సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ దాడులతో ఒక్కసారిగా కలకలం రేగింది. కొండాపూర్‌తో పాటు నాగోల్, ఉప్పల్, పలు ప్రాంతాల్లో ఏసీబీ ఏకధాటిగా సోదాలు చేపట్టింది. మేడ్చల్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. కొండాపూర్ ఆర్టీవో కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్ సెంట్రల్ పరిధిలోని నాగోల్ జగ్జీవన్ రామ్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏజెంట్ల ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఇతర వాహన రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరుగుతున్నాయనే సమాచారంతో హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి.
ఆర్టీఏ ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కార్యాలయంలోని ఎంవీఐలు, ఏఎంవీఐలను సైతం ఏసీబీ అధికారులు విచారిసుత్న్నారు. అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఏజెంట్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లను పరిశీలిస్తున్నారు. లైసెన్స్‌ల జారీ, రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.


