
క్రైమ్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో పట్టపగలు యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ హత్య జరిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మండలంలోని కిషన్‌రావుపేట గ్రామానికి చెందిన చల్లూరి మల్లేశ్ (30) కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఒక యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఈ విషయంలో యువతి బంధువులు అనేకసార్లు మల్లేశ్‌కు నచ్చజెప్పారు. రెండు కుటుంబాల మధ్య గొడవలు, కొట్లాటలు జరిగాయి. ఈ క్రమంలో మల్లేశ్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అతనిపై రౌడీషీట్ కూడా నమోదైంది. అయినప్పటికీ మల్లేశ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మల్లేశ్ గతంలో హార్వెస్టర్ నడిపించగా.. ఈ గొడవల నేపథ్యంలో హార్వెస్టర్ అమ్మేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు.
గురువారం ఉదయం కూడా మల్లేశ్ సదరు యువతి ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు సమాచారం. యువతి తండ్రికి ఫోన్ చేసి దుర్భాషలాడినట్లు తెలిసింది. ఈ క్రమంలో యువతి బంధువులు విసిగిపోయారు. ఇంటి నుంచి ద్విచక్రవానంపై బయలుదేరిన యువకుడిని వెంబడించి వెల్గటూర్ మండల కేంద్రంలోని పెద్దవాగుపై విచక్షణారహితంగా కొట్టి ఆటోలో తీసుకెళ్లి కోటిలింగాల రోడ్డులోని పాత వైన్స్ వెనకాల కత్తులతో పొడిచి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడి తల్లిదండ్రులకు నలుగురు కూతుళ్లుకాగా మల్లేశ్ ఒక్కడే కుమారుడు.