
కాంట్రాక్టు దక్కించుకున్న డీఈసీ ఇన్‌ఫ్రా
రూ.2,583 కోట్ల అంచనా వ్యయం
ఆరు అంతస్తుల్లో ఇండో–పర్షియన్ శైలిలో ప్రధాన భవన నిర్మాణం
60 మంది జడ్జీలకు సరిపడా కోర్టు హాళ్లు, నివాసాలు
4 వేల ద్విచక్ర వాహనాలు, 2 వేల కార్లకు పార్కింగ్ సదుపాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి కీలక అడుగు ముందుకు పడింది. సకల హంగులతో సరికొత్తగా భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని వసతులతో ఇండో–పర్షియన్ శైలిలో నిర్మించనున్నారు. దాదాపు రూ.2,583 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టు కాంట్రాక్టును డీఈసీ ఇన్‌ఫ్రా తాజాగా దక్కించుకుంది. గత డిసెంబర్‌లో ఆర్‌అండ్‌బీ అధికారులు టెండర్లు పిలవగా, రెండు సంస్థలు మాత్రమే బిడ్ దాఖలు చేశాయి.

రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీలో నూతన హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించగా, గతేడాది మార్చిలో భూమి పూజ చేసిన విషయం విదితమే. పాత హైకోర్టు మాదిరిగానే ఎత్తైన ప్రధాన ద్వారం ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన భవనం ఉస్మానియా ఆర్ట్స్’ కాలేజీ నమూనాను తలపించేలా ఉండటం విశేషం. ఆరు అంతస్తుల్లో ప్రధాన భవనంతోపాటు 60 మంది జడ్జీలకు సరిపడా కోర్టు హాళ్లు, నివాసాలు, పార్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు.

ప్రధాన కోర్టు భవనం ఆరు అంతస్తుల్లో 8.4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ప్రధాన న్యాయమూర్తితోపాటు జడ్జీల క్వార్టర్లు, సిబ్బంది నివాసాలు, బార్ కౌన్సిల్ భవనం, న్యాయవాదుల గ్రంథాలయం, బార్ అసోసియేషన్ బిల్డింగ్, అడ్వొకేట్ జనరల్ ఆఫీస్‌తో కలిపి 40 భవనాలతోపాటు 42,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆడిటోరియం నిర్మించనున్నారు. పాత కోర్టులో వచ్చిన పార్కింగ్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 4 వేల ద్విచక్ర వాహనాలు, 2 వేల కార్లు వచ్చినా ఎలాంటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు వెల్లడించారు.
కోర్టు చుట్టూ ‘పచ్చ’లహారం
హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా ప్రస్తుతం 29 మంది ఉన్నారు. భవిష్యత్‌లో మొత్తం నియామకాలు జరిగినా.. అంతకుమించి పోస్టులు మంజూరైనా ఎలాంటి ఆటంకం రాకుండా 60 మంది కోసం కోర్టు హాళ్లను సిద్ధంగా ఉంచనున్నారు. కోర్టుకు వచ్చే ప్రజలకు కూడా ఇబ్బందులు రాకుండా క్యాంటీన్, టాయిలెట్లు నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మరో రెండు అంతస్తుల్లో 1.63 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం మేరకు ప్రజలకు కేటాయించనున్నారు.
భవనాల చుట్టూ హరితం పరుచుకున్నట్లు ఆకట్టుకునేలా పచ్చికను ఏర్పాటు చేయనున్నారు. పూలమొక్కలు, చెట్లను కూడా నాటనున్నారు. సివిల్ పనుల కోసం రూ.1,980 కోట్లు, ఫర్నిచర్‌తోపాటు ఇతర ఖర్చుల కోసం రూ.603 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఖరారు బాధ్యతను వన్ ఇండియా లిమిటెడ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.
ఆ సంస్థ పలు డిజైన్లను సిద్ధం చేయగా.. జడ్జీల కమిటీ అందులో ఒకదాన్ని ఖరారు చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాంగణాన్ని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సకల వసతులతో నిర్మిస్తోంది.