గోపీనాథ్ జూన్ 6న చనిపోయారా...8న చనిపోయారా ?
మాగంటి తల్లి మహానందకుమారి
పంజగుట్ట(హైదరాబాద్): జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి ఒక మిస్టరీగా అనిపిస్తోందని.. కన్నతల్లినైన తనను, తోడబుట్టిన సోదరుడు వజ్రనాథ్‌ను ఆస్పత్రిలోనికి రానివ్వరాదని సునీత ఆర్డర్ పాస్ చేసిందని గోపీనాథ్ తల్లి మహానందకుమారి ఆరోపించారు. అసలు గోపీనా«థ్ జూన్ 6వ తేదీన చనిపోయారా...జూన్ 8న చనిపోయారా అన్నదీ సందేహంగానే ఉందన్నారు. కేటీఆర్ వస్తున్నారు అని ఎవ్వరినీ చూడకుండా ఆపేసి, కేటీఆర్ వచ్చాక మరణవార్తను చెప్పారని ఆమె పేర్కొన్నారు.
ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలిని, ఆమె కుమారుడు తారక్ ప్రద్యుమ్నతో కలిసి మహానందకుమారి విలేకరులతో మాట్లాడారు. మొదటి భార్య మాలినికి విడాకులు ఇవ్వకుండా, రెండో భార్యగా సునీత లీగలైజ్ సర్టిఫికెట్ ఎలా తీసుకుంటుందని, తాను గోపీనా«థ్‌కు సునీతకు పెళ్లి చేయలేదని చెప్పారు. ఆ సర్టిఫికెట్‌లో తల్లిగా తన పేరును, మొదటి భార్య మాలిని, ఆమె కుమారుడు తారక్ పేరు లేకపోవడంతోనే తాము అభ్యంతరాలు చెప్పామన్నారు.
తమకు రాజకీయాలు, ఎమ్మెల్యే టికెట్‌తో ఎలాంటి సంబంధం లేదని, భార్యగా మాలిని, కొడుకుగా తారక్‌కు గుర్తింపు ఉండాలి కదా... కేవలం ఐడెంటీ కోసమే తమ పోరాటమని స్పష్టం చేశారు. లీగలైజ్ సర్టి ఫికెట్‌పై తాము తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని, ఆయన అన్ని చూసిన తర్వాత ఆర్డీఓకు లేఖ రాశారని అప్పటి నుంచే ఈ వివాదం అని చెప్పారు. గోపీనా«థ్ డయాలసిస్‌తో బాధపడుతుంటే కనీసం ఒక సహాయకుడిని కూడా పెట్టకపోవడంపై కూడా అనుమానం కలుగుతుందని తెలిపారు.
ఇంట్లో జరిగే వివాదాలపై కేటీఆర్‌కు చెప్పేందుకు కారు వెనుక పరుగెత్తానని, అయినా ఒక్కసారి కూడా కేటీఆర్ తనను కలవలేదన్నారు. నిజంగా గోపీనాథ్‌కు మొదటి భార్య వద్దు అనుకుంటే అప్పుడే ఆమెతో విడాకులు తీసుకునేవారు కదా అని చెప్పారు. 2002లో గోపీనాథ్‌నే విడాకులకు దరఖాస్తు చేసి తిరిగి ఆయనే విత్‌డ్రా చేసుకున్నాడని గుర్తు చేశారు.
తన డేటాఫ్ బర్త్, ఆధార్, పాస్‌పోర్టు అన్నింటిలో సన్నాఫ్ ఎం.గోపీనాథ్ అనే ఉంటుందని తారక్ ప్రద్యుమ్న తెలిపారు. అన్నీ చట్టప్రకారం ఉన్నాయని, తహసీల్దార్ కార్యాలయంలో కూడా చూపించానని తెలిపారు. తారక్ ఎవరో తెలియదు అని అంటున్న సునీత జూన్ 6వ తేదీ నుంచి తనకు తరచూ ఫోన్ చేసిందని, అప్పుడు తాను అమెరికాలో ఉండేవాడినని తెలిపారు. సెప్టెంబర్ వరకు తనతో ఫోన్‌లో మాట్లాడిందని, సునీత పెద్ద కూతురు కూడా తనకు ఫోన్ చేసి మాట్లాడిందని ఆధారాలతో చూపించారు.
సునీత ఫోన్‌లో నువ్వు అమెరికాలోనే ఉండిపో అని కేటీఆర్ అంకుల్ ఉన్నారు.. నీ రెజ్యూమ్ పంపించు అక్కడే ఏదో ఒక ఉద్యోగం చూస్తాడు.. అంకుల్‌వి కంపెనీలు ఉన్నాయి అని చెప్పేదన్నారు. తన తండ్రి మాగంటి గోపీనాథ్ కూడా తనతో తరచూ ఫోన్‌లో మాట్లాడేవారని చెప్పారు.


