అయ్యో శ్వేతా.. ఆదుకునేవారే లేరా? | Hyderabad Alwal Electrocution Tragedy Latest Update | Sakshi
Sakshi News home page

భర్త, కూతురిని కోల్పోయి ఒంటరైన శ్వేత

Jun 19 2026 2:54 PM | Updated on Jun 19 2026 5:49 PM

Hyderabad Alwal Electrocution Tragedy Latest Update

తన భర్త, కూతురు ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్న శ్వేత (ఫైల్‌)

కళ్లముందే మెదులుతున్న విద్యుత్‌ ప్రమాద ఘటన

పట్టించుకోని విద్యుత్‌, మున్సిపల్‌ అధికారులు

కనీసం పరామర్శ కూడా కరువే

హైద‌రాబాద్‌: విధి ఆడిన వింత నాటకంలో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది.. భర్త, కూతురితో ఆనందంగా సాగిపోవాల్సిన ఆమె ఇపుడు అనాథ అయింది.. కన్న కూతురు, కట్టుకున్న భర్త ప్రాణాలు ఆమె కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు.. ఈనెల 13న తెల్లవారుజామున జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో అందరి ముందూ తండ్రి, కూతురు విగతజీవులగా మారిపోయారు.

అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కానాజీగూడ టెలికాం కాలనీలో జరిగి విద్యుత్‌ తీగ కారుపై పడటంతో సందీప్‌(45), అతని కూతురు రుత్విక(16) ప్రాణాలు కోల్పోవడం ఇంకా స్థానికుల కళ్లముందే మెదులుతోంది.

మీ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది.. కాదు.. మీ నిర్లక్ష్యం వల్లే అని విద్యుత్‌ శాఖ అధికారులు, మల్కాజిగిరి మున్సిపల్‌ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.  

ఈ ప్రమాదం జరిగి ఇప్పటికి ఆరు రోజులవుతోంది. ప్రమాదానికి కారణం ఏ శాఖ అయినా.. ప్రభుత్వ శాఖలే కదా.. మరి బాధితురాలు శ్వేత గురించి ప్రభుత్వం అస్సలు పట్టించుకోకపోతే ఎలా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రభుత్వ అధికారులైనా వచ్చి బాధితురాలికి భరోసా ఇచ్చి పరిహారం గురించి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. ఆ కుటుంబ పరిస్థితి కూడా అంతంత మాత్రమేనని చెబుతున్నారు.  

ప్రమాద సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని స్థానికులు పలుమార్లు విద్యుత్‌ శాఖ అధికారులకు ఫోన్‌ చేసినప్పటికీ స్పందన లేదని ఆరోపిస్తున్నారు. సుమారు 45 నిమిషాల పాటు సహాయం కోసం ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సకాలంలో స్పందించి కరెంట్‌ సరఫరా నిలిపివేసి ఉంటే.. అత్యవసర టీమ్‌ వెంటనే చేరుకుంటే  ఇద్దరి ప్రాణాలు దక్కేవని చెబుతున్నారు. ఇపుడు అధికారులు సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం శ్వేతకు ఆర్థిక సహాయం అందజేసి ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

ఇలాంటి సమయంలో బాధితురాలికి మానసికంగా, ఆర్థికంగా అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యతని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్వేత అత్త లలిత క్యాన్సర్‌ బారిన పడింది, మామ చక్రపాణికి ఇటీవల బైపాస్‌ సర్జరీ జరిగింది. తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కుటుంబ పరిస్థితిని ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకొని అండగా నిలవాలని కోరుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement