
ఇప్పటివరకు సొంత కాలేజీల్లోనే పరీక్షలు
దీనివల్ల అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు
వచ్చే ఏడాది నుంచి జంబ్లింగ్ అమలుకు నిర్ణయం!
కాళోజీ వర్సిటీ వినతికి ప్రభుత్వం కూడా సమ్మతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విద్యపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో కనీస మౌలిక వసతులు లేవని ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం.. ఎంబీబీఎస్, మెడికల్ పీజీ పరీక్షలు, ప్రాక్టికల్స్ అన్నీ సొంత కళాశాలలనే పరీక్ష కేంద్రాలుగా మార్చి నిర్వహిస్తున్న విధానాన్ని మార్చాలని భావిస్తోంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు జరుగుతున్న పరీక్షల తరహాలో జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలను ఇతర మెడికల్ కళాశాలల్లోకి మార్చాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కూడా ప్రభుత్వానికి ఈ మేరకు నివేదిక పంపినట్లు తెలిసింది.
వచ్చే ఏడాది ఎంబీబీఎస్, పీజీ పరీక్షల నుంచే ఈ జంబ్లింగ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 34 ప్రభుత్వ, 26 ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీ పరిధిలో రెండు మెడికల్ కళాశాలలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మరో రెండు ఉన్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు పీజీ మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు పరీక్షలన్నీ ఆయా సొంత కళాశాలల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో పరీక్షల్లో అవకతవకలు సర్వసాధారణంగా మారాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి.
మాస్ కాపీయింగ్‌తోపాటు ప్రాక్టికల్స్ ఫాల్స్‌గా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జంబ్లింగ్ విధానంలో పక్క జిల్లాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పరీక్ష కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. చిన్న జిల్లాల్లో కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండడం, అన్ని చోట్ల ప్రాక్టికల్స్ కోసం ప్రభుత్వ ఆస్పత్రులు అందుబాటులో ఉండడంతో జంబ్లింగ్ విధానం కష్టం కాదని విశ్వవిద్యాలయం నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం.
ప్రైవేటు కాలేజీల నుంచి వ్యతిరేకత!
జంబ్లింగ్ విధానంలో వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ కళాశాలల నుంచి పెద్దగా అభ్యంతరాలు వచ్చే అవకాశం లేదు. కానీ ప్రైవేటు కళాశాలల నుంచే వ్యతిరేకత వస్తుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం, ప్రభుత్వం భావిస్తున్నాయి. ఇటీవల ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు మౌలిక వసతులు, మెడికల్ ప్రాక్టీస్ సదుపాయాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు యూనివర్సిటీ వీసీ, ఇతర వైద్యాధికారులు ఆకస్మిక తనిఖీలు చేయడాన్నే జీర్ణించుకోక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు.
అయినా ఇప్పటివరకు 12 మెడికల్ కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇదే పద్ధతిలో ప్రైవేటు కళాశాలలు వ్యతిరేకించినా, జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని, వచ్చే సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారని సమాచారం. అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కాళోజీ నారాయణరావు విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి ధ్రువీకరించారు.