
భారీ వర్షంతో సిటీ ట్రాఫిక్‌కు తీవ్ర విఘాతం
జలమయమైన రోడ్లు...కూలిన చెట్లు
పదకొండు గంటలకూ ‘దారికి’ రాని వైనం
సాక్షి, హైదరాబాద్: హఠాత్తుగా కురిసిన భారీ వర్షానికి సోమవారం నగరం నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు అనేక ప్రాంతాల్లో చెట్లు కూలడంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటరు దూరం దాటడానికి కనీసం అరగంటకు పైగా పట్టింది. ఇంకొన్ని చోట్ల గంటల తరబడి వాహనాలు ముందుకు కదలనే లేదు. వర్షం నేపథ్యంలో ద్విచక్ర వాహనచోదకులు మెట్రోరైల్ స్టేషన్ల కింద ఆగిపోవడంతో ఆ ప్రాంతాలు బాటిల్ నెక్స్‌గా మారి మరిన్ని ఇబ్బందులు తెచ్చాయి.
సాధారణంగా మిగిలిన రోజుల కంటే మొదటి పని దినమైన సోమవారం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో పరిస్థితి చేతులు దాటింది. ట్రాఫిక్ పోలీసులతో పాటు హైడ్రా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది శ్రమించినా వాహనచోదకుడిని నరకం తప్పలేదు. నగర వ్యాప్తంగా దాదాపు 140 ప్రాంతాల్లో ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాల కారణంగా రోడ్లన్నీ చెరువులుగా మారాయి. వర్షానికి రోడ్లన్నీ నీళ్లు నిండటంతో ఏది గొయ్యే, ఏది రోడ్డో అర్థంకాక వాహనచోదకులు తమంతట తామే వాహన వేగాలను తగ్గించుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ రహదారులపై వాహన శ్రేణులు నిలిచిపోయాయి.
కీలక మార్గాల్లోనూ అత్యంత నెమ్మదిగా ముందుకు సాగాయి. నాగోల్–మెట్టుగూడ, సికింద్రాబాద్–బేగంపేట్, ఎల్బీనగర్–చాదర్‌ఘాట్, ఎంజే మార్కెట్–నాంపల్లి, పంజగుట్ట–కూకట్‌పల్లి, పంజగుట్ట–మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్–మెహదీపట్నం ప్రాంతాల్లో వాహనాలు భారీగా ఆగిపోయాయి. రోడ్లన్నీ జామ్ కావడంతో గంటల తరబడి వాహనాలు రోడ్ల పైనే ఉండిపోయాయి. కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వెళ్లే దారిలోనూ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
స్వయంగా రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్...
సోమవారం నాటి పరిస్థితుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. కేవలం గంట వ్యవధిలో ఏకంటా ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం పడే అవకాశం ఉందని రెండు గంటల ముందుగానే సమాచారం అందుకున్న హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో ఉండే అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆయన కూడా స్వయంగా ముంపు ప్రాంతాలకు వెళ్లారు. లక్డీకాపూల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడైనా వరద ముప్పు ఉంటే హైడ్రా కంట్రోల్ రూమ్‌కు (9000113667) ఫిర్యాదు చేయాలని సూచించారు.