ఆన్‌లైన్‌ క‍్లాసులు ప్రారంభం కాలే.. ఫీజులు కట్టమని బెదిరిస్తున్నారు | Hyderabad Corporate Colleges Do Not Follow Regulations | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ క‍్లాసులు ప్రారంభం కాలే.. ఫీజులు కట్టమని బెదిరిస్తున్నారు

May 9 2021 8:45 AM | Updated on May 9 2021 2:45 PM

Hyderabad Corporate Colleges Do Not Follow Regulations - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : కరోనా కష్టకాలంలో సైతం కార్పొరేట్‌ కాలేజీలు ముందస్తు ఫీజుల పేరిట బాదుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఆన్‌లైన్‌ తరగతులకు శ్రీకారం చుట్టి పట్టుమని పదిరోజులు గడవక ముందే ఫీజుల ఒత్తిళ్లకు పాల్పడుతున్నాయి. పదో తరగతి పరీక్షల కంటే ముందే ఇంటర్మీడియట్‌లో సీటు బుకింగ్‌ రిజర్వ్‌డ్‌ పేరిట అడ్మిషన్ల సంఖ్యను పూర్తి చేసుకున్న కార్పొరేట్‌  కాలేజీలు.. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో పరీక్షల రద్దు ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచే ఆన్‌లైన్‌ ద్వారా తరగతులు ప్రారంభించాయి. వాస్తవంగా పదో తరగతి పరీక్షలు రద్దయినా గ్రేడింగ్‌ ఇంకా వెలువడలేదు. కానీ.. కార్పొరేట్‌ కాలేజీలు సీటు రిజర్వ్‌డ్‌ చేసుకున్న విద్యార్థుల సెల్‌ఫోన్లకు ఆన్‌లైన్‌ ఐడీ పంపించి గత నెల 29 నుంచే ఆన్‌లైన్‌ బోధన సాగిస్తున్నాయి. కోర్సు ఫీజులో ముందస్తుగా రూ.20 వేలు, పాఠ్యపుస్తకాల కోసం మరో రూ.10 వేలు చెల్లించాలని విద్యార్థుల పేరెంట్స్‌ సెల్‌ఫోన్‌లకు సంక్షిప్త సందేశాలు అందుతున్నాయి. సోమవారం నుంచి ఫీజు వసూలు కౌంటర్లు తెరిచి ఉంటాయని సమాచారం అందించాయి. తక్షణమే చెల్లించడంతో పాటు పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేసేలా విద్యార్థులపై ఒత్తిళ్లకు దిగుతున్నాయి.  

ఆది నుంచీ అదే వైఖరి..  
చదువుల కోసం ఆది నుంచీ కార్పొరేట్‌ కాలేజీల బాదుడు మొదలవుతోంది. సీటు రిజర్వ్‌డ్‌ పేరిట రూ.2000, దరఖాస్తు ఫారం పేరిట రూ 300 వసూలు సర్వసాధారణమైంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్‌లో కోర్సును బట్టి రూ.70 వేల నుంచి  రూ.1.30 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. అదే కార్పొరేట్‌ విద్యా సంస్థలో పదో తరగతి చదివి ఉంటే మాత్రం కన్వర్షన్‌ పేరిట కొంత ఫీజులో తగ్గింపు ఇస్తున్నా.. మిగిలిన వారికి మాత్రం ఇష్టానుసారం ముక్కుపిండి వసూలు చేయడం మామూలుగా మారింది. అది కూడా రెండు మూడు విడతల్లోనే పూర్తి ఫీజు చెల్లించే విధంగా కార్పొరేట్‌ విద్యా సంస్ధలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తున్న కారణంగా కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖ ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. కార్పొరేట్‌ విద్యా సంస్థలు మాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. విద్యా సంవత్సరానికి ముందే ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమైనా విద్యాశాఖ ప్రేక్షక పాత్ర పోషించడం విస్మయానికి గురి చేస్తోంది.
 
చెల్లింపులన్నీ నగదు రూపంలోనే.. 
వైరస్‌ కట్టడిలో భాగంగా నగదు కాకుండా డిజిటల్‌ పద్ధతిలో  చెల్లింపులు జరపడం మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నప్పటికీ కార్పొరేట్‌ కాలేజీలు మాత్రం నగదు  చెల్లింపు మాత్రమే అంగీకరిస్తామంటున్నాయి. కనీసం సీటు రిజర్వ్‌డ్‌ దరఖాస్తుకు చెల్లించే ఫీజునూ నగదు రూపంలోనే  తీసుకోవడం విస్మయపరుస్తోంది. తాజాగా ఫీజులు, పాఠ్యపుస్తకాలకూ నగదు  చెల్లించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement