
జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ చిల్లకూర్ సుమలతలను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ ముగ్గురు న్యాయమూర్తులు (Judges) ప్రొఫైల్స్ ఇక్కడ ఇస్తున్నాం.
జస్టిస్ అభిషేక్‌రెడ్డి
రంగారెడ్డి జిల్లా మంచాల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన వారు. శశిరేఖరెడ్డి, పుల్లారెడ్డి దంపతులకు 1967, నవంబర్ 7న జన్మించారు. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1990 జూలైలో ఏపీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా చేరారు. సీనియర్ న్యాయవాదైన ఆయన తండ్రి వద్దే ప్రాక్టీస్ ప్రారంభించారు. వివిధ ట్రిబ్యునళ్లు, ఫోరమ్‌లతోపాటు జిల్లా కోర్టులు, హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రధానంగా రాజ్యాంగం, మధ్యవర్తిత్వం, పరిపాలన, సివిల్, కుటుంబం, రెవెన్యూ, భూసేకరణ, వివిధ శాఖలకు సంబంధించిన కేసుల్లో ప్రాక్టీస్ చేశారు.
1993లో వాషింగ్టన్ డీసీలోని అమెరికన్ విశ్వవిద్యాలయంలోని వాషింగ్టన్ కాలేజ్ ఆఫ్ లా నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 2004లో ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ (నిషేధం) చట్టం కింద ప్రత్యేక కోర్టులో ప్రభుత్వ ప్లీడర్–కమ్–పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో వివిధ ప్రభుత్వ విభాగాల తరఫున వాదనలు వినిపించారు. 2019, ఆగస్టు 26న తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2023, మే 15న పట్నా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.
జస్టిస్ కన్నెగంటి లలిత...
గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెంకు చెందిన వారు. అమరేశ్వరి, అంకమ్మ చౌదరి తల్లిదండ్రులు. హైదరాబాద్‌లోని పడాల రామిరెడ్డి కళాశాల నుంచి లా డిగ్రీని పొందారు. 1994, డిసెంబర్ 28న ఏపీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్ చేసుకున్నారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, పన్నుల, సర్వీస్, నాన్–సర్వీస్, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్‌లు, మ్యాట్రిమోనియల్ కేసులతో సహా అన్ని రంగాల్లో ప్రాక్టీస్ చేశారు.
పలు ప్రభుత్వ విభాగాలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా విధులు నిర్వహించారు. కె.విజయ్ ప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు గౌతమ్, కుమార్తె మానస ఉన్నారు. 2020, మే 2న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తర్వాత తెలంగాణకు బదిలీ అయ్యారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2021, నవంబర్ 15న బాధ్యతలు స్వీకరించారు. 2023, జూలై 28న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు.
జస్టిస్ చిల్లకూర్ సుమలత
నెల్లూరుకు చెందిన లక్ష్మీప్రసన్న, వెంకట సుబ్బయ్య దంపతులకు పెద్ద కుమార్తె. ఎల్‌ఎల్‌బీలో బంగారు పతకం సాధించారు. పదేళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జ్యుడీషియల్ ఆఫీసర్‌గా పనిచేయాలనే లక్ష్యంతో 2007లో జిల్లా న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. కర్నూలు, గుంటూరులో ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తిగా, హైదరాబాద్‌లో జ్యుడీషి యల్ అకాడమీ డైరెక్టర్‌గా, హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో చీఫ్ జడ్జిగా పనిచేశారు. రాజ్యాంగ చట్టంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.
‘భారత్‌లో వేగవంతమైన న్యాయం హక్కు’ అనే అంశంపై పరిశోధన చేసి.. న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పొందారు. తెలంగాణ హైకోర్టు (Telangana High Court) న్యాయమూర్తిగా 2021, అక్టోబర్ 15న బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2023, నవంబర్ 23న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.
చదవండి: సకల హంగులతో సరికొత్త హైకోర్టు