
హైదరాబాద్, సాక్షి: హైడ్రా (Hyderabad Disaster Response and Action) కంట్రోల్ రూమ్ సేవలు బంద్ అయ్యాయి. జీతాలు తగ్గించడంతో మార్షల్స్ విధులు బహిష్కరించారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిణామానికి సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది.
హైదరాబాద్ నగరంలో వర్షాకాలం నేపథ్యంలో HYDRA యంత్రాంగం మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు రంగంలోకి దిగి సేవలు ప్రారంభించింది. ఈ సేవల్లో మార్షల్స్, DRF బృందాలు, ట్రాఫిక్ సపోర్ట్ టీమ్‌లు, క్లీన్-అప్ సిబ్బంది భాగంగా ఉన్నారు. మొత్తం 150 డివిజన్‌లలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు (METs): ఒక్కో టీమ్‌లో 4 మంది, మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు.
ఇందులో డీఆర్‌ఎఫ్ బృందాలు 51 టీమ్‌లు ఉండగా.. మొత్తం 918 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే.. స్టాటిక్ బృందాలు 368 ఉండగా.. నీటి నిలయాల వద్ద 734 మంది ఉన్నారు. 21 బైకులతో ఎమర్జెన్సీ బైక్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇక ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భధ్రత, సమన్వయం కోసం మార్షల్స్‌ను ఏర్పాటు చేశారు. మొత్తంగా.. మాన్‌పవర్ 4,100 మంది ఉన్నారు.
వానా కాలంలో నీరు తొలగించేందుకు పంపులు, చెట్ల కట్ మిషిన్లు, క్లీన్-అప్ టూల్స్ వీళ్లకు అందిస్తున్నారు. ప్రతి బృందానికి ఒక్కరోజులోనే సత్వర శిక్షణ ఇప్పించారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ సమన్వయంతో ఈ సిబ్బంది సేవలు అందిస్తూ వస్తున్నారు.