నగరం నడిబోడ్డున మానవత్వం మంటగలిసిన వేళ 

Inhumanity In Hyderabad Son Throw Away Mother Dead Body On Footpath - Sakshi

తల్లి మృతదేహాన్ని మూటగట్టి ఫుట్‌పాత్‌ మీద వేసిన వైనం  

వారం క్రితం కుమారుడి వద్దకు.. జ్వరంతో బాధపడుతూ మృతి 

కరోనా భయం.. అంత్యక్రియలకు డబ్బుల్లేక వదిలేసిన కుమారుడు

సాక్షి, హైదరాబాద్‌: చేతిలో చిల్లి గవ్వలేదు.. చుట్టాలకు చెప్పినా స్పందిస్తారనే ఆశ లేదు.. ఒకవైపు ఇంటి ఓనర్, చుట్టుపక్కలవారి వేధింపులు.. మరోవైపు ఏం చేయాలో పాలుపోని స్థితి.. దీం తో ఓ వ్యక్తి తన తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేక పుట్‌పాత్‌ మీద మృతదేహాన్ని వదిలేసిన హృదయవిదారక ఘటన హైదరాబాద్‌ బంజా రాహిల్స్‌లో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి గోనె సంచిని విప్పి చూడగా అందులో ఒక వృద్ధురాలి మృతదేహం కనిపించింది. ఆ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.  

విచారణలో పలు ఆసక్తికర విషయాలు 
నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలానికి చెందిన భగీరథి (75)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. నిజామాబాద్‌లో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న పెద్ద కుమారుడు దత్తు వద్ద ఆమె ఉండేది. అతడి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో తన చిన్న కొడుకు రమేశ్‌ వద్దకు వారం క్రితం వచ్చింది. కుటుంబ కలహాల వల్ల రమేశ్‌ భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఆరు నెలల క్రితమే వెళ్లిపోయింది. రమేశ్‌ బంజారాహిల్స్‌లోని షాంగ్రిల్లా ప్లాజాలో వాచ్‌ మన్‌. నెల క్రితం బంజారాహిల్స్‌లోని షౌకత్‌నగర్‌లో గదిని అద్దెకు తీసుకున్నాడు. వారం క్రితం తన తల్లిని గదికి తీసుకొచ్చాడు. కానీ, ఆమె అప్పటికే జ్వరంతో బాధపడుతోంది.

ఐదురోజులుగా పలు రకాల మాత్రలు ఇస్తున్నప్పటికీ జ్వరం తగ్గకపోగా మరింత తీవ్రమైంది. దీంతో ఓనర్‌తోపాటు చుట్టుపక్కల వారు ఆమెకు కరోనా వచ్చి ఉంటుందేమో అంటూ పలు రకాలుగా ప్రశ్నలతో వేధించేవారు. ఇంతలోనే శనివారం అర్ధరాత్రి ఆమెకు శ్వాస ఆడటం ఆగిపోయింది. దీంతో ఏం చేయాలో రమేశ్‌కు అర్థం కాలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. కరోనా అంటే ఊళ్లోకి కూడా రానివ్వరు. ఇక్కడ కూడా అంత్యక్రియలు చేసే అవకాశం లేదు. ఈ విషయాన్ని చుట్టాలకు చెప్పినా ఎవరూ సహకరించరేమోనని కలత చెంది బయట ఎక్కడైనా వదిలేస్తే ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుందనుకొని దుప్పటితో తన తల్లిని చుట్టేసి ముఖానికి గోనె సంచి తగిలించి బంజారాహి ల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లోని లుంబినీ మాల్‌ ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌ మీద వదిలేశాడు.
(చదవండి: తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు)
 
లోతుగా దర్యాప్తు... 
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ముందుగా ఈమె యాచకురాలని భావించారు. ఆ తర్వాత విచారణ చేయగా ఆమె కొడుకు షౌకత్‌నగర్‌లో ఉంటున్నట్లు కనుక్కొని రమేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే రమేశ్‌ చెప్తున్నది నిజమా కాదా అన్నది మరింత లోతుగా విచారణ చేస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని బంజారాహిల్స్‌ సీఐ కళింగరావు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top