ఆన్‌లైన్‌ స్కిల్‌కు అదనపు బాదుడు! | JNTUH agreement with soft skills organizatio | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ స్కిల్‌కు అదనపు బాదుడు!

Jun 24 2026 5:18 AM | Updated on Jun 24 2026 5:18 AM

JNTUH agreement with soft skills organizatio

నైపుణ్యం మెటీరియల్‌ కింద ప్రతి ఇంజనీరింగ్‌ విద్యార్థి నుంచి రూ.750 వసూలు

సాఫ్ట్‌ స్కిల్‌ సంస్థతో జేఎన్‌టీయూహెచ్‌ ఒప్పందం 

ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులందరికీ వర్తింపు 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందే విద్యార్థులకూ మినహాయింపు లేదంటున్న అధికారులు 

రూ.3 వేలు వసూలుకు సిద్ధమవుతున్న ప్రైవేటు కాలేజీలు!

సాక్షి, హైదరాబాద్‌:     ఇంజనీరింగ్‌ విద్యార్థులకు నైపుణ్యం పేరుతో ఈ ఏడాది నుంచి అదనపు బాదుడు వేసేందుకు రంగం సిద్ధమైంది. జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్‌) ఈ దిశగా ఓ ప్రైవేటు సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఎంవోయూ ప్రకారం దక్షిణాదికి చెందిన సాఫ్ట్‌ స్కిల్‌ అనే సంస్థ ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే మెటీరియల్‌ను సరఫరా చేస్తుంది.

ఇది అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సంస్థ అని జేఎన్‌టీయూహెచ్‌ చెబుతోంది. అయితే ఎలాంటి క్లాసులు నిర్వహించకుండా కేవలం పీడీఎఫ్‌ రూపంలోనే ఇది స్టడీ మెటీరియల్‌ను అందిస్తుంది. ఈ మెటీరియల్‌ చదవడం వల్ల అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. అయితే ఎంవోయూ కుదుర్చుకున్న సంస్థ మాత్రం ఇలాంటి భరోసా ఏదీ ఇవ్వలేదు.  

ప్రైవేటు కాలేజీలకు వరం! 
    స్టడీ మెటీరియల్‌ కోసం ప్రతి విద్యార్థి నుంచి రూ.750 వసూలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ కాలేజీల్లోనే కాదు.. ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులూ ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తీసుకునే విద్యార్థులకూ ఈ మొత్తం తప్పదని అధికారులు చెబుతున్నారు. అయితే జేఎన్‌టీయూహెచ్‌ చేసుకున్న ఈ ఒప్పందం ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలకు వరంగా మారనుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టడీ మెటీరియల్‌ పేరుతో ప్రతి విద్యార్థి నుంచి రూ.3 వేలు వసూలు చేసేందుకు కాలేజీలు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

కన్వినర్‌ కోటా అడ్మిషన్లు పూర్తయి, విద్యార్థి కాలేజీలో చేరిన తొలిరోజే ఈ ఫీజును వసూలు చేస్తామని కొన్ని కాలేజీలు చెబుతున్నట్లు తెలిసింది. యాజమాన్య కోటా కింద ఇప్పటికే అనధికారికంగా ప్రవేశాలు ఖరారు చేసుకుంటున్న విద్యార్థుల నుంచి ముందే వసూలు చేస్తున్నాయి. పైగా దీనికి ఎలాంటి రసీదు ఇవ్వడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో 90 వేల మందికి పైగా చేరుతున్నారు.

జేఎన్‌టీయూహెచ్‌ నిర్దేశించిన ఫీజు రూ.750 వసూలు చేసినా, 90 వేల మంది విద్యార్థులకు దాదాపు రూ.6.75 కోట్లు ప్రతి ఏటా ఊరూపేరూ లేని సంస్థకు చెల్లించాల్సి ఉంటుందని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇక ప్రైవేటు కాలేజీలు ముక్కుపిండి వసూలు చేసే ఫీజు రూ.3 వేలు పరిగణనలోకి తీసుకుంటే విద్యార్థులపై భారం మరింత అధికంగా ఉంటుందని అంటున్నారు. వర్సిటీ పాలకమండలిలో చర్చించకుండానే ఆదరాబాదరాగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు ఉన్నతాధికారులూ తప్పుబడుతుండటం గమనార్హం. 

ముడుపుల ఆరోపణలు 
    వాస్తవానికి సాఫ్ట్‌ స్కిల్‌ సంస్థతో ఒప్పందాన్ని జేఎన్‌టీయూ బాధ్యులు కొందరు వ్యతిరేకించారు. ఈ సంస్థ ఎక్కడా ఎలాంటి ఉద్యోగాలు ఇప్పించలేదని తెలిపారు. అది అందించే మెటీరియల్‌లో కూడా ఏమాత్రం నాణ్యత లేదని వీసీ దృష్టికి తెచి్చనట్టు తెలిసింది. ఇది పేద విద్యార్థులకు భారమని, ఇది సదరు సంస్థకు కోట్లు కట్టబెట్టడమే అవుతుందంటూ ఈ ఫైల్‌పై సంతకం పెట్టేందుకు కొంతమంది అధికారులు నిరాకరించినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలోనే వారిని ఇటీవల కీలక బాధ్యతల నుంచి తప్పించారనే చర్చ జరుగుతోంది. ఈ సంస్థ యూనివర్సిటీలోని ఓ ప్రొఫెసర్‌తో ఏడాదిగా రాయబేరాలు నడిపినట్టు జేఎన్‌టీయూ వర్గాలు చెబుతున్నాయి. చివరకు ఒప్పందం ఖరారు కావడం వెనుక ముడుపుల బాగోతం ఉందని కూడా ఆ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారని, పాలకమండలి కూడా సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం.  
 
స్కిల్‌తో ఉద్యోగాలు వస్తాయి 
సాఫ్ట్‌స్కిల్‌ సంస్థ అంతర్జాతీయంగా పేరున్న కంపెనీ. ఇది విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు తీసుకున్న నిర్ణయం. స్కిల్‌ ఇవ్వడం వల్ల ఉద్యోగాలు వస్తాయి. విద్యార్థి నుంచి రూ.750 మాత్రమే వసూలు చేస్తారు. ప్రైవేటు కాలేజీ విద్యార్థులూ చెల్లించాల్సి ఉంటుంది.  – ప్రొఫెసర్‌ టీకేకే రెడ్డి, వీసీ, జేఎన్‌టీయూహెచ్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement