ఎఫ్‌ఐఆర్‌లను ఆన్‌లైన్‌లో ఉంచని పోలీసులు.. ‘సుప్రీం’నే ధిక్కరిస్తారా! 

Hyderabad Police Do Not Keep FIRs Online - Sakshi

ఉన్న వాటిలో కొన్నింటిలో సాంకేతిక సమస్యలు

ఠాణాల మాటేమో గాని కీలక విభాగాలూ అంతే

తెలివిగా వ్యవహరిస్తూ ‘పబ్లిక్‌ వ్యూ’ ఇవ్వని వైనం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీసు విభాగం పరోక్షంగా సుప్రీం కోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేస్తోంది. పారదర్శకత పెంచడంతో పాటు బాధితులకు ఉపయుక్తంగా ఉండేందుకు అత్యున్నత న్యాయస్థానం పోలీసులు నమోదు చేసే కేసుకు సంబంధించిన  ప్రాథమిక సమాచార నివేదికను (ఎఫ్‌ఐఆర్‌) అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో ఉంచాలని ఆదేశించింది. కేంద్రం అధీనంలో పని చేసే సీబీఐ, ఎన్‌ఐఏలు సైతం దీన్ని పక్కాగా అమలు చేస్తుండగా.. పోలీసులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొన్నింటికి ఆన్‌లైన్‌లో పెట్టట్లేదు. పెట్టిన వాటిలో కొన్నింటికి పబ్లిక్‌ వ్యూ ఆప్షన్‌ ఇవ్వట్లేదు. ఆన్‌లైన్‌లో ఉన్న మరికొన్ని ఎఫ్‌ఐఆర్‌లు సాంకేతిక సమస్యలతో తెరుచుకోవట్లేదు.  

అప్పట్లో అత్యంత రహస్యమే... 
ఏదైనా కేసులో బాధితుడు, నిందితుడిగా ఉన్న వారికి తమ ఎఫ్‌ఐఆర్‌ పొందడమనేది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగం. ఒకప్పుడు దీని ప్రతిని ఠాణా నుంచి తీసుకోవడానికి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది. కీలకమైన కేసుల విషయంలో పోలీసుల చేతులు తడిపితే తప్ప కాపీ బయటకు వచ్చేది కాదు. సుప్రీంకోర్టు యూత్‌ బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా కేసుతో ఈ సమస్య తీరింది. ‘సుప్రీం’ 2016 సెప్టెంబర్‌ 7న కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఎఫ్‌ఐఆర్‌ను 24 గంటల్లోగా పోలీసు అధికారిక వెబ్‌సైట్‌లో కానీ, రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కానీ కచ్చితంగా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. ఆ ఏడాది నవంబరు 15 నుంచి ఈ విధానం అమలులోకి రావాలని పేర్కొంది.  
చదవండి: చీటింగ్‌ కేసులో తిరుమల ఏఎస్పీ.. నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపి... 

కొన్నింటికి మాత్రమే మినహాయింపు.. 
అనివార్య కారణాల నేపథ్యంలో కొన్ని కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లు మాత్రం రహస్యంగా ఉంచేందుకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. మహిళలపై లైంగిక వేధింపులు, వారిపై జరిగే నేరాలు, ఉగ్రవాద సంబంధిత నేరాలు, బాలబాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు, సున్నిత స్వభావం, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింగే కేసులకే ఈ అవకాశం ఉంది. ఎఫ్‌ఐఆర్‌ రహస్యంగా ఉంచాలనే నిర్ణయం తీసుకునే అధికారం డీఎస్పీ (ఏసీపీ) స్థాయికి తక్కువ కాని స్థాయి అధికారి, జిల్లా మేజిస్ట్రేట్‌లకు మాత్రమే ఉంటుంది. రహస్యంగా ఉంచిన ఎఫ్‌ఐఆర్‌పై సంబంధిత కోర్టుకు కచ్చితంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.  

వేగంగా మొదలెట్టి అరకొరగా... 
ఈ తీర్పును అమలు చేయడంలో తెలంగాణ పోలీసు విభాగం వేగంగా స్పందించింది. తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక లింక్‌ ఏర్పాటు చేసి ఎఫ్‌ఐఆర్‌లు ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం మాత్రం ఈ విధానం అరకొరగా మారిపోయింది. పోలీసుస్టేషన్లకు చెందిన పోలీసుల మాట అటుంచితే... ప్రత్యేక విభాగాలు సైతం దీన్ని పట్టించుకోవట్లేదు. సాక్షాత్తూ నగరం  కేంద్రంగా పని చేసే నేర విభాగంలో ఈ ఏడాది నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల్లో ఒక్కటి కూడా వెబ్‌సైట్‌లో కనిపించట్లేదు. గతేడాదికి సంబంధించిన వాటిలోనూ అనేక పోలీసుస్టేషన్లు అప్‌లోడ్‌ చేసిన వాటిలో సాంకేతిక సమస్యలు ఉంటున్నాయి. దీంతో డౌన్‌లోడ్‌ అయినా.. తెరుచుకోవట్లేదు. ఫలితంగా ఉన్నా లేనట్లుగానే భావించాల్సి వస్తోంది. 
చదవండి: Hyderabad: అండగా ఉంటారనుకుంటే.. అందకుండా పోయారు..

తెలివిగా ఆన్‌లైన్‌లో పెడుతూ..  
రాష్ట్రంలోని కొన్ని పోలీసుస్టేషన్లు, ప్రత్యేక విభాగాలు ఈ ఎఫ్‌ఐఆర్‌ల విషయంలో తెలివిగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో కోర్టులు, సంబంధిత విభాగాలతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆన్‌లైన్‌లోనే పొందుపరుస్తున్నారు. వీటికి పబ్లిక్‌ వ్యూ ఆప్షన్‌ ఇవ్వట్లేదు. ఫలితంగా పోలీసు అధికారిక వెబ్‌సైట్‌లోని ‘వ్యూ ఎఫ్‌ఐఆర్‌’ విభాగంలో అవి కనిపించట్లేదు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అత్యాధునిక టెక్నాలజీలు అందిపుచ్చుకోవడంలో ముందున్న మన పోలీసులు ఆన్‌లైన్‌ ఎఫ్‌ఐఆర్‌ అంశంలో మాత్రం విఫలమవుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై దృష్టి పెట్టాలని బాధితులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top