హైదరాబాద్‌ సహా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు | Heavy Rains to Lash Telangana: Hyderabad Braces for Wet Spell | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ సహా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Jun 26 2026 8:07 AM | Updated on Jun 26 2026 11:16 AM

Heavy Rains to Lash Telangana: Hyderabad Braces for Wet Spell

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి మళ్లీ బలంగా పుంజుకోవడంతో.. తెలంగాణలో వర్షాలు జోరందుకోనున్నాయి. ఈ నెలాఖరు దాకా నాన్‌స్టాప్‌ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో.. విస్తృతంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

రుతుపవనాల ప్రభావంతో రానున్న గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడే అవకాశముందని పేర్కొంటున్నారు. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌తో పాటు తూర్పు తెలంగాణలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అంచనా. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే.. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెబుతోంది.

హైదరాబాద్‌లో..
భాగ్యనగరంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులతో పాటు ఉరుములు, మెరుపులు నమోదయ్యే అవకాశముందని అంటోంది. దీంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా అధికారులు అప్రమత్తమవుతున్నారు. అయితే నగరంలో ఇప్పటికే పలు చోట్ల వర్షం ప్రారంభం కావడం గమనార్హం.

వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అటు.. రైతులు సైతం అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికార యంత్రాంగం చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement