చికోటి ప్రవీణ్‌కు షాక్‌.. తనతోపాటు ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిపై కేసు నమోదు

Hyderabad: Chikoti Praveen Three Security Guards Arrested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్యాసినో వ్యవహారంలో సంచలనం సృష్టించిన చికోటి ప్రవీణ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆదివారం లాల్‌ దర్వాజా సింహవాహిణి అమ్మవారి ఆలయం వద్దకు అనుమతి లేకుండా ఆయుధాలు కలిగిన ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని వెంట తీసుకెళ్లినందుకు చత్రినాక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. చీకోటి సహా ముగ్గురిపై పోలీసులు చీటింగ్‌తోపాటు ఫోర్జరీ, ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. A1గా చికోటి, A2గా రాకేష్, A3గా సుందర్ నాయక్, A4గా రమేష్ గౌడ్‌లుగా చేర్చారు.

ఈ కేసులో చీకోటి ప్రవీణ్‌కు చెందిన ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని (సుందర్ నాయక్, రాకేష్ కుమార్, రమేష్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక వారి వద్ద ఉన్న ఆయుధాల లైసెన్స్‌ ఫేక్‌ డాక్యుమెంట్స్‌గా పోలీసులు తేల్చారు. నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కాగా బోనాల పండుగ సందర్భంగా చీకోటి ప్రవీణ్ ఆదివారం సింహావాహిని అమ్మవారి గుడికి వెళ్లిన విషయం తెలిసిందే.

ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చుకున్న ప్రవీణ్ వారితో కలిసి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు ప్రైవేట్ సెక్యూరిటీని అడ్డుకున్నారు. వాళ్లను తనిఖీ చేయగా ఆయుధాలు బయటపడటంతో ఖంగుతున్నారు. జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టరీత్యా నేరం కావడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. 
చదవండి: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త..

అయితే వెపన్స్‌ లైసెన్స్‌ ఒరిజినల్‌ డాక్యుమెంట్లు ఏడాది క్రితమే ఛత్రినాక పోలీస్‌ స్టేషన్‌కు పంపామని చీకోటి ప్రవీణ్‌ చెబుతున్నారు.  తనకు ప్రాణ హాని ఉందని ప్రైవేట్ భద్రత ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు. గన్స్‌కు లైసెన్స్ ఉందని తమకు డాక్యుమెంట్స్ చూయించారని వెల్లడించారు. డాక్యుమెంట్స్ మొత్తం పరిశీలించాలని లోకల్‌ పోలీస్‌ స్టేషన్‌లలో సమర్పించానని, వారు డాక్యుమెంట్స్ చూసి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని పేర్కొన్నారు.

ఇప్పుడు డాక్యుమెట్స్ ఫోర్జరీ అని కేసు నమోదు చేశారని తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని సైదాబాద్ పోలీసులు ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇందుకు పోలీసుల తప్పిదమే కారణమని చెప్పారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో పార్టీ జాయిన్ గురించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తనను రాజకీయంగా  ఎదుర్కొనలేక తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మతం కోసం, హిందూత్వం కోసం తాను పోరాటం చేస్తూనే ఉంటానని, గజ్వేల్‌ ఘటన తర్వాత తనను టార్గెట్‌ చేశారని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top