జగిత్యాల జిల్లా: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం కండ్లపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. బీర్‌పూర్ ఎస్సై రాజు వివరాలు తెలిపారు. కండ్లపల్లికి చెందిన శ్రీరాముల నవత తన ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని, వాటిని తీయడానికి ముగ్గురు వ్యక్తులను సంప్రదించింది. జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన నారవేణి మొగిలి, గోవిందుపల్లెకు చెందిన వరికొప్పుల సోమయ్య, ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన భైరవేణి రాజుతో గుప్తనిధులు వెలికితీయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
అనుకున్న ప్రకారం శనివారం రాత్రి సమయంలో ఇంట్లో కరెంట్ లేకుండా ఫ్యూజ్‌లు తొలగించి చీకట్లోనే తవ్వకాలు ప్రారంభించారు. 8 ఫీట్ల లోతు గుంత తవి్వనప్పటికీ ఏమీ లభించకపోవడంతో నారవేణి మొగిలి పైకి ఎక్కాడు. అయితే అప్పటికే తొలగించిన ఫ్యూజ్‌లో మొగిలి చేయి తగలడంతో షాక్ కొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని అంబులెన్స్‌లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి భార్య నారవేణి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై రాజుతో కలిసి పరిశీలించారు.


