
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా బతుకమ్మ కుంట(BatukammaKunta) ప్రారంభోత్సవం వాయిదా పడింది. భారీ వర్షాల నేపథ్యంలో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా వేసినట్లు హైడ్రా(HYDRA) శుక్రవారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, సీఎం రేవంత్(Revanth Reddy) చేతుల మీదుగా వచ్చే ఆదివారం ప్రారంభోత్సవానికి హైడ్రా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. అంతుకుముందు బతుకమ్మ కుంటపై హైడ్రా స్పందిస్తూ.. కబ్జాల కోరల్లో చిక్కుకున్న చెరువు నేడు జీవం పోసుకుంది. ముళ్ల పొదలు.. పిచ్చి మొక్కలతో అటువైపు చూడాలంటేనే భయపడే విధంగా ఉన్న బతుకమ్మ కుంట.. నేడు జలకళతో చూడముచ్చటగా తయారయ్యింది. కబ్జాల చెరను విడిపించుకుని కనువిందు చేస్తోంది. నగర భవిష్యత్తుకు బాటలు వేస్తున్న హైడ్రాకు బతుకమ్మ కుంట ప్రేరణగా నిలిచింది. వరద నివారణకు బతుకమ్మకుంట బాటలు వేసింది. నగరవ్యాప్తంగా చెరువులు అభివృద్ధి చెందితే వరదలు చాలావరకు నివారించవచ్చునని బతుకమ్మకుంట నిరూపించిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
-చెర వీడి చెరువైన బతుకమ్మ కుంట
జాతీయ స్థాయిలో `బతుకమ్మకుంట` వైభవం
-ఈ నెల 26న సీఎం చేతులమీదుగా ప్రారంభం
-బతుకమ్మ ఉత్సవాలకు సర్వం సన్నద్ధం
-సర్వాంగ సుందరంగా మారిన బతుకమ్మ కుంట
🔸బతుకమ్మకుంట తన పేరును సార్థకం చేసుకుంది. కబ్జాల కోరల్లో చిక్కుకున్న చెరువు… pic.twitter.com/cEYRJw7sGs— HYDRAA (@Comm_HYDRAA) September 26, 2025
మండు వేసవిలో దాదాపు 7.15 కోట్లతో బతుకమ్మ కుంట పనులను హైడ్రా చేపట్టింది. జేసీబీలతో మోకాలు లోతు తవ్వగానే గంగమ్మ తల్లి ఉబికి వచ్చింది. బతుకమ్మ కుంట బతికే ఉందని రుజువు చేసింది. అక్కడి స్థానికులలో ఆనందం పెల్లుబికింది. బతుకమ్మ కుంట కాదు.. ఇది మా స్థలమంటూ ఇప్పటివరకూ నమ్మబలికిన వారిని ఇప్పుడేమంటారు అని అక్కడి స్థానికులు ప్రశ్నించారు. ఈ మేరకు అక్కడి ముళ్ల పొదలను తొలగించి తవ్వకాలు చేపట్టిన హైడ్రాకు గంగమ్మ స్వాగతం పలికింది. అంబర్‌పేట మండలం, బాగ్అంబర్‌పేట్‌లోని సర్వే నంబరు 563లో 1962-63 లెక్కల ప్రకారం మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట. బఫర్ జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాల విస్తీర్ణం అని తేల్చిన సర్వే అధికారులు. తాజా సర్వే ప్రకారం అక్కడ మిగిలిన భూమి కేవలం 5.15 ఎకరాల విస్తీర్ణం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం మిగిలి ఉన్న 5.15 ఎకరాల విస్తీర్ణంలోనే బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది.
ఇది కూడా చదవండి: వర్షాల ఎఫెక్ట్.. శంషాబాద్‌లో దిగని విమానం..