
హైదరాబాద్, సాక్షి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగల ప్రతాపం రోజురోజుకి పెరిగిపోయి ఉక్కపోతతో జనం అల్లలాడిపోతున్నారు. ఈ తరుణంలో.. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Center) చల్లని కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో రెండురోజుల పాటు వానలు కురుస్తాయని ప్రకటించింది.
రాగల 48 గంటల్లో.. అంటే రేపు, ఎల్లుండి ఉత్తర, ఈశాన్య తెలంగాణ అంతటా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తుందని తెలిపింది. కొన్ని చోట్ల వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 22వ తేదీ తర్వాత కూడా మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఎండాకాలం మొదలైన కొద్దిరోజులకే ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ఇటు తెలంగాణ, అటు ఏపీ మండిపడుతోంది. పలు జిల్లాల్లో ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. వడగాల్పులతో జనం విలవిలలాడుతున్నారు.