల లేఖ రాశారు. ఈడీ కోరిన మేర అన్ని ధ్రువపత్రాలను తన న్యాయవాది భరత్‌కుమార్‌తో పంపుతున్నానని.. ఇంకా ఏమైనా అవసరమైతే తనకు ఈ–మెయిల్‌ చేస్తే, వెంటనే స్పందిస్తానని తెలిపారు. ఈడీకి కవిత రాసిన లేఖ సారాంశమిదీ.. 

‘‘ఈ ఏడాది మార్చి 11న ఢిల్లీ కార్యాలయంలో విచారణకు రావా లని ఈడీ మార్చి 7న సమన్లు ఇచ్చింది. అయితే చట్టాల ద్వారా రక్షణ కలిగిన మహిళగా తనను ఈడీ కార్యాలయానికి పిలవాల్సిన అవసరం లేదని, ఆడియో/వీడియో పద్ధతిలో కనిపించడానికి సిద్ధంగా ఉంటూ ఈడీ అధికారులను నా నివాసానికి ఆహ్వా నించాను. కానీ కస్టడీలో ఉన్న మరో వ్యక్తితో కలిపి భౌతికంగా విచారించాల్సి ఉందని, విచారణ వాయిదాగానీ, నివాసంలో స్టేట్‌మెంట్‌ రికార్డు చేయడం కుదరదని అధికారులు అభ్యంతరం తెలిపారు.

దీనితో దర్యాప్తునకు సహకరించడానికి మార్చి 11న ఈడీ కార్యాలయానికి హాజరయ్యాను. తెలిసిన వివరాలన్నీ అందించి సహకరించాను. నా ఫోన్‌ తేవాలని సమన్లలో పేర్కొనకపోయినా.. నా ఫోన్‌ తెప్పించి, స్వాధీనం చేసుకుంటానంటే అప్పగించాను. ఇలా ఫోన్‌ తీసుకోవడం చట్టబద్ధం కాదు. అంతేగాక సూర్యాస్తమయం అయినా రాత్రి 8.30 గంటల వరకు కార్యాలయంలో కూర్చోబెట్టారు. 

నా హక్కులకు ఉల్లంఘన జరిగింది 
మళ్లీ మార్చి 16న రావాలని ఈడీ అధికారులు సమన్లు ఇచ్చారు. కేవలం వ్యక్తిగతంగా హాజరుకావాలని పేర్కొన్నారు. కానీ నేను అధీకృత ప్రతినిధి ద్వారా హాజరవుతాను. ఈ క్రమంలో నా తరఫున బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్‌ను ఆథరైజ్‌ చేస్తున్నాను. అధికారులు కోరిన ధ్రువపత్రాలు ఆయనతో పంపుతున్నాను. విచారణలో పాల్గొనడానికి, విచారణకు సహకరించడానికి ఎలాంటి నాకు ఇబ్బందీ లేదు.

అయితే అరెస్టయిన కొందరు నిందితులతో కలిపి మార్చి 11న విచారణ చేస్తామని స్పష్టంగా చెప్పీ.. ఆ విధంగా చేయలేదు. ఇదే విషయాన్ని అధికారి భానుప్రియ మీనాను అడగగా.. ప్రణాళిక మార్చుకున్నామని తెలిపారు. అందుకే దర్యాప్తును విశ్వసించడానికి కారణాలు కనిపించడం లేదు. ఈ తీరుతో నా ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగినట్లే.

ఈ నేపథ్యంలోనే ఆర్టికల్‌ 32 ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాను. మార్చి 7, 11 నాటి సమన్లను రద్దు చేయాలని, నాపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించాను. ఈ నెల 24న విచారణ జాబితాలో నా పిటిషన్‌ చేర్చాలని సీజేఐ ఆదేశాలు ఇచ్చారు. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ వరకూ ఈడీ విచారణ ఆపాలని కోరుతున్నా. 

మహిళగా నా హక్కులను గుర్తించాలి 
ఈడీ కార్యాలయానికి ఒక మహిళను పిలవడానికి సంబంధించిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. నేను కూడా మహిళనే కాబట్టి ఆ కేసు నా కేసు వేర్వేరు కాదు. నా జీవితాన్ని సమాజానికి అంకితం చేశా. చట్టానికి లోబడి ఉంటాను. నా హక్కులు ఉల్లంఘనకు గురైనా.. చట్టాలను ఉల్లఘించకపోవడం నా బాధ్యత.

నా బ్యాంకు స్టేట్‌మెంట్లు అందజేయడానికి నా ప్రతినిధిగా బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్‌ను పంపుతున్నా. దీన్ని రికార్డుల్లోకి తీసుకోవచ్చు. ఇతర పత్రాలు ఏమైనా అవసరమైతే ఈ–మెయిల్‌ ద్వారా తెలియజేయండి. నేను కట్టుబడి ఉంటాను’’ అని కవిత తన లేఖలో పేర్కొన్నారు. 
 
20న విచారణకు రండి 
– ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు 
తాను విచారణకు రాలేనని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించాలని కవిత చేసిన విజ్ఞప్తి పట్ల ఈడీ కొన్ని గంటల తర్వాత స్పందించింది. అయితే ఇంటివద్ద విచారణ, వీడియో కాన్ఫరెన్స్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నెల 20న ఈడీ కార్యాలయంలోనే విచారణకు హాజరుకావాలంటూ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు కవితకు ఈ–మెయిల్‌ పంపింది. 
 
కవిత కూడా అనుమానితురాలే.. 
ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు అరుణ్‌ పిళ్లైని ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. సౌత్‌ గ్రూపులోని ఇతర వ్యక్తులతో కలిపి పిళ్‌లైని విచారించాల్సి ఉందని, అందువల్ల కస్టడీ పొడిగించాలని కోర్టును కోరారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతి ఏమిటి? బుచ్చిబాబు, అరుణ్‌ పిళ్లైలను కలిపి విచారించడం పూర్తయిందా? కవిత విచారణకు హాజరయ్యారా? అని న్యాయమూర్తి పలు ప్రశ్నలు వేశారు. దీనికి ఈడీ న్యాయవాదులు బదులిస్తూ.. బుచ్చిబాబును శుక్రవారం విచారించనున్నామని తెలిపారు.

సౌత్‌ గ్రూపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరులతో కలిపి పిళ్‌లైను విచారించాల్సి ఉందని చెప్పారు. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అనుమానితురాలేనని, పిళ్‌లైతో కలిపి ఆమెను విచారించాల్సి ఉందని వివరించారు. తాను మహిళను కాబట్టి ఇంటి వద్దే విచారించేలా ఆదేశించాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన అంశాన్ని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికి తెలిపారు.

ఆమెను ఈ నెల 11న విచారించామని.. మళ్లీ ఈ నెల 20న విచారణకు రావాలని తాజాగా సమన్లు జారీ చేశామని చెప్పారు. పలు అంశాలపై పిళ్‌లైతో కలిపి కవితను విచారించాల్సి ఉందన్నారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. పిళ్‌లైకు ఈ నెల 20 వరకు ఈడీ కస్టడీ పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. 

ఏపీ ఎంపీ మాగుంటకు ఈడీ సమన్లు 
ఇక ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఈ నెల 18న విచారణకు రావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికి ఈడీ అధికారులు వివరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement