కేఏ పాల్‌ హౌజ్‌ అరెస్ట్‌.. ‘కేసీఆర్, కేటీఆర్‌లకు భయపడేది లేదు’

KA Paul Comments After House Arrest At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. అమీర్‌పేట్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్ధిపేటలో సోమవారం తనపై జరిగిన దాడి గురించి డీజీపీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. సిరిసిల్ల ఎస్పీ, డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌లను సస్పెండ్‌ చేయాలని కోరుతూ కేఏ పాల్‌ డీజీపీని కలవాలని అనుకున్నారు. కేఏ పాల్‌ వస్తుండటంతో డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మరికాసేపట్లో డీజీపీ కార్యాలయానికి బయలుదేరుతారనే క్రమంలో పోలీసులు ఆయన్ను హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. 

ఈ సందర్భంగా కేఏ పాల్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిన్న(సోమవారం) బ్లాక్ డే అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ తనపై దాడి చేయించారని ఆరోపించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గుండాగిరి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ చేస్తున్నారని విమర్శించారు. సిద్ధిపేటలో జరిగిన సంఘటన కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని అన్నారు. కేటీఆర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇచ్చిన వ్యక్తే తనపై దాడి చేశారని తెలిపారు. 150 దేశాలను వణికించి వచ్చానని చెప్పిన కేఏ పాల్‌.. కేసీఆర్, కేటీఆర్‌లకు నేను బయపడేది లేదని స్పష్టం చేశారు.

‘రైతులు పిలిస్తే నేను వెళ్ళాను. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 150 ఎకరాలు పంట నష్టం వాటిల్లిందని నేను వెళ్ళాను. సిరిసిల్ల వెళ్తుండగా మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత టిఆర్ఎస్ నేతలు రావడం జరిగింది. రైతులను నేను దూషించాను అని అంటున్నారు. అది అవాస్తవం. నేను ఎవ్వరిని దూషించలేదు. నాపై జరిగిన దాడి ని ప్రతి ఒక్క కుల సంఘాలు, వివిధ పార్టీలు ఖండించారు. ప్రత్యేక రాష్టం కావాలని నేను కోరుకున్నా. నేను ఆంధ్ర వాడిని అని అంటున్నారు. మరి కేసీఆర్ ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకోవాలి. నా పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు, అన్ని చారిటీల మీద ఉన్నాయి.

డీజీపీ మహేందర్ రెడ్డికి నిన్నటి నుండి కాల్ చేస్తుంటే ఇప్పటి వరకు కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదు. డీజీపీ దగ్గరకు వెళ్లకుండా నన్ను ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేశారు. నన్ను ఎంతకాలం నిర్భంధిస్తారు. నాపై తెలంగాణ వ్యతిరేకి ముద్ర వేస్తున్నారు. రైతులను కలవడం తప్పా. సిరిసిల్ల రైతులకు అండగా నిలవడం నేను చేసిన తప్పా. నాపై జరిగిన దాడి తెలంగాణ ప్రజల మీద జరిగిన దాడి. పీకేతో నేను టచ్‌లో ఉన్నాను. అన్ని పార్టీలను కలపాలని ముఖ్యమంత్రి చెప్పారని పీకే నాతో చెప్పాడు. అన్ని పార్టీలకు సభలకు అనుమతులు ఇస్తున్నారు నాకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఆరు నెలల్లో నేను లక్ష ఉద్యోగాలు ఇస్తాను. అలా ఇవ్వకపోతే నా పాస్ పోర్టును  సీజ్ చేసుకోండి. మళ్లీ సిరిసిల్ల వస్తున్నా దమ్ముంటే ఆపు.. నా ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడే ఉంటా’ అని సవాల్‌ విసిరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top