Hyderabad: 18 నుంచి 27 వరకు బుక్‌ఫెయిర్‌

Hyderabad Book Fair 2021 Dates, Timings, Entrance Fee, Venue Details Here - Sakshi

వేదిక ఎన్టీఆర్‌ స్టేడియం

కొలువుదీరనున్న వేలాది గ్రంథాలు

సాహితీ సదస్సులతో వేడుకలు

కోవిడ్‌ దృష్ట్యా గట్టి భద్రత చర్యలు

250 స్టాళ్లతో ప్రదర్శన ఏర్పాటు  

సాక్షి, హైదరాబాద్‌: పుస్తకం రెక్కలల్లార్చుకొని చదువరి చెంతకు తిరిగి వచ్చేస్తోంది. లక్షలాది మంది సాహితీ ప్రియుల మదిని దోచుకోనుంది. ఈ నెల 18 నుంచి 27 వరకు హైదరాబాద్‌  జాతీయ పుస్తక ప్రదర్శన 34వ వేడుకలు ఎన్టీఆర్‌ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ఈసారి కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కమిటీ  సన్నాహాలు చేపట్టింది. ఏటా సుమారు 330 నుంచి 350 స్టాళ్లతో జాతీయ స్థాయి పుస్తక ప్రచురణ సంస్థలతో నిర్వహిస్తున్న ప్రదర్శనలో ఈ ఏడాది వీటి సంఖ్యను తగ్గించినట్లు నిర్వాహకులు తెలిపారు. కోవిడ్‌ జాగ్రత్తలను పాటిస్తూ సందర్శకులు పుస్తక ప్రదర్శనలో పాల్గొనేందుకు అనుగుణంగా 250 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు  చెప్పారు.   


బహుభాషల్లో..  

► అన్ని రాష్ట్రాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు ఈ  ప్రదర్శనలో పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నాయి. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలోనూ హైదరాబాద్‌  ఏటేటా పుస్తకానికి బ్రహ్మరథం పడుతూనే ఉంది.  

► విభిన్న జీవన రంగాలకు చెందిన లక్షలాది పుస్తకాల విక్రయాలు జరుగుతున్నాయి. కథ, కవి త్వం, నవల, చరిత్ర వంటి సాహిత్యమే కాకుండా  బాలల సాహిత్యం, పోటీ పరీక్షల పుస్తకాలు ఆర్థిక, రాజకీయ పరిణామాలపై వెలుడిన విశ్లేషణ గ్రంథాలు, వ్యక్తిత్వ వికాసం, అకడమిక్‌ పాఠ్యపుస్తకాలు వంటి వాటికీ పాఠకాదరణ లభిస్తోంది. (చదవండి: కళ్యాణలక్ష్మి: కాసులిస్తేనే.. ‘కానుక’!)


ప్రదర్శన వేళలు ఇలా.. 

► మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు.  
► శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో  మధ్యాహ్నం 12.30 నుంచి  రాత్రి 9 గంటల వరకు.   

జాగ్రత్తలు పాటించాలి 
ఎంతో సాహసం చేసి ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శనకు సందర్శకులు సహకరించాలి. కచ్చితంగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలి. మాస్కులు ధరించి  మాత్రమే ప్రదర్శనకు రావాలి. భౌతిక దూరం పాటించాలి.  
– కోయ చంద్రమోహన్, బుక్‌ఫెయిర్‌ కమిటీ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top