చీటింగ్‌ కేసులో తిరుమల ఏఎస్పీ.. ఆరా తీయగా అసలు విషయం తెలిసి... 

Hyd: Cheating Case Filed On Tirumala ASP Muni Ramaiah - Sakshi

పెట్టుబడి పేరుతో హైదరాబాద్‌ వ్యాపారికి టోకరా

రూ.3 కోట్లు ఇస్తామంటూ రూ.1.2 కోట్లు స్వాహా

డమ్మీ డీఎస్పీని రంగంలోకి దింపి ఈ వ్యవహారం

నోటీసులు జారీ చేసిన సిటీ సీసీఎస్‌ పోలీసులు

 ఏపీ రాష్ట్ర పోలీసు విభాగానికి సమగ్ర నివేదిక 

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుమల అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసుగా (ఏఎస్పీ) పని చేస్తున్న ఎం.ముని రామయ్యపై హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రై మ్‌ స్టేషన్‌లో (సీసీఎస్‌) చీటింగ్‌ కేసు నమోదైంది. ఓ డమ్మీ డీఎస్పీని రంగంలోకి దింపి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ వై.వెంకట్‌రెడ్డి నేరానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ముని రామయ్యకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. మరోపక్క ఈ వ్యవహారంపై హైదరాబాద్‌ పోలీసులు ఏపీ అధికారులకు సమగ్ర నివేదిక సమర్పించారు.  

భారీ మొత్తం వస్తుందని ఆశ చూపి... 
మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన చుండూరు సునీల్‌కుమార్‌ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఈయన స్నేహితుడైన కోడటి జయప్రతాప్‌ 2018 డిసెంబర్‌లో ఓ ప్రతిపాదన తీసుకువచ్చారు. చిత్తూరు జిల్లా ఓ వ్యక్తికి రూ.5 కోట్లు ఇస్తే ఆయన వివిధ పెట్టుబడులు పెట్టి, పక్షం రోజుల్లో రూ.18 కోట్ల తిరిగి ఇస్తాడని చెప్పాడు. ఈ మాటల్ని సునీల్‌కుమార్‌ పట్టించుకోలేదు. దీంతో 2019 అక్టోబర్‌ 28న ముని రామయ్యను తీసుకుని జయ ప్రతాప్‌ హైదరాబాద్‌ వచ్చారు. హిమాయత్‌నగర్‌లోని సునీల్‌ కుమార్‌ కార్యాలయానికి వెళ్లి ఆయన్ను కలిశారు. అప్పట్లో ముని రామయ్య సీఐడీ విభాగంలో తిరుపతి డీఎస్పీగా పని చేస్తున్నారు. సునీల్‌ కుమార్‌తో పెట్టుబడుల విషయం చెప్పిన ముని రామయ్య కచ్చితంగా లాభం వస్తుందని, రూ.1.2 కోట్లు ఇస్తే పక్షం రోజుల్లో రూ.3 కోట్లు ఇస్తామంటూ నమ్మబలికాడు. అవతలి వ్యక్తి ఇవ్వకుంటే పరిస్థితి ఏంటని సునీల్‌ కుమార్‌ ప్రశ్నించారు. 
చదవండి: ఎఫ్‌ఐఆర్‌లను ఆన్‌లైన్‌లో ఉంచని పోలీసులు.. ‘సుప్రీం’నే ధిక్కరిస్తారా! 

నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపి... 
దీంతో ముని రామయ్య ఓ నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపాడు. కేవీ రాజు అనే వ్యక్తిని తీసువచ్చి టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీగా పరిచయం చేశాడు. గతంలో తామిద్దరం కలిసి అనేక ఎన్‌కౌంటర్లు చేశామంటూ నమ్మబలికాడు. అవతలి వ్యక్తి నగదు ఇవ్వకపోతే అతడిని కనిపెట్టి, డబ్బు వసూలు చేయడం రాజుకు పెద్ద పనేంకాదంటూ చెప్పాడు. దీనికితోడు ముని రామయ్య రూ.1.2 కోట్లకు తాను గ్యారెంటీగా ఉంటానంటూ రూ.3 కోట్లకు ఆర్టీజీఎస్‌ ఫామ్‌ రూపొందించి తన ఫోన్‌ ద్వారా సునీల్‌కుమార్‌కు పంపాడు. దీంతో పాటు ఆర్కే క్లీన్‌ రూమ్స్‌ ప్రై వేట్‌ లిమిటెడ్‌ సంస్థ పేరుతో రూ.3 కోట్లకు రాసిన చెక్కులు ఇచ్చాడు. దీంతో రూ.1.2 కోట్లు ఇవ్వడానికి సునీల్‌ కుమార్‌ అంగీకరించారు. దీంతో 2019 నవంబర్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తిని రూ.1.2 కోట్లు ఇచ్చి పంపేలా ముని రామయ్య చేశారు. ఈ సందర్భంలోనే జయప్రతాప్‌ ఖమ్మంలో ఉన్న ఓ భూమికి సంబంధించిన పత్రాలు ఇచ్చారు. 

ఆరా తీయగా అసలు విషయం తెలిసి... 
ఇది జరిగిన తర్వాత దాదాపు రెండేళ్లకు పైగా ఎదురు చూసినా సునీల్‌కుమార్‌కు డబ్బు తిరిగి రాలేదు. దీంతో సునీల్‌కుమార్‌ ముని రామయ్యపై ఒత్తిడి తెచ్చారు. దీంతో తన కుమార్తె పేరుతో ఉన్న ఓ స్థలం పత్రాలు ఇచ్చిన ఆయన దానిపై రూ.2 కోట్లు రుణం తీసుకోవాలని చెప్పారు. అయితే వాటిని పరిశీలించిన బ్యాంకులు రుణం ఇవ్వడానికి ముందుకు రాలేదు. అప్పటి నుంచి  ముని రామయ్య అందుబాటులోకి రాకపోవడంతో సునీల్‌కుమార్‌ అనుమానించారు. ఆరా తీయగా కేవీ రాజు అనే పేరుతో డీఎస్పీ లేరని తేలింది.
చదవండి: Chain Snatcher: ఉమేష్‌ ఖతిక్‌ను ఇచ్చేదేలే

దీంతో ఆయన తాను మోసపోయానని గుర్తించి సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో జయప్రతాప్, మునిరామయ్య, కేవీ రాజు తదితరులపై కేసు నమోదు చేసిన ఏసీపీ వై.వెంకట్‌రెడ్డి దర్యాప్తు చేసి నేరం జరిగినట్లు నిర్థారించారు. ఓపక్క ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా ముని రామయ్య రెండుసార్లు సునీల్‌కుమార్‌ను కలిశారు. అప్పటి వరకు తానో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ అని చెప్పుకున్న ఆయన హఠాత్తుగా కాళ్ల బేరానికి వచ్చారు. సదరు కేసులో తనను సాక్షిగా చేర్చాలంటూ ప్రాధేయపడ్డాయి. అయితే డబ్బు విషయం మాత్రం తేల్చలేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top