పోర్టల్ వివరాలు అందజేయాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మోటారు వాహన నిబంధనల మేరకు ఈ–చలాన్ వ్యవస్థలోని చట్టబద్ధతపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే పోర్టల్ అప్‌గ్రేడేషన్‌పై వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 9కి వాయిదా వేసింది.
ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ కోసం జారీ చేసిన రూ. 1,200 జరిమానా, యూజర్ చార్జీలు రూ. 35తో కలిపి మొత్తం రూ. 1,235 ట్రాఫిక్ చలాన్ విధించడాన్ని సవాల్ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన వి. రాఘవేంద్రచారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ తాజాగా విచారణ చేపట్టారు. చలాన్ వేయడంలో చట్టపరమైన నిబంధనను పేర్కొనడంలో ప్రభుత్వం విఫలమైందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
ఈ జరిమానా మోటారు వాహనాల చట్టం, కేంద్ర మోటారు వాహన నియమాలకు విరుద్ధంగా ఉందన్నారు. నిబంధనల మేరకు రూ. 100 నుంచి రూ. 300 మధ్య మాత్రమే జరిమానా విధించాలని రూ. 1,200 సరికాదని నివేదించారు. చట్టవిరుద్ధంగా మోపే జరిమానాతో మధ్యతరగతి పౌరులపై భారం పడుతుందన్నారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ చలాన్ కారణంగా పిటిషనర్‌కు ఇబ్బంది ఉన్నా, అభ్యంతరమున్నా అధికారులకు వినతిపత్రం సమర్పించవచ్చన్నారు.
తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ ఈ–చలాన్ సిస్టమ్‌లో నిబంధనల వివరాలను పొందుపర్చలేదని, వాటిని చేర్చడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు.


