నాటి సీఎం స్థాయిలోనే నిర్ణయాలు! | Sakshi
Sakshi News home page

నాటి సీఎం స్థాయిలోనే నిర్ణయాలు!

Published Thu, Mar 21 2024 5:44 AM

Irrigation department report to Chandrasekhar Iyer Committee on Kaleshwaram - Sakshi

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై చంద్రశేఖర్‌ అయ్యర్‌ కమిటీకి నీటి పారుదల శాఖ నివేదన 

2016లో నాటి సీఎం కేసీఆర్‌ స్థాయిలో నిర్ణయాలు జరిగాయి 

ఆ తర్వాతే డీపీఆర్‌లను రూపొందించాం 

ఆమోదం రాకముందే పనులు ప్రారంభించినట్టు వెల్లడి 

తొందరపాటుతో రెండేళ్లలోనే బ్యారేజీలు ఎందుకు నిర్మించారన్న కమిటీ 

అంత వేగంతో చేసిన పనుల్లో నాణ్యతను ఎలా పర్యవేక్షించారు? 

షీట్‌పైల్స్‌ స్థానంలో సెకెంట్‌ పైల్స్‌ను ఎందుకు మార్చారు.. అనుమతి ఉందా? 

ఇంజనీర్లకు ప్రశ్నల వర్షం 

సమావేశానికి హాజరైన మాజీ ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్లు 

సాక్షి, హైదరాబాద్‌:  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై 2016లో నిర్వహించిన సమావేశాల్లో నాటి ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేత్వంలోని నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ నివేదించింది. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లను రూపొందించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం కోసం పంపించామని తెలిపింది. అయితే ఆమోదం లభించకముందే నిర్మాణ పనులు ప్రారంభించామని వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల డిజైన్, నిర్మాణాలపై అధ్యయనం కోసం నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఇటీవల చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

రెండో విడత రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆ కమిటీ.. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, మాజీ అధికారులతో సుదీర్ఘంగా సమావేశమైంది. నీటి పారుదల శాఖ ఈఎన్సీ(జనరల్‌) అనిల్‌కుమార్, ఈఎన్సీ (ఓ అండ్‌ ఎం) బి.నాగేందర్‌రావు, మాజీ ఈఎన్సీలు సి.మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొని వివరాలు అందించారు. ‘నీటిపారుదల శాఖలో జనరల్, సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ ఇంజనీర్, హైడ్రాలజీ విభాగాల పనితీరు, బాధ్యతలు ఏమిటి? ప్రభుత్వం–నీటిపారుదలశాఖకు మధ్య ఫైళ్ల రాకపోకలు ఎలా సాగుతాయి?’వంటి అంశాలను నిపుణుల కమిటీ అడిగి తెలుసుకుంది. 
 
నాణ్యత పర్యవేక్షణ ఎలా? 
‘కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మూడేళ్ల గడువు ఉండగా.. రెండేళ్లలో ఎందుకు పూర్తి చేశారు? అంత వేగంతో పనులు చేస్తే నాణ్యతను ఎలా పర్యవేక్షించారు? బ్యారేజీల పునాదులు (ర్యాఫ్ట్‌)కు రక్షణగా తొలుత షీట్‌ పైల్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. తర్వాత సెకెంట్‌ పైల్స్‌కు ఎందుకు మారారు? ఈ డిజైన్‌ మార్పులకు అప్రూవల్స్‌ తీసుకున్నారా?’అని బ్యారేజీ నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లను అయ్యర్‌ కమిటీ ప్రశ్నించింది. 
  
ఎక్కడో తప్పిదం జరిగింది: మాజీ ఈఎన్సీ మురళీధర్‌ 
మేడిగడ్డ బ్యారేజీ పునాదుల(ర్యాఫ్ట్‌)కు దిగువన ఏర్పాటు చేసిన సెకెంట్‌ పైల్స్‌ (నిలువు స్తంభాలు) దిగువ నుంచి, లేదా వాటి మధ్య నుంచి ఇసుక కొట్టుకుపోవడంతోనే బ్యారేజీ కుంగిందని భావిస్తున్నానని అయ్యర్‌ కమిటీకి మాజీ ఈఎన్సీ (జనరల్‌) సి.మురళీధర్‌ వివరించారు. కావాలని ఎవరూ అలా చేయలేదని, అనుకోని రీతిలో ఎక్కడో తప్పిదం జరిగి ఉండవచ్చని కూడా ఆయన పేర్కొన్నట్టు సమాచారం. రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతో నిపుణుల కమిటీ విడిగా సమావేశమై బ్యారేజీల నిర్మాణంలో ఆయన అనుసరించిన విధానాన్ని అడిగి తెలుసుకుంది. 
 
తప్పులు ఎక్కడ జరిగి ఉంటాయి.. చెప్పండి! 
‘బ్యారేజీల నిర్మాణంలో ఎక్కడ తప్పులు జరిగి ఉంటాయి? మీ అభిప్రాయం ఏమిటి?’అని నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల ఇంజనీర్లను అయ్యర్‌ కమిటీ ప్రశ్నించింది. ‘బ్యారేజీల గేట్లను ఎవరు ఆపరేట్‌ చేశారు? ఈఎన్సీల నుంచి ఏఈ వరకు వివిధ స్థాయిల్లోని ఇంజనీర్ల జాబ్‌ చార్ట్‌ ఏమిటి? నీటిపారుదల శాఖ హైపవర్‌ కమిటీ నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది? డిజైన్లను ఎవరు సిఫారసు చేస్తారు? ఎవరు ఆమోదిస్తారు? బ్యారేజీల నిర్మాణానికి ముందు ఇన్వెస్టిగేషన్‌ జరిపిన వ్యాప్కోస్‌ వద్ద ఉన్న సాంకేతికత ఏమిటి? మోడల్‌ స్టడీస్‌ చేశారా? క్వాలిటీ కంట్రోల్‌ ఈఎన్సీ(ఓఅండ్‌ ఎం) పరిధిలోకి వస్తుందా? లేక ఈఎన్సీ (జనరల్‌) పరిధిలోకి వస్తుందా?’వంటి అంశాలనూ ఆరా తీసింది. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ప్రతి అంశంపై ప్రశ్నలు సంధించి ఎక్కడ లోపాలు జరిగి ఉంటాయనేది గుర్తించేందుకు ప్రయత్నించింది. ఈ పర్యటనలో భాగంగా గురు, శుక్రవారాల్లో సైతం నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం కానుంది.  
 
అత్యవసర మరమ్మతులపై ఇప్పుడే చెప్పలేం.. 
బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులను సూచించాలని ఈఎన్సీ(జనరల్‌) అనిల్‌కుమార్‌ విజ్ఞప్తి చేయగా.. ఈ అంశంపై సిఫారసులతో మధ్యంతర నివేదిక ఇవ్వడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని చంద్రశేఖర్‌ అయ్యర్‌ స్పష్టం చేశారు. బ్యారేజీలపై అధ్యయనం జరిపి, లోపాలను తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు.  

Advertisement
 
Advertisement