‘హీటె’క్‌ సిటీ.. | Hyderabad at risk of heat related illnesses | Sakshi
Sakshi News home page

‘హీటె’క్‌ సిటీ..

Jun 12 2026 3:19 AM | Updated on Jun 12 2026 3:19 AM

Hyderabad at risk of heat related illnesses

వేడి సంబంధిత అనారోగ్యాల ప్రమాదంలో హైదరాబాద్‌

ప్రపంచ హాటెస్ట్‌ నగరాల జాబితాలో చోటు..  ఆక్స్‌ఫర్డ్‌ అధ్యయనం వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా 30 నగరాలు తీవ్ర మైన వేడి సంబంధిత అనారోగ్యాల ప్రమాదాన్ని ఎదుర్కొంటుండగా అందులో హైదరాబాద్‌ కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ‘మూవింగ్‌ బియాండ్‌ ఎక్స్‌పోజర్‌: ఎ గ్లోబల్లీ కంపేరబుల్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ హీట్‌ రిస్క్‌ అసెస్‌మెంట్‌ ఇన్‌ సిటీస్‌’ పేరిట మొత్తం 205 నగరాల్లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం  అధ్యయనం చేసింది. వేగవంతమైన పట్ట ణ విస్తరణ, తగ్గిపోతున్న పచ్చదనం, ఎయిర్‌ కండిషనర్లపై ఆధారపడటం పెరుగుతుండడం వంటివి వేడి సంబంధిత అనారోగ్య సంక్షోభానికి కీలక కారణాలని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. 

మన నగరానికీ ‘వేడి’
మన దేశంలో అహ్మదాబాద్, నాగ్‌పూర్‌ మదురై అధిక వేడి ప్రమాదాన్ని కలిగి ఉండగా, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి మహానగరాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక దాదాపు 80 లక్షల మంది నివసించే హైదరాబాద్‌ ఈ నగరాల తర్వాతే ఉండగా.. హీట్‌ వల్నరబిలిటీ ఇండెక్స్‌లో మొత్తం 0.68 వేడి ప్రమాద స్కోరును నమోదు చేసింది. ఇది కైరో, మనీలా, హో చి మిన్‌ సిటీ వంటి ప్రమాదం ఉన్న నగరాల కంటే కేవలం 0.05 నుంచి 0.10 పాయింట్లతో స్వల్పంగా మాత్రమే మెరుగ్గా ఉండగా, బ్యాంకాక్, హనోయ్‌ వంటి నగరాల కంటే అధ్వాన్నంగా ఉంది. 

ఈ ఇండెక్స్‌ అనేది ఒక నిర్దిష్ట జనాభాకు తీవ్రమైన వేడి కలిగించే ప్రమాదాన్ని అంచనా వేసే ఒక  కొలమానం. ఈ సూచిక కేవలం ఉష్ణోగ్రత ప్రభావాన్ని మాత్రమే కాకుండా, ప్రజలకు అందుబాటులో ఉన్న శీతలీకరణ మౌలిక సదుపాయాలు, పచ్చదనాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. నగరవాసుల్లో అధిక శాతం మందికి ఈ రెండూ పరిమితంగానే అందుబాటులో ఉండడం వల్ల వేడి సంబంధిత అనారోగ్యాల ప్రమాదం పెరుగుతోంది. 

క్షేత్రస్థాయిలోని గణాంకాలు కూడా అధ్యయన ఫలితాల్ని బలోపేతం చేస్తూ పరిస్థితి  తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. నగరంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 5 మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను మించిన రోజులు 47 నమోదు కాగా.. గత 10 సంవత్సరాలలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement