
రైల్వేస్టేషన్‌లో పట్టాలపైకి నీరు.. కొద్దిసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం
గొల్లబుద్దారం ప్రభుత్వ పాఠశాలలోకి వరదనీరు.. 400 మంది విద్యార్థులకు ఇబ్బంది
వరద నీటిలో మునిగి ఓ వృద్ధురాలు మృతి
పర్వతగిరి మండలంలో పశువుల కాపరి గల్లంతు
సంగారెడ్డి జిల్లాలో వాగులో కొట్టుకుపోయి ఒకరు మృతి
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోనూ భారీ వర్షాలు
సాక్షి, వరంగల్/ఖమ్మం/నల్లగొండ నెట్‌వర్క్: వరంగల్ నగరాన్ని వరద ముంచెత్తింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్ రైల్వేస్టేషన్‌లో ఉన్న మూడు పట్టా లైన్లు నీట మునిగి రైళ్ల రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది నీటిని బయటకు పంపడంతో రైళ్ల రాకపోకలు సాగాయి.
హంటర్ బ్రిడ్జ్ రోడ్డులోకి భారీగా వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాశీకుంట వాంబేకాలనీలోని ఇంట్లోకి నీరు వచ్చి మంచం మునగడంతో దానిపై పడుకున్న వృద్ధురాలు పసునూటి బుచ్చమ్మ చనిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్న వారిని పోలీసులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఖిలా వరంగల్ కోట నీటిలో మునిగింది.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామంలో గేదెలను బయటకు తోలేందుకు ఆకేరు వాగులో దిగిన పశువుల కాపరి కందికగ్ల ఉప్పలయ్య వరదనీటిలో గల్లంతయ్యారు. ∙గొల్లబుద్దారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలకు వరద ప్రవా హం ఒక్కసారిగా పెరిగిపోవడంతో పాఠశాల ప్రాంగణం ఒక చిన్న చెరువును తలపించింది. దాదాపు 400 మంది విద్యార్థులు పాఠశాల లోపలే చిక్కుకుపోయి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఖమ్మం జిల్లాలో....
ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పాలేరు రిజర్వాయర్ సామర్థ్యం 23 అడుగులు కాగా 23.15 అడుగులు, వైరా రిజర్వాయర్ 18.03 అడుగులకుగాను 18.08 అడుగుల మేర ప్రవాహంతో పోటెత్తుతున్నాయి. ఇక తిరుమలాయపాలెం మండలం రాకాసితండాను గతేడాది ఆ కేరు వరద ముంచెత్తగా ఈసారి మంగళవారం సాయంత్రాని కి ఆకేరు వరద పెరిగి సీతారామ ఆక్వాటెక్ట్‌కు తాకి ప్రవహి స్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో....
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామం వద్ద వలిగొండ– తొర్రూరు ప్రధాన రహదారిపై బ్రిడ్జి పనులు సాగుతుండగా, తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. వరద నీరు దిగువకు వెళ్లక అక్కడే చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వెలిశాలలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వ లైనింగ్ దెబ్బతిన్నది. భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు, రుద్రవెల్లి గ్రామాల మధ్య గల లోలెవల్ బ్రిడ్జి పై నుంచి మూసీనది ఉధృతి కొనసాగింది. దీంతో పోచంపల్లి నుంచి బీబీనగర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.
సంగారెడ్డి జిల్లాలో....
రాయికోడ్(అందోల్): సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం యూసుఫ్‌పూర్ గ్రామానికి చెందిన ఎం. శ్రీనివాస్(35) మంగళవారం రాయికోడ్ నుంచి స్వగ్రామానికి పయనమ య్యాడు. గ్రామ సమీపానికి చేరుకోగానే వాగులో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీనివాస్ వరద నీటిలో నుంచి గ్రామం వైపు దాటేందుకు ప్రయత్నించాడు. వరద ఉధృతికి ఒక్కసారిగా వరద నీటిలో కొట్టుకుపోయి మరణించాడు.
నీళ్లు నిలిచి.. ఒండ్రు చేరి..
సంగారెడ్డి జిల్లాలో పత్తి చేలన్నీ నీట మునిగాయి. కొన్ని చోట్ల మొక్కలు ఎర్రగా, మరికొన్నిచోట్ల నల్లగా మారి మురిగిపోయాయి. భారీ వర్షం పడినప్పుడు పొలాల్లో నీళ్లు పారుతుండటంతో ఒండ్రుమట్టి వచ్చి చేరుతోంది.
