బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు నడపలేం! | Innovative protest to demand that schools pay rent | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు నడపలేం!

Apr 9 2025 4:13 AM | Updated on Apr 9 2025 4:13 AM

Innovative protest to demand that schools pay rent

రెండేళ్లుగా నిధుల విడుదలలో జాప్యం .. రూ.130 కోట్లు పెండింగ్‌ 

అప్పులు చేసి.. నగలు తాకట్టు పెట్టి మరీ నిర్వహిస్తున్న యాజమాన్యాలు

నిధులివ్వండి లేదా మీరే నిర్వహించండి అంటూ ప్రభుత్వానికి వినతి

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్య మైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌’లక్ష్యం నిధుల లేమితో నీరుగారుతోంది. రెండేళ్లుగా ప్రభుత్వం సరిగ్గా నిధులు విడుదల చేయకపోవడంతో వీటి యజమానులు వడ్డీలకు అప్పులు తెచ్చి, నగలు తాకట్టు పెట్టి నడుపుతున్నారు. అయినా ప్రభు త్వంలో చలనం లేకపోవడంతో నిరసనలకు దిగుతున్నారు. ఇక స్కూళ్లు తాము నడపలేమని, ప్రభుత్వమే వీటి నిర్వహణ చేపట్టి తమ స్కూళ్లకు అద్దె చెల్లిస్తే చాలంటూ వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. 

అసలేం జరిగింది?
బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం1990లో ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 150 స్కూళ్లు ఉన్నాయి. వీటిని ప్రైవేట్‌ యాజమాన్యాలే నడుపుతాయి. ప్రతీ స్కూళ్లో 80 నుంచి 86 వరకు సీట్లు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేటాయిస్తారు. మొత్తం 25,000 మందికి ఈ స్కూళ్లలో విద్య అందుతోంది. ఇందులో 12,000 మంది ఎస్సీ విద్యార్థులు, 7,000 మంది ఎస్టీ విద్యార్థులు ఉన్నారు.

 వీరిలో ఎస్సీ విద్యార్థులకు రెసిడెన్షియల్‌తోపాటు, డే స్కాలర్స్‌గానూ అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం నుంచి ఒక్కో విద్యార్థికి రూ.42వేలు స్కూలు యాజమాన్యా లకు అందుతోంది. అదే డే స్కాలర్‌ విద్యార్థి కోసం రూ.28 వేలు చెల్లిస్తోంది. ఈ స్కూళ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా రూ.100 కోట్ల చొప్పున విడుదల చేస్తోంది. కానీ, రెండేళ్లుగా ఈ నిధులు విడుదల కావడం లేదు.

బకాయిలు రూ.130 కోట్లు
రెండేళ్లుగా ఈ స్కూళ్లకు ఎలాంటి చెల్లింపులు లేవు. అయితే గద్వాల, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు మాత్రం ఇటీవల ప్రభుత్వం రూ.70 కోట్ల వరకు పలు దఫాలుగా విడుదల చేసింది. మిగిలిన 27 జిల్లాల్లో రూ.130 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో పడిపోయాయి. 

ఆత్మహత్యలే శరణ్యం
టీచర్లకు జీతాలివ్వలేక, బ్యాంకుల నోటీసులకు సమాధా నాలు చెప్పలేక నరకయాతన అనుభవిస్తున్నాం. కనీసం పిల్ల లకు భోజనం పెట్టేందుకు కూడా అప్పు పుట్టడం లేదు. ఈ నెలలో విడుదల చేయకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం.– యాదగిరి శేఖర్‌రావు, బెస్ట్‌అవైలబుల్‌ స్కూల్స్, రాష్ట్ర కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement