కోర్టు నోటీసులంటే లెక్కలేదా? | High Court serious against Education Secretary Yogita Rana | Sakshi
Sakshi News home page

కోర్టు నోటీసులంటే లెక్కలేదా?

Jun 26 2026 3:47 AM | Updated on Jun 26 2026 3:47 AM

High Court serious against Education Secretary Yogita Rana

విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణాపై హైకోర్టు సీరియస్‌

కారుణ్య నియామకంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: న్యాయస్థానం నోటీసులంటే గౌరవం లేదా అని విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత విచారణ సందర్భంగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించినా ఎందుకు రాలేదని ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాది సమాచారం ఇచ్చి కారణాలు తెలుపుతూ ‘డిస్పెన్స్‌’ అప్లికేషన్‌ వేయకపోవడాన్ని సహించరాని నిర్లక్ష్యంగా పరిగణించాల్సి ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అందుబాటులో లేకుండా ఎక్కడికో వెళ్లిపోయారని పేర్కొంది. ఇది రాజ్యాంగ ధర్మాసన ఉత్తర్వుల ధిక్కరణ కిందకే వస్తుందని, కఠిన ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది. 

కారుణ్య నియామకం అంశం కలెక్టర్‌ వద్ద పెండింగ్‌లో ఉందని యోగితారాణా చెప్పగా.. న్యాయమూర్తి జోక్యం చేసుకుని, ‘కలెక్టర్‌ మీ పేరు చెబుతారు.. మీరు కలెక్టర్‌ అని చెబుతారు. పిటిషనర్‌తో ఆటలాడుకుంటున్నారా’ అని నిలదీశారు. కారుణ్య నియామకానికి సంబంధించి కోర్టు 2023, అక్టోబర్‌లో ఇచ్చిన ఉత్తర్వులను పాటించకపోవడంతో.. హైదరాబాద్‌ మాసబ్‌ ట్యాంక్‌కు చెందిన సయ్యద్‌ మహబూబ్‌ హైకోర్టులో 2024, ఫిబ్రవరిలో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ టి.మాధవీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాకు ఫామ్‌–1 నోటీసులిచ్చినా హాజరుకాకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు అధికారి నిజామాబాద్‌లో ఉన్నందున ఆన్‌లైన్‌లో హాజర య్యేందుకు అవకాశం ఇవ్వా లని ప్రభుత్వ న్యాయవాది కోరినా నిరాకరించారు. ధిక్కరణ పిటిషన్‌లో ఇంత నిర్లక్ష్యాన్ని సహించరానిదంటూ విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. న్యాయమూర్తి సమ్మతి మేరకు మధ్యా హ్నం యోగితా రాణా.. ఆన్‌లైన్‌లో హాజరై క్షమాపణ కోరారు. 

ఉదయమే నిజామాబాద్‌ వచ్చానని.. కార్యాలయంలో సమాచార లోపం కారణంగా తాను హాజరుకాలేకపో యానని, కోర్టులంటే గౌరవం ఉందని చెప్పారు. నోటీసులు అందుకుని కోర్టుకు రాకపోవడం ధిక్కరణ కిందకు వస్తుందని, మరోసారి ఇలా నిర్లక్ష్యం వహిస్తే శిక్షించాల్సి వస్తుందని న్యాయమూర్తి హెచ్చరించారు. తదుపరి విచారణ నుంచి హాజరుకు మినహాయింపు ఇస్తూ.. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement